
ధార్మిక చింతనకు ప్రతీక.. రంజాన్
●
దైవ భీతిని కలుగజేస్తుంది
ఉపవాసం మనిషిలో దైవ భీతిని కలుగజేస్తుంది. అల్లాహ్‌కు వినమ్రంగా మారుస్తుంది. ఉపవాసం ఉండే మనిషికి మనసు మీద నియంత్రణ సులువు అవుతుంది. ఆరోగ్యంతో పాటు ఇతరుల పట్ల సోదర భావం పెరుగుతుంది. ఆకలితో ఉన్నవారు, అవసరాలతో ఉన్న వారి పట్ల దయా గుణం పెరుగుతుంది. త్యాగ నిరతిని పెంపొందించే ఉపవాస దీక్షలు ప్రతి ముస్లిం విధిగా చేయాలి.
– మహమ్మద్ అబ్దుల్ వదూద్,
జామియ మస్జిద్ ఇమామ్
దయాగుణం పెరుగుతుంది
రంజాన్ ఉసవాసాల వల్ల పాపాలు తుడిచి పెడ్తాయి. ఆరోగ్యంతో పాటు ఇతరుల పట్ల సోదర భావం పెరుగుతుంది. ఆకలితో ఉన్నవారు, అవసరాలతో ఉన్న వారి పట్ల దయాగుణం పెరుగుతుంది. నెల రోజుల ఉపవాసాల వల్ల పుణ్యం కలుగుతుంది.
– సయ్యద్ రహీం (బాబు),జామియ మస్జిద్ కమిటీ అధ్యక్షుడు
చింతలపూడి: ముస్లింలకు అతి పవిత్రమైన రంజాన్ నెల ఉపవాసాలు ఆదివారం నుంచి ప్రారంభం అవుతున్నాయి. శనివారం నెల వంక దర్శనంతో రంజాన్ మాసం ప్రారంభమవుతుంది. పవిత్ర ఖురాన్ అవతరించిన మాసంగా ముస్లింలు విశ్వసించే ఈ నెలంతా ఉపవాసాలు, ప్రత్యేక ప్రార్థనలు, దాన ధర్మాలతో గడుపుతారు. రోజూ మొత్తం ఆరాధనలోనే ఎక్కువ సమయం గడుపుతారు. ఖురాన్ ప్రకారం రంజాన్ నెలలో విధిగా ఉపవాస వ్రతాన్ని పాటిస్తారు. రంజాన్ నెల ముస్లిం విశ్వాసుల పండుగ. అభిమానానికి, స్నేహానికి ప్రతీకగా దీనిని ఆచరిస్తారు. రంజాన్ నెలలో ముస్లింలు క్రమశిక్షణ, దాతృత్వం, ధార్మిక చింతనతో అల్లాహ్‌ను ప్రార్థిస్తారు. జిల్లాలోని ఏలూరు, జంగారెడ్డిగూడెం, చింతలపూడి, నూజివీడు, కై కలూరు, పట్టణాల్లో రంజాన్ పండుగను ముస్లింలు ఏటా ఘనంగా జరుపుకుంటారు.
నిష్టతో ఉపవాసాలు
రంజాన్ మాసం ప్రారంభమైన నాటినుంచి ముగిసేవరకు ముస్లింలు పగలు నిష్టగా (రోజా) ఉపవాస దీక్షలను పాటిస్తారు. కేవలం ఆహార పానీయాలను మానేయడం మాత్రమే కాకుండా నియమాలతో కూడుకున్న జీవన విధానాన్ని ఆచరిస్తారు. తెల్లవారుజామున ఆహారం తీసుకోవడాన్ని సహర్ అని, సాయంత్రం ఉపవాస దీక్ష విరమణలో తీసుకునే ఆహారాన్ని ఇఫ్తార్ అని అంటారు. ఇలా ప్రతి రోజు సుమారు 13 గంటలపాటు కఠిన ఉపవాస దీక్షను అవలంభిస్తారు. ఒకవేళ ఏదైనా అనారోగ్యంతో ఉపవాసం ఉండలేకపోతే అలాంటి వారు రంజాన్ తర్వాత వాటిని పూర్తి చేయాల్సి ఉంటుంది.
