
అర్జీలకు సత్వర పరిష్కారం చూపాలి
మహారాణిపేట: ప్రజా సమస్యల పరిష్కార వేదిక లో వచ్చిన అర్జీలను 24 గంటలలోపు ఓపెన్ చేసి, పూర్తి స్థాయిలో విచారణ చేపట్టి, పునరావృతం కాని విధంగా సంతృప్తి కరమైన పరిష్కారం చూపాలని కలెక్టర్ ఎం.ఎన్.హరేందిర ప్రసాద్ అధికారులను ఆదేశించారు. జిల్లాలో ఎన్నికల కోడ్ ముగిసిన నేపథ్యంలో ‘ప్రజా సమస్యల పరిష్కార వేదిక‘ కార్యక్రమాన్ని సోమవారం కలెక్టరేట్ నిర్వహించారు. వివిధ ప్రాంతాల ప్రజల నుంచి అర్జీలను కలెక్టర్‌తో జాయింట్ కలెక్టర్ మయూర్ అశోక్, జిల్లా రెవెన్యూ అధికారి భవానీ శంకర్, జీవీఎంసీ అడిషనల్ కమిషనర్ వర్మ స్వీకరించారు.
అధికారులతో సమీక్ష : ప్రజా సమస్యల పరిష్కార వేదిక ప్రారంభానికి ముందుగా అధికారులతో కలెక్టర్ సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర జిల్లాలో రీ–ఓపెన్ అర్జీలు తరచుగా రావడంపై అధికారులపై కలెక్టర్ అసంతృప్తి వ్యక్తం చేశారు. దీపం పథకం అమలు, లబ్ధిదారుల ఖాతాలకు సబ్సిడీ అందుతున్నది లేనిది గమనించాలని సివిల్ సప్లై అధికారులను కలెక్టర్ ఆదేశించారు. జిల్లాలో ఇసుక లభ్యత, వినియోగంపై సంబంధిత అధికారులను అడిగి తెలుసుకున్నారు. జిల్లాలో పీ4 సర్వేపై అధికారులకు కలెక్టర్ దిశా నిర్దేశం చేశారు. సోమవారం నిర్వహించిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికకు మొత్తం 332 వినతులు అందాయి. వాటిలో రెవెన్యూ శాఖకు చెందినవి 131 ఉండగా, పోలీసు శాఖకు సంబంధించినవి 24, జీవీఎంసీ సంబంధించి 111 ఉన్నాయి. అలాగే ఇతర విభాగాలకు సంబంధించి 66 వినతులు వచ్చాయి.
పీజీఆర్‌ఎస్‌లో వినతులు స్వీకరించిన కలెక్టర్ హరేందిర ప్రసాద్
Comments
Please login to add a commentAdd a comment