
రోగులంటే ఇంత చులకనా?
ఎంజీఎం: జిల్లా మంత్రి కొండా సురేఖ, ఎమ్మెల్యేలకు కావాల్సింది ఓట్లు మాత్రమే వారికి పేద ప్రజల గోస.. ఎంజీఎం ఆస్పత్రిలో నెలకొన్న సమస్యలు కానరావు అంటూ.. బీజేపీ నాయకులు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఎంజీఎం ఆస్పత్రిలో నెలకొన్న సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ బుధవారం జిల్లా అధ్యక్షుడు గంటా రవికుమార్ ఆధ్వర్యంలో మహాధర్నా నిర్వహించారు. నాయకులు మాట్లాడుతూ.. ప్రజలు సురేఖను నమ్మి గెలిపించి మంత్రి పదవి ఇస్తే ఒరగబెట్టిందేంటని ప్రశ్నించారు. జిల్లా నుంచి ఇద్దరు మంత్రులున్నా ఏం లాభమని ప్రశ్నించారు. ఆస్పత్రిలో వీల్‌చైర్లు, స్ట్రెచర్లు, టుడీ ఎకో, ఈసీజీ పరీక్షలు సక్రమంగా చేయని దుస్థితి నెలకొందన్నారు. ఓరుగల్లు రెండో రాజధానిగా పేర్కొంటున్న సీఎం, వైద్య ఆరోగ్యశాఖ మంత్రులు ఆస్పత్రిలో సమస్యలు తాండవం చేస్తుంటే ఒక్కసారైనా సందర్శించారా? అని ప్రశ్నించారు. ఆస్పత్రికి వెంటనే అడిషనల్ డీఎంఈ పోస్టును భర్తీ చేసి పూర్తి స్థాయి సూపరింటెండెంట్‌ను నియమించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గుజ్జుల ప్రేమేందర్‌రెడ్డి, రాష్ట్ర నాయకులు ఎర్రబెల్లి ప్రదీప్‌రావు, డాక్టర్ కాళీప్రసాద్, తక్కళ్లపల్లి రాజేశ్వర్‌రావు, వన్నాల వెంకటరమణ, కుసుమ సతీశ్, రత్నం సతీశ్, చాడ శ్రీనివాస్‌రెడ్డి, సముద్రాల పరమేశ్వర్ తదితరులు పాల్గొన్నారు.
సురేఖమ్మా..
ఎంజీఎం గోస పట్టదా?
ఆస్పత్రి సమస్యలపై
బీజేపీ మహాధర్నా