
ఎస్సీ గుర్తింపు కోసం పోరాటం
భీమవరం(ప్రకాశం చౌక్): బేడ, బుడగ జంగం కులస్తులు ఎస్సీ కుల ధ్రువీకరణ పత్రం కోసం ఏళ్ల తరబడి పోరాడుతూనే ఉన్నారు. గతంలో కొందరు కాంగ్రెస్ నేతలు బేడ బుడగ జంగం ఆంధ్రాలో లేరని కోర్టులో వేయడంతో వారికి ఎస్సీ రిజర్వేషన్ వర్తించకుండా నిలిపేశారు. ఇటీవల పశ్చిమగోదావరి జిల్లాలో బేడ, బుడగ జంగం కులస్తులు పలు నిరసన కార్యక్రమాలు చేపట్టారు. కలెక్టరేట్‌కు తరలివచ్చి తమ గోడు చెప్పుకున్నారు.
జిల్లాలో భీమవరం, వీరవాసరం, మొగల్తూరు, పాలకోడేరు, పాలకొల్లు మండలాల్లోని పలు గ్రామాల్లో బేడ, బుడగ జంగం కుటుంబాలు దాదాపు 700 వరకూ ఉన్నాయి. 4 వేల మంది జనాభా ఉన్నారు. రిజర్వేషన్ సర్టిఫికెట్ లేక విద్య, ఉద్యోగాల్లో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వారికి అటు ఎస్సీ సర్టిఫికెట్ గానీ ఇటు బీసీ సర్టిఫికెట్ గానీ జారీ కావడం లేదు. దాంతో పిల్లల స్కూల్ అడ్మిషన్లకు ఇబ్బంది పడుతున్నారు. చదువుకున్న వారికి రిజర్వేషన్‌కు సంబంధించి నిర్ధారణ చేసే సర్టిఫికెట్ లేకపోవడంతో ప్రభుత్వ, కాంట్రాక్ట్ ఉద్యోగులు రావడం లేదు. మహిళలు కూలి పనులు, ఇంటింటికి తిరిగి వస్తువులు విక్రయించడం, మగవారు గ్యాస్ పొయ్యిలు రిపేర్, కూలి పనులు చేసుకుని బతుకుతున్నారు.
చంద్రబాబు హామీ నిలబెట్టుకోవాలి
జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వంలో బేడ, బుడగ జంగం కులస్తుల ఇబ్బందులు దృష్టిలో పెట్టుకుని వారికి సంక్షేమ పథకాలు అమలు చేసి అదుకున్నారు. వారికి ఎస్సీ రిజర్వేషన్ వర్తించేలా శాసన సభలో తీర్మానం చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపారు. ఇంతవరకు కేంద్ర ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకోలేదు. నేడు కేంద్ర మంత్రులు, ప్రజాప్రతినిధులుగా ఉన్నారు వారు ఈ కులస్తుల సమస్య పట్టించుకోవడం లేదు. గతంలో బేడ, బుడగ జంగం కులస్తుల సభలో చంద్రబాబు మాట్లాడుతూ వారి సమస్య పరిష్కరించి ఎస్సీ రిజర్వేషన్ కల్పించేలా కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ప్రస్తుతం అధికారంలో ఉన్న చంద్రబాబు.. ఇచ్చిన మాటకు కట్టుబడి రిజర్వేషన్ కల్పించాలని కోరుతున్నారు.
బేడ, బుడగ జంగం కులస్తుల అగచాట్లు
ఎస్సీలుగా గుర్తించాలని తీర్మానం కేంద్రానికి పంపిన గత సర్కారు
Comments
Please login to add a commentAdd a comment