షబ్–ఎ–ఖద్ర్
రంజాన్ నెల ప్రారంభమైన 27వ రోజు షబ్–ఎ–ఖద్ర్ ను ముస్లింలు జరుపుకుంటారు. ఈ రోజున దివ్య ఖురాన్ అవతరించిందని ముస్లింల విశ్వాసం. ఈ రోజున రాత్రంతా జాగరణ చేసి ప్రార్థనలతో గడుపుతారు. ఆ రాత్రి భక్తి శ్రద్ధలతో ప్రార్థనలు చేసిన వారికి ఎన్నో సంవత్సరాల పాటు ప్రార్థనలు చేస్తే వచ్చే పుణ్యం దక్కుతుందని విశ్వాసం.
జకాత్
ముస్లింలకు నమాజ్, రోజా ప్రకారమే జకాత్ కూడా నిర్ణయింపబడింది. దైవం కోసం, దైవ ప్రసన్నత పొందడానికి ఒక బాధ్యతగా సంపదలో కొంత మొత్తాన్ని పేదలకు అందించడమే జకాత్ ముఖ్య ఉద్దేశం. రంజాన్ నెలలోనే ముస్లింలు విధిగా జకాత్ చెల్లిస్తారు. పేద, ధనిక అంతరాలను రూపు మాపడానికి జకాత్ తోడ్పడుతుందని నమ్ముతారు. జకాత్ అంటే పరిశుధ్ధ పరిచేది అని అర్థం
ఫిత్రా
రంజాన్ నెల అంతా నమాజులు, ఉపవాసాలు, జకాత్ చెల్లించడంతో పాటు నెల ముగిసి పండుగ జరుపుకునే ముందు ఫిత్రా అంటే దానం. పేదలు కూడా పండుగ రోజు సంతోషంగా పాల్గొనాలని చేసిన ఏర్పాటు ఇది. కుటుంబంలో ఎంత మంది సభ్యులు ఉంటే అందరి తరుపున విధిగా ఫిత్రా చెల్లిస్తారు. ఒక్కో ఫిత్రా కింద రెండున్నర కిలోల ఆహార ధాన్యాలు, లేదా అందుకు సమానమైన నగదు చెల్లించాలి.
హలీద
ప్రతిదినం ఇఫ్తార్ సమయంలో సేవించే హలీద(జావ)కు కొన్ని ప్రత్యేకతలు ఉంటాయి. మసాలా దినుసులతో పాటు ప్రత్యేక ఆహార పదార్థాలతో దీన్ని తయారు చేస్తారు. బొంబాయి రవ్వ, బియ్యం రవ్వ, మేక మాంసం తదితర పదార్థాలను కలిపి జావ తయారు చేస్తారు. దీనిని మట్టి పాత్రలలో సేవిస్తారు.
షవ్వాల్
ఉపవాస దీక్షలు నెలఅంతా కొనసాగిన అనంతరం నెలవంక ప్రత్యక్షమవగానే ఉపవాస దీక్షలను విరమిస్తారు. దీనినే షవ్వాల్ అంటారు. మరుసటి రోజున పండుగను అత్యంత భక్తి శ్రధ్ధలతో సంతోషాలతో జరుపుకుంటారు. ఉపవాస దీక్షలకు మసీదులను సిధ్ధం చేస్తున్నారు.
నేటి నుంచి రంజాన్ ఉపవాస దీక్షలు ప్రారంభం
ప్రత్యేక ప్రార్థనలు, ధార్మిక చింతనలో ముస్లింలు
పది రోజులకో ప్రత్యేకత
30 రోజుల ఉపవాస దినాల్లో ప్రతి 10 రోజులకు ఓ ప్రత్యేకత ఉంది. మొదటి 10 రోజులు కారుణ్య దినాలుగా భావిస్తారు. అల్లాహ్ కారుణ్యం కోసం ఈ పది రోజులు ఉపవాసం ఉంటారు. 11 నుంచి 20వ రోజు వరకు క్షమాభిక్ష దినాలుగా పరిగణిస్తారు. తమ పాపాలను క్షమించమని అల్లాహ్‌ను వేడుకుంటూ ఉపవాసాలు ఉంటారు. చివరి పదిరోజులు నరకాగ్ని నుంచి కాపాడమని దువాలు చేస్తూ ఉపవాసాలు పాటిస్తారు.

ధార్మిక చింతనకు ప్రతీక.. రంజాన్

ధార్మిక చింతనకు ప్రతీక.. రంజాన్
Comments
Please login to add a commentAdd a comment