ముదినేపల్లి రూరల్: తల్లిని భయపెట్టేందుకు చేసిన పని వికటించి ఓ బాలుడు ప్రాణాలు కోల్పోయిన ఘటన మండలంలోని వడాలిలో జరిగింది. స్థానికుల కథనం ప్రకారం గ్రామానికి చెందిన బాలుడు (17) రొయ్యల చెరువులపై పనులకు వెళుతుంటాడు. ఈ క్రమంలో చెరువుగట్లపై తిరుగాడే పందికొక్కులను నిర్మూలించేందుకు స్థానికంగా ఉన్న చెరువుగట్లపై బిళ్లలు కొట్టడానికి వెళ్లి మిగిలిన బిళ్లలు వెంట తిరిగి తెచ్చుకున్నాడు. ఈ బాలుడు 10వ తరగతి చదువుతూ మధ్యలో మానివేశాడు. తండ్రి గతంలోనే ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. బాలుడికి ఒక చెల్లెలు ఉంది. తండ్రి చనిపోవడంతో కుటుంబపోషణ తల్లితో పాటు బాలుడిపై పడింది. బాలుడు చెరువుపై పనులకు వెళుతున్నప్పటికీ కూలి తీసుకోకుండా మద్యానికి అలవాటు పడ్డాడు. దీంతో చెరువు పనులకు వెళ్లవద్దని, రంగులు వేసే పనికి వెళ్లి కుటుంబాన్ని పోషించేందుకు సహాయపడాలంటూ తల్లి బాలుడిని గట్టిగా మందలించింది. ఈ మందలింపును జీర్ణించుకోలేని బాలుడు తల్లిని బెదిరించేందుకు వెంట తెచ్చుకున్న మిగిలిన పందికొక్కు బిళ్లల్లో కొన్ని మింగి వెంటనే ఊసేశాడు. తల్లి వెంటనే ముదినేపల్లిలోని ప్రైవేటు ఆసుపత్రికి తీసుకువెళ్లగా అప్పటికే బాలుడు మరణించినట్లు స్థానికులు తెలిపారు. చేతికి అంది వచ్చిన కొడుకు ఇలా అకాల మరణం చెందడంతో ఆ తల్లి కన్నీరుమున్నీరై విలపించింది. కాగా స్థానిక కూటమి నాయకుల చెరువులపై అప్పుడప్పుడు చిన్నపాటి పనులు చేస్తుంటే కూలి ఇవ్వకుండా మద్యం ఇచ్చి సరిపెడుతుండడంతో ఈ పరిస్థితి తలెత్తిందని పలువురు చెబుతున్నారు.
చెక్‌బౌన్స్ కేసులో న్యాయవాదికి జైలుశిక్ష,జరిమానా
నూజివీడు: చెల్లని చెక్కు ఇచ్చిన నేరానికి ఎన్టీఆర్ జిల్లా విస్సన్నపేటకు చెందిన న్యాయవాది పెరుమాళ్ల వెంకట సతీష్‌కు ఆరు నెలల జైలు శిక్ష, రూ.3 లక్షల జరిమానా విధిస్తూ నూజివీడు స్పెషల్ మేజిస్ట్రేట్ వేల్పుల కృష్ణమూర్తి గురువారం తీర్పు వెలువరించారు. వివరాల ప్రకారం చాట్రాయి మండలం సీ గుడిపాడుకు చెందిన నక్కా శ్రీను 2021 ఏప్రిల్‌లో సతీష్‌కు రూ.5 లక్షలు అప్పుగా ఇచ్చారు. కొంతకాలం తరువాత తన అప్పు తీర్చమని శ్రీను కోరగా 2022 మే నెలలో సతీష్ రూ.2 లక్షలకు చెక్కు ఇచ్చాడు. సతీష్ ఖాతాలో నగదు లేకపోవడంతో బ్యాంకు నుంచి ఆచెక్కు వెనక్కు వచ్చింది. దీనిపై శ్రీను కోర్టులో కేసు వేయగా విచారణ అనంతరం సతీష్‌కు రూ.3 లక్షల జరిమానా, 6 నెలల జైలు శిక్ష విధిస్తూ మేజిస్ట్రేట్ తీర్పు చెప్పారు.
సొమ్ముల మాయంపై ఖాతాదారుల ఆందోళన
ముదినేపల్లి రూరల్: బ్యాంకు ఖాతాల్లో నిల్వ ఉన్న తమ సొమ్ములు తగ్గడంపై ఖాతాదారులు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ విషయంపై బుధ, గురువారాల్లో స్థానిక స్టేట్ బ్యాంక్‌కు దాదాపు 100 మంది వరకు తరలివచ్చిన ఖాతాదారులు మేనేజర్‌ను ప్రశ్నించారు. ఒకరికి రూ.36 వేలు, మరొకరికి రూ.96 వేలు, పలువురికి రూ.వెయ్యి నుంచి రూ.30 వేల వరకు ఖాతాల్లో నిల్వలు తగ్గిపోయాయంటూ మేనేజర్‌కు తెలిపి కారణం చెప్పాలంటూ నిలదీశారు. దీనిపై బ్రాంచ్ మేనేజర్ బీఎస్ సూర్యనారాయణ వివరణ ఇస్తూ స్థానికంగా ఉన్న తమ శాఖ నుంచి ఖాతాల్లో నిల్వలు ఏమి తగ్గించలేదన్నారు. ఖాతాదారులు ఇతర బ్యాంకుల నుంచి రుణాలు పొంది తిరిగి చెల్లించకుంటే ఈ విధంగా జరిగే అవకాశం ఉండవచ్చని తెలిపారు. అయినప్పటికీ దీనిపై ఉన్నతాధికారులకు సమాచారమందించి తగిన కారణాలు తెలియజేస్తామన్నారు.
Comments
Please login to add a commentAdd a comment