
హాస్టళ్లలో మెస్ చార్జీలు పెంచాలి
భీమవరం: ప్రభుత్వ హాస్టళ్లలో సౌకర్యాలు తప్పనిసరిగా మెరుగుపర్చాలని ఎమ్మెల్సీ వంక రవీంద్రనాథ్ అన్నారు. శాసనసభ బడ్జెట్ సమావేశాల సందర్భంగా శుక్రవారం ఆయన శాసన మండలిలో మాట్లాడారు. వైఎస్ జగన్ సీఎంగా ఉండగా 2023లో అప్పటి ప్రభుత్వం హాస్టళ్ల మెస్ చార్జీలు, మెయింటెనెన్స్ చార్జీలు పెంచిందని గుర్తు చేశారు. ఇటీవల కందిపప్పు, మినప్పప్పు, వంటనూనె వంటి ధరలు 35 శాతం పెరిగాయని, అందువల్ల ప్రస్తుత ప్రభుత్వం మార్కెట్ ధరలను దృష్టిలో పెట్టుకొని మెస్ చార్జీలను వెంటనే పెంచాలని ప్రభుత్వాన్ని కోరారు. పోస్ట్ మెట్రిక్ హాస్టళ్లలో అవుట్‌సోర్సింగ్ సిబ్బందిని నియమించే అవకాశం లేనందున లోపాయికారీగా వంట మనిషి, స్వీపర్‌ను నియమించుకుని వారికి విద్యార్థుల మెస్ చార్జీల నుంచే జీతాలు చెల్లించడంతో విద్యార్థులకు మెనూ అమలు చేయడం కష్టతరంగా మారిందన్నారు. మెస్ చార్జీలు అంతంతమాత్రంగా ఉండటంతో హాస్టళ్ల నిర్వహణ కష్టంగా మారిందన్నారు. దీనిపై సాంఘిక సంక్షేమ మంత్రి స్పందిస్తూ.. ఈ విషయంపై త్వరలో సమీక్ష చేసి సభ్యుల సూచనలతో విధివిధానాలు రూపొందిస్తామని చెప్పారు.
బలుసుమూడిలో కేంద్ర మంత్రి తండ్రి అంత్యక్రియలు
భీమవరం : కేంద్ర ఉక్కు, భారీ పరిశ్రమల శాఖ సహాయమంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మ తండ్రి సూర్యనారాయణరాజు అంత్యక్రియలు శుక్రవారం భీమవరం పట్టణం బలుసుమూడిలోని మోక్షధామంలో నిర్వహించారు. అనారోగ్యంతో హైదరాబాద్‌లోని ఆసుపత్రిలో చికిత్స పొందుతూ గురువారం మృతిచెందిన సూర్యనారాయణరాజు మృతదేహాన్ని శుక్రవారం ఉదయం పట్టణంలోని నర్సయ్య అగ్రహారంలోని స్వగృహానికి తరలించి ప్రజల సందర్శనార్ధం ఉంచారు. సూర్యనారాయణరాజు మృతదేహాన్ని కలెక్టర్ చదలవాడ నాగరాణి, ఎస్పీ అద్నాన్ నయీం అస్మి, జాయింట్ కలెక్టర్ టి.రాహుల్‌కుమార్‌రెడ్డి, డీఎస్పీ ఆర్‌జే జయసూర్య వివిధ రాజకీయపార్టీల నాయకులు సందర్శించి నివాళులర్పించారు. అనంతరం మృతదేహాన్ని ప్రత్యేక వాహనంలో తీసుకువెళ్లి అంత్యక్రియలు నిర్వహించారు. శ్రీనివాసవర్మను పరామర్శించిన వారిలో బీజేపీ మాజీ అధ్యక్షుడు సోము వీర్రాజు తదితరులున్నారు.
తాటిచెట్టు పడి వ్యక్తి మృతి
పెదవేగి: ప్రమాదవశాత్తు తాటిచెట్టు మీద పడడంతో వ్యక్తి మృతి చెందాడు. పెదవేగి ఎస్సై కె రామకృష్ణ తెలిపిన వివరాలు ప్రకారం.. పెదవేగి మండలం నడిపల్లి గ్రామానికి చెందిన మట్టా పోతురాజు శుక్రవారం జేసీబీ సాయంతో తోటలో కట్టవా బాగుచేస్తుండగా ప్రమాదవశాత్తు తాడిచెట్టు మీద పడి తీవ్రంగా గాయపడ్డాడు. స్థానికులు ఏలూరు ఆసుపత్రికి తరలించగా, వైద్యులు అప్పటికే పోతురాజు(55) మృతిచెందినట్లు నిర్దారించారు. మరో ఇద్దరికి గాయాలయ్యాయని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై తెలిపారు.

హాస్టళ్లలో మెస్ చార్జీలు పెంచాలి
Comments
Please login to add a commentAdd a comment