కడప గడపలో టీడీపీ ఆశలు గల్లంతే! | - | Sakshi
Sakshi News home page

కడప గడపలో టీడీపీ ఆశలు గల్లంతే!

Published Wed, May 15 2024 9:50 AM | Last Updated on Wed, May 15 2024 12:36 PM

-

సాక్షి ప్రతినిధి, కడప: వైఎస్సార్‌ సీపీ అభిమానుల్లో ఫుల్‌ జోష్‌ కనిపిస్తోంది. సార్వత్రిక ఎన్నికలల్లో వైఎస్సార్‌సీపీ రికార్డులు తిరగరాయనున్న నేపథ్యంలో ఆ పార్టీలో ఉత్సాహం ఉరకలేస్తోంది. ఉమ్మడి కడప జిల్లాలో వైఎస్సార్‌సీపీ పదికి పది సీట్లు సాధించి, ఐదుగురికి హాట్రిక్‌ రికార్డు కట్టబెట్టనుందా? గ్రామీణ ఓటర్లు ఏకపక్షంగా తీర్పు అప్పగించనున్నారా?.. అరకొరగా ఉన్న టీడీపీ ఆశలు ఆవిరి అయ్యాయా?.. పుత్తా, పుట్టాకు మరోమారు చేదు అనుభవం తప్పదా..? వయో వృద్ధుడు వరదకు ఈసారీ ఆశాభంగం తప్పదా? .. అంటే.. విశ్లేషకుల నుంచి అవుననే సమాధానమే వినిపిస్తోంది. రాజంపేట, కడప పార్లమెంటు పరిధిలో ఒక్క అసెంబ్లీ సీటు కూడా టీడీపీ ఖాతాలో పడే అవకాశమే లేదని విశ్లేషకులు వెల్లడిస్తున్నారు.

దుష్ప్రచారాన్ని తిప్పికొట్టారు..
ఎన్నికలకు నోటిఫికేషన్‌ ఖరారు కాకముందు నుంచే తెలుగుదేశం పార్టీ, ఎల్లో మీడియా వైఎస్సార్‌సీపీ అభ్యర్థుల వ్యక్తిత్వ హననానికి పాల్పడింది. ఓటర్లు చెవులు తూట్లు పడేలా దుష్ప్రచారం చేపట్టారు. పోలింగ్‌లో ఇవేవి పట్టించుకోకుండా ఓటర్లు తీర్పు కట్టబెట్టారు. ‘ఈ ఐదేళ్లలో నా పాలనలో లబ్ధి చేకూరింటేనే నాకు ఓట్లు వేయండి, మీ చుట్టు పక్కల వారికి చెప్పి ఓట్లు వేయించండ’ని సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అప్పీల్‌ చేశారు. రాష్ట్రం నలుమూలల తిరుగుతూ మీకు మంచి చేసింటేనే ఓట్లు వేయాలని కోరారు. ఇలా అడిగిన దమ్మున్న నాయకుడు చరిత్రలో లేరని రాజకీయ విశ్లేషకుల మాట. 

మరోవైపు చంద్రబాబు అండ్‌కో అమలు కానీ హామీలు ఇస్తోందని, ఇదే కూటమి 2014లో 600 పైగా హామీలు ఇచ్చిందని, అధికారంలోకి వచ్చిన తర్వాత విస్మరించిందని సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సవివరంగా వివరిస్తూ, చంద్రబాబు వస్తే సంక్షేమ పథకాలు ఆగిపోతాయని కూడా చెప్పారు. ఇలాంటి విషయాలన్నీ బేరీజు వేసుకున్న గ్రామీణ ఓటర్లు ఏకపక్షంగా వైఎస్సార్‌సీపీకి అండగా నిలిచారు. వీరిలో మహిళల మద్దతు పాళ్లు మరింత ఎక్కువగా ఉందని పరిశీలకుల అంచనాకు వచ్చా రు. కాగా, ఉద్యోగుల్లో మాత్రమే టీడీపీకి మెరుగైన అవకాశం ఉందని, అయితే అభ్యర్థుల గెలుపోటములు డిసైడ్‌ చేయదగ్గ స్థాయిలో లేవని కూడా వివరిస్తున్నారు.

