
హోటళ్లలో ఆకస్మిక తనిఖీలు
విశాఖ సిటీ : నగరంలోని హోటళ్లు, లాడ్జీల్లో పోలీసులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. జోన్–1, జోన్–2 పరిధిలో 78 బృందాలతో 96 హోటళ్లు, లాడ్జీల్లో ఏకకాలంగా బాడీ వార్న్, మొబైల్ కెమెరాలను వినియోగిస్తూ సోదాలు చేపట్టారు. అతిథుల జాబితాలో పరారీ నిందితులు, ఎన్‌బీడబ్ల్యూలు ఉన్న వారు, వీసా, పాస్‌పోర్ట్ లేని, వీసా అనుమతికి మించి ఉన్న వారి కోసం తనిఖీ చేశారు. అసాంఘిక కార్యక్రమాలపైనే కాకుండా ఫైర్ ఎన్‌వోసీ, ట్రేడ్ లైసెన్స్, జీఎస్టీ, ఫుడ్ లైసెన్స్, మద్యం అమ్మకాలు, సీసీ టీవీల పనితీరు ఇలా అన్ని అంశాలను పరిశీలించారు.
అనుమతులు లేకుండానే వ్యాపారాలు : పోలీసుల తనిఖీల్లో విస్తుపోయే వాస్తవాలు వెలుగులోకి వచ్చాయి. ఫైర్ ఎన్‌వోసీ, జీఎస్టీ, ట్రేడ్ లైసెన్సులు లేకుండానే హోటళ్లు, లాడ్జీలు నిర్వహిస్తున్నట్లు మరోసారి వెల్లడైంది. ఇప్పటికే పలుమార్లు పోలీసుల తనిఖీల్లో ఈ విషయం నిర్ధారణ అయినప్పటికీ.. సంబంధిత శాఖ అధికారులు ఇప్పటికీ వాటిపై ఎటువంటి చర్యలు తీసుకోకపోవడం గమనార్హం. పోలీసుల తాజాగా తనిఖీల్లో కూడా పదుల సంఖ్యలో హోటళ్లు, లాడ్జీలు అనుమతులు లేకుండా వ్యాపారాలు చేస్తున్నట్లు స్పష్టమైంది. 42 హోటళ్లు, లాడ్జీలలకు అగ్నిమాపక ఎన్‌వోసీలు లేనట్లు గుర్తించారు. అలాగే 12 సముదాయాలకు ట్రేడ్ లైసెన్సులు, మరో 12 హోటళ్లకు ఫుడ్ లైసెన్సులు, 17 వ్యాపారాలకు జీఎస్టీ సర్టిఫికెట్లు లేనట్లు నిర్ధారణైంది. అదే విధంగా రెండు హోటళ్లలో సందర్శకుల రికార్డులు నిర్వహించడం లేదని, 14 హోటళు, లాడ్జీలలో విజిటర్స్ మోనిటరింగ్ సిస్టమ్‌లో సందర్శకుల సమాచారాన్ని అప్‌డేట్ చేయ డం లేదని, 2 హోటళ్లలో సీసీటీవీలను పర్యవేక్షించడం లేదని వెల్లడైంది. వ్యాపారులు తప్పనిసరిగా నిబంధనలు అనుసరించాలని, పాటించని వారిపై చట్ట ప్రకారం కేసులు నమోదు చేస్తామని నగర పోలీస్ కమిషనర్ డాక్టర్ శంఖబ్రత బాగ్చి నిర్వాహకులను హెచ్చరించారు.
78 పోలీస్ బృందాలతో 96 హోటళ్లు, లాడ్జీల్లో సోదాలు
ఫైర్ ఎన్‌వోసీలు లేకుండా 42 హోటళ్లు, లాడ్జీల నిర్వహణ
Comments
Please login to add a commentAdd a comment