ఆలేరురూరల్ : జిల్లాలో ఇల్లు లేని ప్రతి ఒక్కరికీ ఇందిరమ్మ ఇల్లు నిర్మించి ఇస్తామని ప్రభుత్వ విప్ బీర్ల అయిలయ్య అన్నారు. గురువారం ఆలేరు ఎంపీడీఓ కార్యాలయంలో ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుకు ఏర్పాటు చేసిన అవగాహన సదస్సులో పాల్గొన్నారు. కలెక్టర్ హనుమంతరావు, రెవెన్యూ అదనపు కలెక్టర్ వీరారెడ్డితో కలిసి లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇంటి నమూనాను చూపించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రెండు నెలల్లో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం పూర్తి చేయాలని, నాణ్యతలో తేడా రావద్దని అధికారులను ఆదేశించారు. లబ్ధిదారులంతా సకాలంలో ఇళ్ల నిర్మాణ పనులు ప్రారంభించేలా వారికి తోడ్పాటునందించాలని పేర్కొన్నారు. బేస్మెంట్ లెవల్ పూర్తయిన తరువాత రూ.లక్ష, పైకప్పుకు రూ.లక్ష, స్లాబ్‌కు రూ.2లక్షలు మొత్తం రూ.5లక్షలు లబ్ధిదారుల ఖాతాల్లో ప్రభుత్వం జమ చేస్తుందన్నారు. ఇల్లు మంజూరుకాని వారు ఆందోళన చెందవద్దని, అర్హులందరికీ ఇళ్లు నిర్మించి ఇవ్వడం ప్రభుత్వం లక్ష్యమన్నారు. అనంతరం లబ్ధిదారులతో కలిసి సంహపంక్తి భోజనం చేశారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ కృష్ణారెడ్డి, హౌజింగ్ అధికారి శ్రీరాములు, తహసీల్దార్ అంజిరెడ్డి, ఎంపీడీఓ సత్యాంజనేప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
ఫ ప్రభుత్వ విప్ బీర్లఅయిలయ్య