
తేనెటీగల పెంపకంతో అధిక ఆదాయం
ఉండి: తేనెటీగల పెంపకంతో పలు విధాలుగా అధిక ఆదాయం లభిస్తుందని అధికారులు, శాస్త్రవేత్తలు వివరించారు. మండలంలోని ఎన్నార్పీ అగ్రహారం కృషీ విజ్ఞాన కేంద్రంలో శాసీ్త్రయ పద్ధతిలో తేనెటీగల పెంపకంపై ఏడురోజుల శిక్షణ కార్యక్రమాన్ని శనివారం ప్రారంభించారు. ముఖ్య అతిథులుగా మార్టేరు ప్రాంతీయ పరిశోధనా కేంద్రం సహ సంచాలకుడు డాక్టర్ టీ శ్రీనివాస్, జిల్లా వ్యవసాయాధికారి జడ్ వెంకటేశ్వర్లు, జిల్లా ఉద్యానశాఖ అధికారి ఆర్ దేవానంద్ హాజరై మాట్లాడారు. మానవజాతి మనుగడకు తేనెటీగలు ఎంతో ఉపయోకరమని అన్నారు. తేనెటీగలు లేకపోతే మొక్కల్లో సంపర్కం జరగక పూత రాలిపోయి కాయలు కాయవని అన్నారు. దీంతో పండు, కూరగాయల ఉత్పత్తి గణణీయంగా పడిపోతుందన్నారు. కాబట్టే ఔత్సాహికులు ఎక్కువ మంది తేనెటీగల పెంపకాన్ని చేపట్టాలన్నారు. కరోనా తరువాత తేనె ఉత్పత్తులకు డిమాండ్ గణనీయంగా పెరిగిందని, తేనెటీగల పెంపకాన్ని ప్రభుత్వం ప్రోత్సహిస్తూ రూ.లక్ష వరకు సబ్సిడీ పథకాలు అందిస్తున్నారన్నారు. ఈ రంగంలో ఉన్న అవకాశాలను యువత అందిపుచ్చుకోవాలని కోరారు. కేవీకే ప్రోగ్రాం కోఆర్డినేటర్ డాక్టర్ ఎన్ మల్లిఖార్జునరావు మాట్లాడుతూ తేనెటీగల పెంపకం ద్వారా తేనెతో పాటు మైనం, విషం, ప్రోపోలిన్, పుప్పొడి, రాయల్ జెల్లీ వంటి ఉప ఉత్పత్తుల ద్వారా అధిక ఆదాయాన్ని పొందవచ్చునన్నారు. కార్యక్రమంలో ఏడీఏలు కేఎస్‌ఎస్ శ్రీనివాస్,, సీహెచ్ శ్రీనివాస్, ప్రకృతి వ్యవసాయం జిల్లా సమన్వయకర్త ఎం అరుణకుమారి, కేవీకే శాస్త్రవేత్తలు డాక్టర్ ఎన్ దెబోరామెస్సియానా, డాక్టర్ ఏ శ్రీనివాస్, డాక్టర్ ఆర్ బిందుప్రవీణ, డాక్టర్ పీ వినయలక్ష్మి, ఔత్సాహికులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment