పులివెందుల : వివాహేతర సంబంధంతోనే నాగరాజు హత్య జరిగిందని జమ్మలమడుగు డీఎస్పీ నాగరాజు తెలిపారు. ఆదివారం పులివెందులలోని పోలీస్‌స్టేషన్‌లో ఆయన నిందితులను మీడియా ఎదుట హాజరుపరిచారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఈ నెల 8వ తేదీన లింగాల మండలం అంబకపల్లె గ్రామంలో చింతకాయల నాగరాజు తన మోటారు సైకిల్‌లో ఇంటి వద్ద నుంచి టమాట తోట వద్దకు వెళ్లగా.. అక్కడ అతని కోసం కాపుకాచి ఉన్న వారు వేటకొడవళ్లు, గొడ్డలితో దాడి చేసి హతమార్చారని తెలిపారు. ఈ హత్యలో బొర్రా చెన్నకేశవులు, బొర్రా చందు, బొర్రా చెన్నకృష్ణ, బొర్రా చండ్రాయుడు, బొర్రా గంగన్న, బొర్రా గోపాల్‌లకు ప్రమేయం ఉందన్నారు.
ఈ హత్యకు ముఖ్య కారణం గతంలోనే నాగరాజుకు వివాహమై భార్యతోపాటు ముగ్గురు పిల్లలు ఉన్నారని, అయితే ఆయన 5 ఏళ్ల నుంచి బొర్రా చెన్నకేశవుల చెల్లెలితో వివాహేతర సంబంధం ఏర్పరచుకున్నాడన్నారు. 2018లో నాగరాజు పులివెందులలో నివాసం ఉన్న సమయంలో బొర్రా చెన్నకేశవులు, అతని తమ్ముడు బొర్రా చందులు నాగరాజు ఇంటి వద్దకు వెళ్లి తమ చెల్లెలి విషయం అడుగగా ఆయన వారిపై వేటకొడవలితో దాడిచేయడం జరిగిందన్నారు. అప్పట్లో నాగరాజుపై ఆ విషయానికి సంబంధించి పులివెందుల పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదైందన్నారు.
ఆ కేసుకు సంబంధించి ఈ ఏడాది ఆగస్టు 21వ తేదీన సాక్ష్యం చెప్పాలని హైదరాబాదులో ఉన్న తమ చెల్లెలిని అడుగగా, తాను నాగరాజును పెళ్లి చేసుకున్నానని, ప్రస్తుతం 8 నెలల గర్భవతినని నాగరాజుకు వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పేందుకు తిరస్కరించిందన్నారు. దీంతో కోపోద్రేక్తులైన బొర్రా చెన్నకేశవుల కుటుంబ సభ్యులు గ్రామంలో తమ పరువు పోయిందని, దీనికంతటికి కారణం నాగరాజుగా భావించి అతనిని చంపేందుకు నిర్ణయించుకున్నారన్నారు.
అందులో భాగంగా ఈ నెల 8వ తేదీన టమాట తోట వద్దకు వచ్చిన నాగరాజును నరికి చంపారని తెలిపారు. కేవలం వివాహేతర సంబంధంతోనే ఈ హత్య జరిగిందని, దీనిలో ఎలాంటి రాజకీయాలకు సంబంధం లేదని ఆయన వివరించారు. మీడియా సమావేశంలో సీఐ మద్దిలేటి, లింగాల, తొండూరు ఎస్సైలు, సిబ్బంది పాల్గొన్నారు.
టీడీపీ కార్యకర్త చింతకాయల నాగరాజు హత్యపై ఈనాడు తప్పుడు కథనాలు రాసింది. చంద్రబాబు పర్యటనలో బాణాసంచ కాల్చడం వల్లనే టమాటా తోటలో కాపుకాసి వేట కోడవళ్లతో దాడికి పాల్పడినట్లు దుష్ప్రచారం చేసింది. అయితే పోలీసులు ఈ వాదనను తోసిపుచ్చారు. : వివాహేతర సంబంధంతోనే నాగరాజు హత్య జరిగిందని జమ్మలమడుగు డీఎస్పీ నాగరాజు తెలిపారు
Comments
Please login to add a commentAdd a comment