
మెప్మాకు గిన్నిస్ బుక్ రికార్డ్స్
భీమవరం (ప్రకాశంచౌక్): రాష్ట్రవ్యాప్తంగా 1.50 లక్షల స్వయం సహాయక సంఘాల ఉత్పత్తులను ఓఎన్‌డీసీ ప్లాట్‌ఫారమ్ ద్వారా విక్రయించి గిన్నిస్ వరల్డ్ రికార్డ్‌ను సాధించడం అభినందనీయమని కలెక్టర్ చదలవాడ నాగరాణి అన్నారు. జిల్లా మెప్మా అధికారులు గిన్నిస్ బుక్ రికార్డ్స్, వరల్డ్ రికార్డ్స్ సర్టిఫికెట్లతో బుధవారం కలెక్టర్‌ను కలిశారు. ఓఎన్‌డీసీ విక్రయాల్లో జిల్లా ఎస్‌హెచ్‌జీల భాగస్వామ్యం 6,500గా ఉందని మెప్మా అధికారులు కలెక్టర్‌కు వివరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ నాగరాణి మాట్లాడుతూ ఓఎన్‌డీసీ విక్రయాల్లో జిల్లా భాగస్వామ్యం పెద్ద మొత్తంలో పెరగాలని సూచించారు. కార్యక్రమంలో మెప్మా జిల్లా లైవ్లీహుడ్స్ స్పెషలిస్ట్ సీహెచ్ నాని బాబు, జిల్లా ఐబీ గ్రంధి పార్వతి, జిల్లా ఈ మార్కెట్ స్పెషలిస్ట్ సీహెచ్ మోహన్ ఉన్నారు.
రోడ్డు ప్రమాదంలో మోటార్‌సైక్లిస్టు మృతి
నరసాపురం రూరల్: వెనుక నుంచి మరో మోటార్‌సైకిల్ ఢీకొనడంతో మోటార్‌సైక్లిస్ట్ మృతి చెందాడు. నరసాపురం – పాలకొల్లు రహదారిలో చిట్టవరం పెద్దపుంత సమీపంలో జాతీయరహదారిపై బుధవారం ఈ ఘటన చోటుచేసకుంది. పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. చిట్టవరం గ్రామానికి చెందిన కట్టా నవరత్నం (బాషా) (22) బైక్‌పై పాలకొల్లు వైపు వెళుతుండగా పుంత రోడ్డు వద్దకు వచ్చేసరికి వెనుకనుంచి పాలకొల్లు వైపే వస్తున్న మరో బైక్ ఢీకొంది. ఈ ప్రమాదంలో బాషా తలకు బలమైన గాయాలు కావడంతో నరసాపురం ప్రభుత్వాసుపత్రికి తరలించగా అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. ఈ ప్రమాదంలో మరో బైక్‌పై ప్రయాణిస్తున్న యువకుడికి కూడా గాయాలు కావడంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. మృతుడి తండ్రి కట్టా పెద్దిరాజు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు రూరల్ ఎస్సై టి వెంకట సురేష్ తెలిపారు.
వేసవిలో ఐఆర్‌సీటీసీ
టూర్ ప్యాకేజీలు
ఏలూరు (టూటౌన్): వేసవిలో పలు సమ్మర్ స్పెషల్ టూరిస్ట్ ట్రైన్ ప్యాకేజీలు అందుబాటులోకి తెచ్చినట్లు ఐఆర్‌సీటీసీ విజయవాడ ఏరియా మేనేజర్ ఎం.రాజా ఒక ప్రకటనలో తెలియజేశారు. ప్యాకేజీ నం.1లో భాగంగా సప్త జ్యోతిర్లింగాల యాత్రను ఈనెల 8వ తేదీ నుంచి 19వ తేదీ వరకు నిర్వహిస్తున్నామన్నారు. యాత్రలో భాగంగా ఉజ్జయిని, ద్వారక, సోమనాఽథ్, పూనే, నాసిక్, ఔరంగాబాద్ సందర్శించవచ్చునన్నారు. టికెట్ వెల రూ.18,510గా నిర్ణయించడం జరిగిందన్నారు. ప్యాకేజీ నం.2లో భాగంగా హరిద్వార్ – రిషీకేష్ – వైష్టవోదేవి యాత్ర 23న ప్రారంభమై మే 2వ తేదీ వరకు జరుగుతుందని, టికెట్ ధర రూ.18,510 అని తెలిపారు. ప్యాకేజీ నం.3లో భాగంగా వచ్చే నెల 8 నుంచి 17వ తేదీ వరకు కాశీ – గయా – ప్రయాగ్ – అయోధ్య యాత్ర, టికెట్ ధర రూ.16,800, ప్యాకేజీ నం.4లో భాగంగా వచ్చేనెల 22 నుంచి 30వ తేదీ వరకు అరుణాచలం – మధురై – రామేశ్వరరం యాత్ర, టికెట్ ధర రూ.14,700, ప్యాకేజీ నం.5లో భాగంగా జూన్ 4 నుంచి జూన్ 12 వరకు పంచ జ్యోతిర్లింగ యాత్ర, ఈ యాత్రలో మహాకాళేశ్వర్, ఓంకారేశ్వర్, త్రయంబకేశ్వర్, భీమేశ్వర్, గిరిష్‌నేశ్వర్, ఎల్లోరా, మోహ్, నాగపూర్ క్షేత్రాలు సందర్శించవచ్చునన్నారు. టికెట్ ధర రూ.14,700గా నిర్ణయించడం జరిగిందన్నారు. వివరాలకు విజయవాడలోని ఐఆర్‌సీటీసీ కార్యాలయం లేదా 92814 95848, 92810 30714 నంబర్లలో సంప్రదించాలని ఏరియా మేనేజర్ తెలియజేశారు.