
అగ్గి.. రాజుకుంటే బుగ్గే!
ఆలస్యంగా వాహనం.. రూ.10 లక్షల నష్టం
సాక్షి, భీమవరం: ఈ ఏడాది వేసవిలో రికార్డు స్థాయి లో ఉష్ణోగ్రతలు నమోదవుతాయని ఇప్పటికే వాతావరణశాఖ ప్రకటించింది. అందుకు తగ్గట్టు అప్పుడే ఎండలు మండిపోతున్నాయి. 38 నుంచి 40 డిగ్రీల ఉష్ణోగ్రతలతో సూర్యుడు నిప్పులు చెరుగుతూ ప్రమాద ఘంటికలు మోగిస్తున్నాడు. మిగిలిన రో జులతో పోలిస్తే వేసవిలో అగ్నిప్రమాదాలు ఎక్కువగా జరుగుతాయి. గత వారం రోజుల్లో జిల్లావ్యాప్తంగా పలు ప్రమాదాలు చోటుచేసుకున్నాయి. అధి క శాతం గ్యాస్ లీకేజీ, విద్యుత్ వినియోగం పెరిగి షార్ట్ సర్క్యూట్ ఏర్పడటం, ఓల్టేజీలో హెచ్చుతగ్గులు, ఓవర్‌లోడ్ కారణంగా సింగిల్ ఫేజ్, త్రీఫేజ్ లైన్లు తరచూ ట్రిప్‌అయ్యి ఇళ్లల్లో ప్రమాదాలు సంభవిస్తుంటే, వరి కోతలు అనంతరం పొలాల్లోని గడ్డి కి నిప్పు పెట్టడం, చుట్టా, సిగరెట్లను ఆర్పకుండా నిర్లక్ష్యంగా పారేయడం తదితర కారణాలు బహిరంగ ప్రదేశాల్లో ప్రమాదాలకు హేతువులవుతున్నాయి.
అగ్నిమాపకం.. సమస్యలు అనేకం
జిల్లాలో ఏడు ఫైర్‌స్టేషన్లకు గాను జనావాసాలు ఎక్కువగా ఉన్న భీమవరం, పాలకొల్లులో డబుల్ యూనిట్ ఫైర్‌స్టేషన్లు ఉన్నాయి. మిగిలిన ఫైర్ స్టేషన్ల సిబ్బందితో పోలిస్తే రెట్టింపు ఉండేలా గతంలో వీటిని ఏర్పాటుచేశారు. భీమవరం, నరసాపురం ఫైర్ స్టేషన్లు శిథిలస్థితికి చేరుకున్నాయి. భీమవరం ఫైర్ స్టేషన్‌ను షెడ్డులో నిర్వహిస్తున్నారు. భీమవరంలో రూ.2 కోట్లు, నరసాపురంలో రూ.1.25 కోట్లతో నూతన భవన నిర్మాణాలకు పరిపాలన ఆమోదం లభించగా టెండర్ల ప్రక్రియ పూర్తి కావాల్సి ఉంది.
సిబ్బందిపై పనిభారం
ఫైర్‌స్టేషన్లకు సిబ్బంది కొరత సమస్యాత్మకంగా తయారైంది. ఏడు స్టేషన్ల పరిధిలో మంజూరైన పోస్టుల మేరకు అసిస్టెంట్ డిస్ట్రిక్ట్ ఫైర్ ఆఫీసర్లు ఇద్దరు, స్టేషన్ ఫైర్ ఆఫీసర్లు ఐదుగురు, లీడ్ ఫైర్‌మెన్లు 27 మంది, డ్రైవర్లు 25 మంది, ఫైర్‌మెన్లు 83 మంది, హోంగార్డులు 24 మంది కలిపి మొత్తంగా 166 మంది ఉండాలి. కాగా 117 మంది మాత్రమే ఉన్నారు. స్టేషన్ ఫైర్ ఆఫీసర్ నుంచి పైస్థాయి వరకు కొరత లేనప్పటికీ ప్రమాద సమయంలో క్షేత్రస్థాయిలో కీలకంగా పనిచేసే ఫైర్‌మెన్, డ్రైవర్, హోంగార్డ్ పోస్టులు ఖాళీలు ఉండటం సమస్యాత్మకంగా తయారైంది. 49 ఖాళీ పోస్టుల్లో ఫైర్‌మెన్లు 35, డ్రైవర్లు తొమ్మిది, హోంగార్డులు ఐదు ఉన్నా యి. దీంతో ఉన్న కొద్దిమంది సిబ్బందిపై విపరీతమైన పనిభారం పడుతోంది.
సకాలంలో చేరలేక.. మంటలు ఆర్పలేక..
భీమవరం, పాలకొల్లు ఫైర్‌స్టేషన్ల పరిధిలో చుట్టుపక్కల ఐదారు మండలాలు ఉండగా నరసాపురం పరిధిలో తీరప్రాంత గ్రామాలు ఉన్నాయి. పాలకొల్లు, తణుకు, తాడేపల్లిగూడెం, భీమవరంలోని పలు ప్రాంతాల్లో విద్యుత్ వైర్లు కిందకి ఉండటం, రోడ్ల పక్కన ఆక్రమణలు, ట్రాఫిక్ రద్దీ ఫైర్ ఇంజన్లు మారుమూల ప్రాంతాలకు వెళ్లేందుకు ప్రతిబంధకమవుతున్నాయి. 20 నుంచి 30 కిలోమీటర్ల దూరంలో ప్రమాదం సంభవించినప్పుడు ఫైర్ ఇంజన్ వచ్చేసరికి సర్వం బూడిదైపోతోందని స్థానికులు ఆవేదన చెందుతున్నారు. ఆయా సమస్యల పరిష్కారానికి అధికారులు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. ఈ ఆర్థిక సంవత్సరం (2024– 25)లో జిల్లాలో 428 అగ్నిప్రమాదాల్లో రూ.4.35 కోట్ల నష్టం వాటిల్లింది.
జిల్లాలో అగ్నిప్రమాదాలు
సంవత్సరం ప్రమాదాలు ఆస్తి రక్షించిన
నష్టం ఆస్తి విలువ
(రూ.కోట్లలో) (రూ.కోట్లలో)
2022–23 417 10.56 34.39
2023–24 449 4.98 12.67
2024–25 428 4.35 20.19
ప్రమాదాల్లో ప్రాణనష్టం
సంవత్సరం ప్రాణనష్టం కాపాడిన
వారి సంఖ్య
2022–23 6 10
2023–24 2 1
2024–25 1 1
జిల్లాలో ఫైర్ స్టేషన్లు
ప్రాంతం ఫోన్ నంబర్
భీమవరం 08816–233299
పాలకొల్లు 08814–222299
తణుకు 08819–222101
తాడేపల్లిగూడెం 08818–221299
నరసాపురం 08814–275399
ఆకివీడు 08816–252099
అత్తిలి 08819–257977
వీరవాసరం మండలం రాయకుదురులోని రెండు పోర్షన్ల తాటాకింటిలో రెండు కుటుంబాలు నివసిస్తున్నాయి. శుక్రవారం విద్యుత్ షార్ట్ సర్క్యూట్‌తో ఇంటికి నిప్పంటుకుంది. వెంటనే స్థానికులు ఫైర్‌స్టేషన్‌కు సమాచారం అందించగా పాలకొల్లుకు చెందిన ఫైర్ ఇంజన్ వచ్చింది. అప్పటికే తాటాకిల్లు పూర్తిగా దగ్ధమై ఇంటిలోని నగదు, వస్తువులు, దుస్తులు అన్నీ అగ్నికి ఆహుతైపోయాయి. చుట్టుపక్కల వారు మంటలు ఆర్పే ప్రయత్నం చేసినా ఫలితం లేకపోయింది. ఈ ప్రమాదంలో రూ.10 లక్షల నష్టం వాటిల్లింది. ఫైర్ ఇంజన్ కొంత ముందుగా వచ్చి ఉంటే నష్టం తీవ్రత తగ్గి ఉండేదని స్థానికులు అంటున్నారు.
డేంజర్ బెల్స్
మార్చిలోనే మండుతున్న ఎండలు
అగ్నిమాపక కేంద్రాల్లో సమస్యల మంటలు
వేధిస్తున్న సిబ్బంది కొరత
ఫైర్‌మెన్ పోస్టులు 35, డ్రైవర్ పోస్టులు 9 ఖాళీ
పోస్టుల భర్తీకి చొరవ చూపని కూటమి సర్కారు
జిల్లాలో 428 అగ్నిప్రమాదాల్లో రూ.4.35 కోట్ల నష్టం
అప్రమత్తంతో ప్రమాదాల నివారణ
వేసవి దృష్ట్యా ఇప్పటికే జిల్లాలోని అన్ని ఫైర్ ఇంజన్లను సిద్ధం చేసి ఉంచాం. ప్రజలు అప్రమత్తంగా ఉండటం ద్వారా అగ్నిప్రమాదాలను నివారించవచ్చు. ప్రమాదాలను అరికట్టడంపై అవగాహన కార్యక్రమాల నిర్వహణకు చర్యలు తీసుకుంటున్నాం. ఖాళీ పోస్టుల భర్తీకి ఉన్నతాధికారులకు నివేదించాం. భీమవరం, నరసాపురంలో నూతన భవన నిర్మాణాలకు అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ వచ్చింది. ఆచంటలో కొత్త ఫైర్‌స్టేషన్ ఏర్పాటు నిమిత్తం ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపాం.
– జి.శ్రీనివాసరావు, జిల్లా అగ్నిమాపక శాఖ అధికారి

అగ్గి.. రాజుకుంటే బుగ్గే!
Comments
Please login to add a commentAdd a comment