ఓటమికి ముందే సాకులు వెతుకుతున్న వాసు
కడప గడపలో ఈమారు ఎలాగైనా గెలవాలనే దృక్పథంతో టీడీపీ పనిచేసింది. ఇన్‌చార్జిగా మాధవీరెడ్డి నియామకం తర్వాత పథకం ప్రకారం ప్రభుత్వంపై దుష్ప్రచారం చేస్తూ వచ్చారు. మరోవైపు విద్వేషాలను రెచ్చగొట్టి సొమ్ము చేసుకోవాలని అడుగులేశారు. పోలింగ్‌లో ఇవేవీ కన్పించడం లేదని పరిశీలకులు భావిస్తున్నారు. నగరంలో మాస్‌ ఓటర్లు ఉదయం నుంచే గణనీయంగా పాల్గొన్నారు. సాయంత్రం వరకూ మాస్‌ పోలింగ్‌ కన్పిస్తూ వచ్చింది. మిడిల్‌, అప్పర్‌ క్లాస్‌ ఓటర్లు పోలింగ్‌లో తక్కువగా పాల్గొన్నారు. వైఎస్సార్‌సీపీకి ఓటింగ్‌ సరళి సానుకూలంగా మారింది. 

తెలుగుదేశం పార్టీ ఊహించిన వర్గం ఓటర్లు పోలింగ్‌లో తక్కువగా పాల్గొన్నారు. వెరసి టీడీపీ ఓటమి ఖాయమైందని విశ్లేషకులు భావిస్తున్నారు. అందులో భాగంగా మంగళవారం జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసులరెడ్డి మీడియాతో మాట్లాడుతూ పార్టీ వెన్నుపోటుదారులపై క్రమశిక్షణ చర్యలు తప్పవని పరోక్షంగా ఆలంఖాన్‌పల్లె లక్ష్మిరెడ్డికి హెచ్చరికలు పంపారు. మరోవైపు వైఎస్సార్‌సీపీ అభ్యర్థి ఎస్‌బీ అంజాద్‌బాషా దొంగ ఓట్లుకు పాల్పడుతుంటే అడ్డుకున్నామని ఆరోపించారు. కడపలో టీడీపీ తీరు చూస్తుంటే ఓటమికి ముందే సాకులు వెతికే పనిలో నిమగ్నమైనట్లు స్పష్టమౌతోందని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు.

వరదకు ఆశాభంగం
చివరి అవకాశం కల్పించాలని ప్రొద్దుటూరు టీడీపీ అభ్యర్థి వరదరాజులరెడ్డి విన్నవించినా ఆశాభంగం తప్పడం లేదు. దాదాపు 80శాతం ఓటింగ్‌ నమోదు కావడం వెనుక పోల్‌ మేనేజ్‌మెంట్‌ ప్రభుత్వ సంక్షేమ పథకాలు ఉన్నట్లుగా పరిశీలకులు వెల్లడిస్తున్నారు. ఓటింగ్‌ సరళిని బట్టి మరోమారు ఎమ్మెల్యేగా అవకాశం దక్కనున్నట్లు రాచమల్లు శివప్రసాద రెడ్డి విశ్వాసం వ్యక్తం చేశారు. రాజంపేటలో స్థానికుడైన ఆకేపాటి అమర్‌నాథరెడ్డి విజయం నల్లేరుపై నడకేనని విశ్లేషకులు వెల్లడిస్తున్నారు. రాయచోటికి చెందిన బాలసుబ్రమణ్యంను పోటీ చేయించడ మే టీడీపీ చేసిన అతిపెద్ద పొరపాటుగా పలువురు వివరిస్తున్నారు.

 రైల్వేకోడూరు, బద్వేల్‌, జమ్మలమడుగు నియోజకవర్గాలు ఎన్నికల పొత్తులో భాగంగా జనసేన, బీజేపీలకు కేటాయిడం మరో పెద్ద తప్పిదంగా పలువురు వివరిస్తున్నారు. ఆ మూడు నియోజకవర్గాలల్లో వైఎస్సార్‌సీపీకి ఎదురు లేకుండా పో యిందని విశ్లేషకులు భావిస్తున్నారు. పులివెందులలో సీఎం వైఎస్‌ జగన్‌, రాయచోటిలో శ్రీకాంత్‌రెడ్డి విజయానికి ఎలాంటి ఢోకా లేదని విశ్లేషకులు వెల్లడిస్తున్నారు. అక్కడ మెజార్టీపైనే లెక్కల చర్చలు సాగుతున్నాయి.

