వైఎస్సార్: తమ పరిచయాలకు అడ్డుగా ఉన్నాడని.. ఆటోలో వెళ్తున్న వ్యక్తికి విషం నింపిన సూదులు గుచ్చి హత్యకు పాల్పడిన ఉదంతాన్ని పోలీసులు ఛేదించారు. నిందితుడి అరెస్టు చూపుతూ విలేకరుల సమావేశంలో సీఐ మోహన్‌రెడ్డి వివరాలు వెల్లడించారు. ఇందిరమ్మ కాలనీకి చెందిన సుధాకర్ (37) బతుకుదెరువు కోసం కువైట్‌కు వెళ్లాడు. అతడి భార్యతో పీలేరు పట్టణం ఆర్టీసీ నల్లగుట్టలో నివాసముంటున్న తైదులకిషోర్ (32) పరిచయం పెంచుకున్నారు. అయితే సుధాకర్ ఇటీవల కువైట్ నుంచి తిరిగివచ్చి ఆటో నడుపుతూ జీవనం సాగిస్తున్నాడు.
తమ పరిచయాలకు అడ్డుగా ఉన్న సుధాకర్‌ను చంపేందుకు కిషోర్ తిరుపతి, చైన్నెలోని కొందరితో కలిసి కుట్ర చేశారని సీఐ తెలిపారు. ప్రణాళిక ప్రకారం ఆగస్టు 31న ఉదయం 9 గంటలకు ఆటోలో తన కుమార్తెను తీసుకుని సుధాకర్ కోటపల్లె బాలికోన్నత పాఠశాల వెళ్లినట్లు తెలుసుకున్నారు. సుధాకర్ తిరిగి వస్తుండగా గుర్తుతెలియని వ్యక్తులు బస్టాండ్ వద్ద వదలాలని ఆటో ఎక్కారు.
వెనుక వైపు కూర్చున్నట్లు నటించి సుధాకర్ భుజంపై విషం నింపిన సూదులు గుచ్చి వెళ్లిపోయారు. కొద్ది సమయానికి విష ప్రభావంతో సుధాకర్ మరణించాడు. మృతుడి భార్య అశ్వని ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు
చేశారు. ప్రధాన నిందితుడైన తైదుల కిషోర్ (32)ను స్థానిక తిరుపతి రోడ్డు మార్గం వద్ద అరెస్టు చేసినట్లు సీఐ వివరించారు. తిరుపతికి చెందిన ఉమ, చందు, సునీల్ కోసం గాలింపు చర్యలు చేపట్టినట్లు సీఐ తెలిపారు. ఎస్‌ఐ నరసింహుడు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment