
ఆక్వా రైతులకు సమాచారం ఇవ్వడం లేదని ఆగ్రహం
పాలకొల్లు సెంట్రల్: ప్రభుత్వం మారితే సమస్యలు పరిష్కారం అవుతాయనుకుంటే ప్రభుత్వాధికారులు కనీసం సమాచారం కూడా ఇవ్వడం లేదని ఆక్వా రైతులు మండిపడ్డారు. మంగళవారం పాలకొల్లు పట్టణంలోని జై భారత్ క్షీరా రామ ఆక్వా రైతు సంఘం సభ్యులు విలేకరు సమావేశం ఏర్పాటుచేశారు. ఈ సందర్బంగా సంఘ అధ్యక్షులు గొట్టుముక్కల గాంధీభగవాన్‌రాజు మాట్లాడుతూ గత ప్రభుత్వంలో ఏర్పాటు చేసిన అప్సడా సంఘాన్నే కొనసాగిస్తూ ఆనం రమణారెడ్డిని వైస్ చైర్మన్‌గా ఎంపిక చేశారని తెలిపారు. విజయవాడలో గత నెలలో ఏర్పాటుచేసిన ఆక్వా రైతుల సమావేశానికి మత్స్యశాఖ అధికారులు తమ సంఘానికి కనీస సమాచారం ఇవ్వలేదని ఆగ్రహం వ్యక్తంచేశారు. వారికి తెలిసిన కొందరు రైతులకు సమాచారం ఇచ్చి చేతులు దులిపేసుకున్నారన్నారు. దీనిపై సంబంధిత స్థానిక మత్స్యశాఖ అధికారులను ప్రశ్నించగా అయ్యో మర్చిపోయానని చెప్పారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అలాగే ప్రాసెసింగ్ ప్లాంట్ సభ్యులు ఒక యూనియన్‌గా తయారై ధరలను తగ్గించేస్తున్నారని వాపోయారు. ఫీడ్ కంపెనీలు ముడి సరుకు ధరలు తగ్గినా ఫీడ్ ధరలు మాత్రం తగ్గించడంలేదని తెలిపారు. ప్రభుత్వం ఆక్వా రైతుల సమస్యలు పట్టించుకోకుండా ఇబ్బందులు పెడితే ఆక్వా సాగు పెరగడం కాదని ఉన్న సాగునే క్రాప్ హాలిడేగా ప్రకటించే పరిస్థితి ఎదురవుతుందని హెచ్చరించారు. గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో ఆక్వా రైతుల సమస్యల పట్ల అప్సుడా ఆధ్వర్యంలో కాకినాడలో ప్రాసెసింగ్ యూనిట్స్, ఫీడ్, హెచరీ కంపనీల సభ్యులతో సమావేశం ఏర్పాటుచేసి రైతుల సమస్యలను దృష్టిలో పెట్టుకుని సమస్య పరిష్కారం దిశగా పనిచేశారని రైతు సంఘం సభ్యులు గుర్తు చేసుకున్నారు. కార్యక్రమంలో సంఘ సభ్యులు బోణం నరసయ్య, ఎం జాన్‌రాజు, మేకా ఫణీంద్ర ప్రసాద్, పెన్మెత్స వెంకట సత్యనారాయణరాజు, సజ్జా బుజ్జి తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment