వైఎస్సార్ : స్థానిక దర్గా వీధిలో ఈ నెల 17వ తేదీన జరిగిన షేక్ మహ్మద్ జహీర్ సాహెబ్ (27) హత్య కేసులో నిందితులైన భార్య షేక్ యాస్మిన్, అత్త షేక్ టప్పా ఖదీరున్నిసాలను అరెస్ట్ చేసినట్లు కమలాపురం సీఐ సత్యబాబు తెలిపారు. స్థానిక పోలీస్‌స్టేషన్‌లో మంగళవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన వివరాలు వెల్లడించారు. షేక్ మహ్మద్ జహీర్ భార్య, అత్తతో కలసి అత్త ఇంట్లోనే నివాసం ఉంటున్నాడని, అలాగే ఇతడికి మద్యం సేవించే అలవాటు ఉందన్నారు. భార్య, అత్త ఇద్దరు ఇతర వ్యక్తులతో వివాహేతర సంబంధం కలిగి ఉన్నారని, తరచూ వారితో గొడవ పడేవాడన్నారు.
ఈ నేపథ్యంలో ఈ నెల 17వ తేదీన రాత్రి 10.30 గంటల సమయంలో మద్యం సేవించి వచ్చిన మహ్మద్ జహీర్‌ను.. ముందుగా ప్లాన్ చేసుకున్న ప్రకారం అత్త గొంతుకు ప్లాస్టిక్ తాడును గట్టిగా బిగించగా, భార్య తలదిండుతో ముఖంపై గట్టిగా అదిమి పట్టడంతో అక్కడికక్కడే మృతి చెందాడన్నారు. అయితే ఈ విషయం ఎవరికీ తెలియకుండా మద్యం తాగి తమతో గొడవ పడుతూ తనంతట తాను కిందపడి మృతి చెందాడని నమ్మబలికారన్నారు.
అయితే పోస్ట్‌మార్టం నివేదిక ఆధారంగా, అలాగే సాక్ష్యాల మేరకు వారే హత్య చేశారని నిర్ధారించామన్నారు. వారు చేసిన నేరం అంగీకరించడంతో సోమవారం రాత్రి అరెస్ట్ చేసి మంగళవారం కోర్టుకు హాజరు పరచగా మెజిస్ట్రేట్ ఆదేశాల మేరకు రిమాండ్‌కు తరలించినట్లు వివరించారు. ఈ కేసును సమర్థవంతంగా దర్యాప్తు చేసిన ఎస్‌ఐ చిన్నపెద్దయ్యను సీఐ అభినందించారు. సమావేశంలో పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment