
పట్టు రైతులకు అవగాహన సదస్సు
పట్టు పరిశ్రమ జేడీ అనసూయ
ఎల్కతుర్తి: భీమదేవరపల్లి, ఎల్కతుర్తి మండలాల పట్టు రైతులకు శుక్రవారం ఎల్కతుర్తి రైతు వేదికలో అధికారులు అవగాహన సదస్సు నిర్వహించారు. సదస్సులో పట్టుపరిశ్రమ జిల్లా సంయుక్త సంచాలకురాలు (జేడీ) అనసూయ ముఖ్య అతిథిగా హాజరై రైతులనుద్దేశించి మాట్లాడారు. పట్టు పురుగుల పెంపకం రైతులు సాగు చేసిన మల్బరీ తోటల్లో సేంద్రియ ఎరువులు వాడడం వల్ల ఆకు నాణ్యత పెరిగి అధిక దిగుబడి వచ్చే అవకాశం ఉందన్నారు. సిల్క్ సమగ్ర–2 పథకం కింద కొత్తగా మల్బరీ నాటే ఎస్సీ, ఎస్టీ రైతులకు రీలింగ్ షెడ్ నిర్మాణానికి రూ.2,92,500, మల్బరీ నాటినందుకు రూ.78 వేలు సబ్సిడీ ఇవ్వనున్నట్లు ఆమె వెల్లడించారు. అలాగే 300 నేత్రికలు, 10 ట్రేలు, ఇలిగేషన్ కోసం రూ.60 వేలు ఇవ్వనున్నట్లు తెలిపారు. బీసీ, ఓసీ రైతులకు షెడ్ నిర్మాణానికి రూ.2.25 లక్షలు, 300 నేత్రికలు, 10 ట్రేలు, 2,500 రోగనిరోధక మందులు ఇవ్వనున్నట్లు తెలిపారు. ఈ అవకాశాన్ని రైతులు సద్వినియోగపర్చుకోవాలన్నారు. కార్యక్రమంలో అధికారులు సారంగపాణి, సంజీవరెడ్డి పాల్గొన్నారు.