
జిల్లా ఆస్పత్రిలో పారిశుద్ధ్య కార్మికుల సమ్మె
తణుకు అర్బన్: తణుకు జిల్లా కేంద్ర ఆస్పత్రి పారిశుద్ధ్య కార్మికులకు గత 5 నెలలుగా వేతనాలు అందకపోవడంతో మంగళవారం విధుల బహిష్కరించి ఆస్పత్రి ఆవరణలో సమ్మెకు దిగారు. దీంతో పారిశుద్ధ్య సేవలు నిలిచిపోవడంతో రోగులు, సహాయకులు ఆందోళన వ్యక్తం చేశారు. ప్రతి వార్డులో ఏర్పాటుచేసిన డస్ట్‌బిన్‌లు నిండిపోయి దర్శనమిచ్చాయి. దీంతో విషయం తెలుసుకున్న జిల్లా ఆస్పత్రుల సమన్వయాధికారి డాక్టర్ పి.సూర్యనారాయణ ఆస్పత్రికి వచ్చి కార్మికులు, యూనియన్ నాయకులతో చర్చలు జరిపారు. 5 నెలలపాటు వేతనాలు ఇవ్వకపోతే ఇళ్లు ఎలా గడపాలని, ఏం తినాలని కార్మికులు ప్రశ్నించారు. పీఎఫ్ సొమ్ము కూడా ఇంతవరకు తమ ఖాతాలకు జమకాలేదని వివరించారు. దీంతో డీసీహెచ్‌ఎస్ మాట్లాడుతూ ఈనెల 10 వరకు వేచి చూడాలని ఈ లోపు వేతనాలు జమవుతాయని కోరారు. చర్చలు సఫలీకృతం కావడంతో మధ్యాహ్నం నుంచి కార్మికులు విధుల్లోకి వచ్చి పారిశుద్ధ్య పనులు చేపట్టారు.
ఇంటర్ పరీక్షల్లో 96 శాతం హాజరు
భీమవరం (ప్రకాశంచౌక్): జిల్లాలో ఇంటర్ పరీక్షలు ప్రశాంతంగా జరుగుతున్నాయని జిల్లా ఇంటర్మీడియట్ విద్యాశాఖాధికారి ఎ.నాగేశ్వరరావు తెలిపారు. మంగళవారం మొదటి సంవత్సరం ఇంగ్లీష్ పేపర్–1 పరీక్షకు జిల్లా వ్యాప్తంగా 52 పరీక్షా కేంద్రాల్లో జనరల్ కేటగిరీలో 18,315 మందికి 17724 మంది, ఒకేషనల్ కేటగిరీలో 2,226 మందికి 1,987 మంది పరీక్ష రాశారన్నారు. 96 శాతం హాజరు నమోదైందని తెలిపారు. ఎక్కడా మాల్ ప్రాక్టీస్ కేసులు నమోదు కాలేదని తెలిపారు.
ఆటో కార్మికుల ధర్నా
తాడేపల్లిగూడెం (టీఓసీ): మినీ ట్రక్ డ్రైవర్స్ అండ్ వర్కర్స్ యూనియన్ సభ్యులు ఆధ్వర్యంలో మంగళవారం హౌసింగ్‌బోర్డు సెంటర్ వద్ద ఆటో కార్మికులు ధర్నా చేశారు. ఏఐటీయూసీ ఏరియా కార్యదర్శి మందలపర్తి హరీష్ మాట్లాడుతూ విచ్చలవిడి చలానాలతో డ్రైవర్లను వేధిస్తున్న జీఓ నెంబర్ 21, 31 రద్దు చేయాలన్నారు. వాహన మిత్ర రూ.15 వేలు ఇవ్వాలని, కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన నూతన మోటారు యాక్ట్ చట్టం రద్దు చేయా లని తదితర డిమాండ్ల కూడిన వినతిపత్రాన్ని తహసీల్దార్ కార్యాలయంలో అందజేశారు. ఏఐటీయూసీ నాయకులు కె.లక్ష్మీనారాయణ, తాడికొండ వాసు, కళింగ లక్ష్మణరావు, పి.ఆదినారాయణ తదితరులు పాల్గొన్నారు.
యూత్ పార్లమెంట్ నిర్వహణకు డీఎన్నార్ ఎంపిక
భీమవరం (ప్రకాశంచౌక్): వికసిత్ భారత్ యూత్ పార్లమెంట్–2025 నిర్వహణకు నోడల్ కాలేజీగా డీఎన్నార్ కళాశాలను కేంద్ర ప్రభుత్వం ఎంపిక చేసిందని కళాశాల ప్రిన్సిపాల్ జి.మోజెస్ తెలిపారు. పశ్చిమ గోదావరి, ఏలూరు జిల్లాల నుంచి కార్యక్రమంలో పాల్గొనే వారు తప్పనిసరిగా పోర్టల్‌లో తమ పేర్లను నమెదు చేసుకోవాలన్నారు. నమోదు చేయించుకున్న వారిలో 150 మందిని స్క్రీనింగ్ చేసి వారికి డీఎన్నార్ కళాశాలలో పోటీలు నిర్వహించి 10 మందిని రాష్ట్ర స్థాయికి ఎంపిక చేస్తారన్నారు. పోటీలలో పాల్గొనేందుకు చివరి తేదీ మార్చి 9వ తేదీ అని.. వివరాలకు 8179179899, 9441388058 నెంబర్లలో సంప్రదించాలన్నారు.
ఎస్‌ఈ మోషేకు పదోన్నతి
ఏలూరు(మెట్రో): ఏలూరు సర్కిల్ ఆర్‌అండ్‌బీ సూపరింటెండెంట్ ఇంజనీర్ జాన్ మోషేకు పదోన్నతి కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. మోషేను అమరావతి సీఈగా పదోన్నతి కల్పించి తక్షణమే విధులకు హాజరుకావాలని ఆదేశాల్లో పేర్కొన్నారు.
మహారాష్ట్ర డైట్ బృందం పర్యటన
ఏలూరు (ఆర్‌ఆర్‌పేట): మహారాష్ట్రలోని నాగపూర్ జిల్లా డైట్ కాలేజీ లెక్చరర్‌లు ఏలూరు జిల్లాలో అధికారిక పర్యటనకు విచ్చేశారు. మంగళవారం ఉదయం స్థానిక సుబ్బమ్మ దేవి నగరపాలక ఉన్నత పాఠశాలలో టీచర్లతో పలు అంశాలను చర్చించి సంతృప్తి వ్యక్తం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment