ముమ్మరంగా వేట | - | Sakshi
Sakshi News home page

ముమ్మరంగా వేట

Published Sat, Mar 8 2025 12:39 AM | Last Updated on Sat, Mar 8 2025 12:45 AM

ముమ్మ

ముమ్మరంగా వేట

నరసాపురం: నరసాపురం తీరం పొడవునా సముద్రంలో వేట ముమ్మరంగా సాగుతోంది. పలు జిల్లాలకు చెందిన మెకనైజ్డ్‌ బోట్లు వేట సాగిస్తున్నాయి. మచిలీపట్నం, కాకినాడ, నెల్లూరు, విశాఖ తదితర ప్రాంతాలకు చెందిన సుమారు 70 వరకు బోట్లు ఇక్కడ నడుస్తున్నాయి. వాతావరణంలో ఉష్ణోగ్రతలు పెరుగుతుండటం, వేటకు అనుకూలంగా ఉండటం, చేపలు దొరికే సీజన్‌ కూడా కావడంతో మత్స్యకారులు బిజీగా ఉన్నారు. గతేడాది వేట కష్టనష్టాలతో సాగింది. వరుస విపత్తులు గంగపుత్రులను ఇబ్బంది పెట్టాయి. రాష్ట్రంలో గద్దెనెక్కిన కూటమి సర్కారు మత్స్యకారులను ఆదుకునేలా చర్యలు తీసుకోకపోవడం మరింత కుంగదీసింది.

భరోసా లేక.. వేసవిలో వేట నిషేధ సమయంలో మత్స్యకారులను ఆదుకునేలా గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం మత్స్యకార భరోసా పథకాన్ని అమలు చేసింది. 2019–23 మధ్య ఐదేళ్లలో ఒక్కొక్కరికీ రూ.10 వేల చొప్పున రూ.7.87 కోట్ల సాయం అందించింది. అయితే గతేడాది అధికారంలోకి వచ్చిన కూటమి సర్కారు మత్స్యకార భరోసా కింద రూ.20 వేలు అందిస్తామని ప్రకటించినా అమలు చేయలేదు. గతేడాది సాయానికి ఎగనామం పెట్టడం, జూన్‌ నుంచి నవంబర్‌ వరకు విపత్తులతో మత్స్యకారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.

వచ్చే నెల నుంచి నిషేధం : చేపల పునరుత్పత్తి సీజన్‌ కావడంతో ఏటా ఏప్రిల్‌ 14 నుంచి జూన్‌ 14 వరకు సముద్రంలో వేట నిషేధం అమలులోకి వస్తుంది. వేట నిషేధ గడువు దగ్గర పడటం, ప్రస్తుతం అనుకూల వాతావరణం ఉండటంతో సముద్రంలో వేట జోరుగా సాగుతోంది.

రూ.200 కోట్ల మత్స్య సంపద ఎగుమతి

నరసాపురం తీరంలో గత జూన్‌ నుంచి ఈ ఏడాది ఫిబ్రవరి నెలాఖరు వరకూ దాదాపు రూ.200 కోట్ల మత్స్యసంపద ఎగుమతులు జరిగినట్టు అంచనా. 2023–24లో రూ.300 కోట్ల వరకు ఎగుమతులు జరగ్గా.. ఈ ఏడాది రూ.100 కోట్ల మేర తగ్గాయి. వేట నిషేధం గడువు ఎత్తేసిన తర్వాత జూన్‌ నుంచి మత్స్యకారులు మరలా సముద్రంలో వేట ముమ్మరంగా సాగిస్తారు. గత జూలై, ఆగస్టు, సెప్టెంబర్‌లో తుపానులు ఇబ్బంది పెట్టాయి. మరలా జనవరి నుంచి చేపలు పెద్ద సంఖ్యలో పడటంతో ఆశించిన ఆదాయం వస్తోందని మత్స్యకారులు అంటున్నారు.

మత్స్యకారులు బిజీబిజీ

ఈ ఏడాది వరుస విపత్తులతో సతమతం

కూటమి సహకారం కరువు

వచ్చేనెల 14 నుంచి వేట నిషేధం

వారంలోనే ఒడ్డుకు..

సముద్రంలో ముమ్మరంగా వేట సాగుతోంది. సముద్రంలోకి వెళ్లిన బోటు వారం లోపునే సరుకుతో ఒడ్డుకు చేరుతోంది. బోటు యజమానులు పడిన సరుకును బట్టి మాకు డబ్బులు ఇస్తారు. దీంతో ఆనందంగా ఉంది. ఇప్పుడే నాలుగు డబ్బులు సంపాదించుకోవాలి. వచ్చేనెల నుంచి వేట నిషేధం అమలవుతోంది.

– తిరుమాని గంగరాజు, బోటు కార్మికుడు

తుపాన్లతో ఇబ్బంది

కూటమి సర్కార్‌ తాము అధికారంలోకి వస్తే మత్స్యకార భరోసా రూ.20 వేలు పెంచి ఇస్తామన్నారు. ఈ ఏడాది ఒక్కపైసా కూడా ఇవ్వకుండా ఎగ్గొట్టారు. రెండేళ్లకు కలిపి మత్స్యకారులకు రూ.40 వేలు ఇవ్వాలి. ఈ ఏడాది తుపాన్లు, అల్పపీడనాలతో వేట సవ్యంగా సాగలేదు. ఏడాదంతా అప్పులు చేసి ఈడ్చుకొచ్చాం.

– బర్రి శంకరం, మత్స్యకార నేత

No comments yet. Be the first to comment!
Add a comment
ముమ్మరంగా వేట 1
1/2

ముమ్మరంగా వేట

ముమ్మరంగా వేట 2
2/2

ముమ్మరంగా వేట

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement