కష్టపడేవారికి సముచితస్థానం
పేదలకు మేలు
చేయడమే విధ్వంసమా
వైఎస్సార్‌సీపీ రీజనల్ కో ఆర్డినేటర్
పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి
కడప కార్పొరేషన్ : పేదలకు మేలు చేయడమే వైఎస్ జగన్ చేసిన విధ్వంసమా...అని వైస్సార్‌సీపీ రీజనల్ కో ఆర్డినేటర్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ప్రశ్నించారు. గురువారం ఆయన కడపలో విలేకరులతో మాట్లాడారు. ఎన్నికల ముందు చంద్రబాబు సూపర్ సిక్స్‌తోపాటు అనేక హామీలిచ్చారని, ఇప్పుడు ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా లేదని మాట మారుస్తున్నారన్నారు. ఇంటర్నేషనల్ ఎకనమిక్ ఎక్స్‌పర్ట్‌ని, ఫైనాన్షియల్ మేనేజ్‌మెంట్ బాగా తెలుసని చెప్పిన చంద్రబాబుకు హామీలిచ్చే ముందు ఆర్థిక పరిస్థితి తెలీదా... అని ఎద్దేవా చేశారు. అధికారంలోకి వచ్చిన ఈ 8 నెలల్లోనే రూ.1.19 లక్షల కోట్లు అప్పులు చేశారని, ఏ ప్రాజెక్టు చేపట్టకుండా, ఏ ఒక్కరికీ ఉద్యోగం ఇవ్వకుండా దేని కోసం ఖర్చు చేశారని నిలదీశారు. అమరావతిలో కూడా సొంత లాభం, సొంత సంపాదన కోసమే ఖర్చు చేస్తున్నారని విమర్శించారు. వైఎస్ జగన్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రెండేళ్లు కరోనా వచ్చినా నిర్ణయించిన తేదీల ప్రకారమే సంక్షేమ పథకాలు అమలు చేశారని గుర్తు చేశారు. ఏపీ మరో శ్రీలంక అవుతుందని పవన్‌కళ్యాణ్, పురందరేశ్వరి అబద్దాలు చెప్పారని, రాష్ట్రానికి రూ.14లక్షల కోట్లు అప్పుందని ఒకరు, రూ.12లక్షల కోట్లు అప్పుందని మరొకరు తప్పుడు లెక్కలు చెప్పారన్నారు. రాష్ట్రానికి ఉన్న అప్పు రూ.6.49లక్షల కోట్లేనని వారి మంత్రే చెబుతున్నారని, ఇందులో అధిక మొత్తం టీడీపీ హయాంలో చేసినవేనన్నారు, ఇచ్చిన హామీలు అమలు చేయకుండా అరాచకాలు చేస్తున్న కూటమి ప్రభుత్వానికి ప్రజలే బుద్ది చెబుతారని హెచ్చరించారు.
కడప కార్పొరేషన్ : పార్టీ కోసం కష్టపడే కార్యకర్తలు, నాయకులకు సముచిత స్థానం కల్పిస్తామని వైఎస్సార్‌సీపీ రీజనల్ కో ఆర్డినేటర్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి భరోసా ఇచ్చారు. గురువారం స్థానిక చలమారెడ్డిపల్లె సమీపంలోని ఎంఎస్‌ఆర్ హిల్ వ్యాలీలో నిర్వహించిన వైఎస్సార్‌సీపీ జిల్లా సర్వసభ్య సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై జిల్లా కమిటీ, అనుబంధ విభాగాల అధ్యక్షులతో ప్రమాణ స్వీకారం చేయించారు. అనంతరం పెద్దిరెడ్డి మాట్లాడుతూ 26 జిల్లాల్లో తొలిసారి జిల్లా కమిటీ వేసి, జిల్లా కమిటీ సమావేశం నిర్వహించిన పార్టీ జిల్లా అధ్యక్షుడు పి. రవీంద్రనాథ్‌రెడ్డిని అభినందించారు. ఈ పదవులు అలంకారప్రాయం కాకూడదని, అహ ర్నిశలు కష్టపడి పార్టీని అధికారంలోకి తీసుకురావాలన్నారు. అన్ని జిల్లాలకు వైఎస్సార్ జిల్లా స్ఫూర్తిగా నిలవాలని సూచించారు. వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అన్నీ లెక్కలు వేసుకొని పార్టీ మేనిఫెస్టో ప్రకటిస్తారని, 2014 ఎన్నికల్లో రైతు రుణమాఫీ ఇస్తామని ప్రకటించాల్సిందిగా తాము కోరితే ఆయన అంగీకరించలేదన్నారు. వైఎస్‌ఆర్ తనయుడు హామీ ఇచ్చి అమలు చేయలేదని ప్రజలు చెప్పుకుంటారని...