ఐదుగురికి హ్యాట్రిక్‌
ఉమ్మడి కడప జిల్లాలో 2024 ఎన్నికల ఫలితాలల్లో ఐదుగురికి హ్యాట్రిక్‌ దక్కనున్నట్లు రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. ఇప్పటికే వరుసగా రెండుసార్లు గెలుపొందిన వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి, శెట్టిపల్లె రఘురామిరెడ్డి, పోచంరెడ్డి రవీంద్రనాథరెడ్డి, ఎస్‌బీ అంజాద్‌భాషా, రాచమల్లు శివప్రసాదరెడ్డిలు విజ యం సాధించి హ్యాట్రిక్‌ సొంతం చేసుకునే దశలో ఉన్నారని విశ్లేషకులు వెల్లడిస్తున్నారు. ప్రజాతీర్పు అందుకు అనుగుణంగా ఉన్నట్లు జిల్లా వాసులు భావిస్తున్నారు.

పుట్టా...పుత్తాకు చేదు అనుభవం 
‘అందని ద్రాక్ష పుల్లనా’ అన్నట్లుగా మైదుకూరు, కమలాపురం తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు పుట్టా సుధాకర్‌యాదవ్‌, పుత్తా చైతన్యరెడ్డిల పరిస్థితి ఉత్పన్నం కానున్నట్లు సమాచారం. ఎన్నికలకు ముందు నుంచి ఉన్న అంచనాలు పోలింగ్‌లో తలకిందులయ్యాయి. చంద్రబాబు వస్తే సంక్షేమ పథకాలు రద్దు అయితాయనే భావనతోనే గ్రామాల్లో సామాన్య మహిళలు, వృద్ధులు, మైనార్టీలు పోలింగ్‌లో పోటాపోటీగా పాల్గొన్నారని విశ్లేషకులు భావిస్తున్నారు. ఒక్క అవకాశం ఇవ్వాలన్న పుట్టా సుధాకర్‌ యాదవ్‌కు అనువుగా ఓటింగ్‌ కొనసాగలేదనే భావనే మైదుకూరులో వ్యక్తమౌతోంది. 

రెడ్డి, ఎస్సీ, మైనార్టీ వర్గాలకు చెందిన ఓటర్లు అత్యధికంగా వైఎస్సార్‌సీపీకీ అండగా నిలిచారని పలువురు వివరిస్తున్నారు. కమలాపురం టీడీపీ అభ్యర్థిగా పుత్తా కృష్ణచైతన్యరెడ్డి పోటీ చేశారు. వరసగా నాలుగు పర్యాయాలు ఈయన తండ్రి పుత్తా నరసింహారెడ్డి ఇక్కడి నుంచి ఓడిపోయారు. సానుభూతి వ్యక్తం అవుతోందనుకున్న తరుణంలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థిని మార్పు చేసింది. ఈ పరిణామం పార్టీకి నష్టం చేసిందనే చెప్పాలి. మరోవైపు మాజీ ఎమ్మెల్యే వీరశివారెడ్డి, సాయినాథశర్మ ఫ్యాక్టర్‌ వైఎస్సార్‌సీపీకి కలిసి వచ్చింది. ఎన్నికలు దగ్గర పడే కొద్ది వైఎస్సార్‌సీపీ ఊపు మీదకు వచ్చింది. వల్లూరు, చెన్నూరు, చింతకొమ్మదిన్నె, కమలాపురం మండలాలపై టీడీపీ పెట్టుకున్న ఆశలు ఆవిరి అయ్యాయి. 

మరోవైపు పెండ్లిమర్రి, వీరపునాయునిపల్లె మండలాలు వైఎస్సార్‌సీపీ ఆధిపత్యం మరోమారు నిరూపితం కానుంది. ఆ నాలుగు మండలాలల్లో కూడా పైచేయి సాధించే దిశగా వైఎస్సార్‌సీపీ వ్యవహారాలు నడిపింది. వెరసి కమలాపురం ఓటర్లు మరోమారు వైఎస్సార్‌సీపీ అభ్యర్థి పోచంరెడ్డి రవీంద్రనాథరెడ్డికి విజయం కట్టబెట్టనున్నట్లు ఆయా వర్గాలు వెల్లడిస్తున్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement