విశాఖ సిటీ: బీచ్ రోడ్డులో వరుణ్ హాస్పిటాలిటీ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ చేపట్టిన స్టార్ హోటల్ నిర్మాణంపై ఆంధ్రప్రదేశ్ కోస్టల్ జోన్ మేనేజ్‌మెంట్ అథారిటీ(ఏపీసీజెడ్‌ఎంఏ) స్పందించింది. సీఆర్‌జెడ్ పరిధిలో బోర్లు తవ్వడంపై అభ్యంతరం వ్యక్తం చేసింది. వెంటనే దీనిపై స్వయంగా విచారించి తీసుకున్న చర్యల నివేదికను సమర్పించాలని కలెక్టర్ హరేందిర ప్రసాద్‌ను ఆదేశించింది. గేట్ వే హోటల్ స్థలంలో వరుణ్ హాస్పిటాలిటీ ప్రైవేట్ లిమిటెడ్ ఒక ఫైవ్ స్టార్ హోటల్ నిర్మాణం చేపడుతోంది. ఇందుకోసం సదరు సంస్థ తీర ప్రాంతానికి 150 మీటర్ల లోపే బోర్లు తీస్తోంది. దీనిపై జనసేన కార్పొరేటర్ పీతల మూర్తియాదవ్ ఏపీసీజెడ్‌ఎంఏకు ఫిర్యాదు చేశారు. సీఆర్‌జెడ్ నోటిఫికేషన్ 2011 ప్రకారం తీర ప్రాంతానికి 150 మీటర్ల లోపు బోర్లు వేయడమే కాకుండా హైకోర్టు ఆదేశాల ప్రకారం తీర ప్రాంతానికి సమీపంలో భూగర్భం నుంచి నీటిని తోడడం నిషేధమని ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు. దీనిపై ఏపీసీజెడ్‌ఎంఏ స్పందిస్తూ. కలెక్టర్‌కు లేఖ రాసింది. వెంటనే జీవీఎంసీ కమిషనర్, గ్రౌండ్ వాటర్ అండ్ వాటర్ ఆడిట్ డిపార్ట్‌మెంట్ డిప్యూటీ డైరెక్టర్లు నేరుగా నిర్మాణం జరుగుతున్న ప్రాంతాన్ని తనిఖీ చేయాలని ఆ లేఖలో పేర్కొంది. అలాగే దానిపై తీసుకున్న చర్యలను నివేదిక రూపంలో సమర్పించాలని ఏపీసీజెడ్‌ఎంఏ మెంబర్ సెక్రటరీ ఎస్.శ్రీ శరవణన్ ఆదేశించారు.
Comments
Please login to add a commentAdd a comment