డ్వాక్రా రుణాలు మాత్రమే మాఫీ చేస్తామని ప్రకటించారన్నారు. 2024 ఎన్నికల్లో కూడా సరిగ్గా అదే జరిగిందన్నారు. చంద్రబాబు, బీజేపీ, పవన్ కళ్యాణ్ అబద్ధాలు చెప్పి ప్రజలను మాయ చేశారన్నారు. ఈ ఎనిమిది నెలల కూటమి పాలనలో ఎవరూ సంతోషంగా లేరని, వ్యాపారాలు వెలవెలబోతున్నాయన్నారు. ఈ ప్రభుత్వానికి ఓటేసినందుకు ప్రజలు, ఆ పార్టీ అధికారంలోకి వస్తే లాభపడుతామని భావించిన వారు పశ్చాత్తాపపడుతున్నారన్నారు. గతంలో జరిగిన పొరపాట్లు జరగనివ్వబోమని, 2029 ఎన్నికల్లో పార్టీకి తిరుగులేని విజయాన్ని అందించేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కోరారు. సమావేశంలో ఎమ్మెల్యే దాసరి సుధ, ఎమ్మెల్సీలు రామసుబ్బారెడ్డి, రమేష్ యాదవ్ , డీసీ గోవిందరెడ్డి, నేతలు అంజద్‌బాషా, శ్రీకాంత్ రెడ్డి, సురేష్‌బాబు తదితరులు ప్రసంగించారు. కూటమి పార్టీలు కలిసి సాధ్యం కాని హామీలు ఇచ్చా యన్నారు. ఇప్పుడు హామీలు అమలు చేయలేక చేతులెత్తేశాయని మండిపడ్డారు. కూటమి ప్రభుత్వానికి కౌంట్ డౌన్ స్టార్ట్ అయ్యిందన్నారు. ప్రజల కోసం, మన కోసం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని మళ్లీ సీఎం చేసుకుందామని పిలుపునిచ్చారు. ఈ సారి కార్యకర్తలను గుర్తిస్తామని.. అందరికీ మంచి జరుగుతుందని నేతలు స్పష్టం చేశారు. ఈ సమావేశంలో మాజీ ఎమ్మెల్యే రఘురామిరెడ్డి, పార్టీ కోశాధికారి ఇరగంరెడ్డి తిరుపాల్‌రెడ్డి పాల్గొన్నారు.
కార్యకర్తలకు అండగా ఉంటాం – అమర్‌నాథ్‌రెడ్డి
ఇప్పుడు పదవులు వచ్చిన వారికే కాకుండా, రాని వారికి కూడా త్వరలో పదవులు వస్తాయని వైఎస్సార్‌సీపీ అన్నమయ్య జిల్లా అధ్యక్షులు ఆకేపాటి అమర్‌నాథ్‌రెడ్డి అన్నారు. పార్టీ నాయకులు, కార్యకర్తలకు తామంతా అండగా ఉంటామన్నారు. గతంలో కార్యకర్తలకు పూర్తి స్థాయిలో న్యాయం జరగలేదని, ఈ సారి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తప్పక మేలు చేస్తారని తెలిపారు. 2029 ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ జెండా రెపరెపలాడాలన్నారు.
మేనిఫెస్టోను ప్రభుత్వం వదిలేసింది – రవీంద్రనాథ్‌రెడ్డి
ఎన్నికల మేనిఫెస్టోను, రాష్ట్ర అభివృద్ధిని కూటమి ప్రభుత్వం వదిలేసిందని వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు పి.రవీంద్రనాథ్‌రెడ్డి విమర్శించారు. జిల్లా కమిటీ, అనుబంధ కమిటీల్లో నియమితులైన వారికి శుభాకాంక్షలు తెలిపారు. త్వరలోనే అందరికీ గుర్తింపు కార్డులు ఇచ్చి తగిన శిక్షణ ఇస్తామన్నారు. టీడీపీ వేధింపులు, అక్రమ కేసులపై కలిసికట్టుగా పోరాడుతామని పిలుపునిచ్చారు.
కూటమికి ఓటేసినందుకు
ప్రజల్లో పశ్చాత్తాపం మొదలైంది
గతంలో జరిగిన పొరపాట్లు ఇకపై జరగవు
వైఎస్సార్‌సీపీ రీజనల్ కో–ఆర్డినేటర్
పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి
Comments
Please login to add a commentAdd a comment