ఒంటిమిట్ట : ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి దేవాలయానికి గురువారం తిరుమల శ్రీవారి లడ్డూలు చేరాయి. తిరుమల నుంచి ప్రత్యేక వాహనంలో 2 వేల లడ్డూలు వచ్చాయి. గతంలో రెండు, నాలుగో శనివారాల్లో ఇచ్చే లడ్డూలు గత కొన్ని నెలలుగా ప్రతిరోజూ ఇస్తున్నారు.
దేవుని కడపకు ఒంటిమిట్ట రామయ్య అశ్వాలు
ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి రథానికి ఉన్న అశ్వాలు దేవుని కడప రథోత్సవానికి తరలివెళ్లాయి. దేవుని కడపలో ఫిబ్రవరి 4న రథోత్సవం జరుగుతుంది. టీటీడీ అధికారుల ఆదేశాల మేరకు అశ్వాలను గురువారం ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి రథం నుంచి వేరుచేసి ఓ ప్రైవేటు వాహనంలో తీసుకెళ్లారు.
హత్యరాలలో 3న వేలం పాట
రాజంపేట టౌన్ : పవిత్ర పుణ్యక్షేత్రం హత్యరాలలో టెంకాయలను విక్రయించుకునేందుకు ఫిబ్రవరి 3వ తేదీ ఉదయం 11 గంటలకు త్రేతేశ్వర స్వామి ఆలయ ఆవరణలో బహిరంగ వేలంపాట నిర్వహించనున్నట్లు సమూహ దేవస్థానాల కార్యనిర్వహణాధికారి గంగవరం కొండారెడ్డి గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. వేలంపాటలో పాల్గొనే ప్రతి ఒక్కరూ ధరావత్తు కింద రూ.50 వేలు చెల్లించాల్సి ఉంటుందన్నారు. హెచ్చుపాటదారుడు పాట ముగిసిన వెంటనే డిపాజిట్‌తో కలిపి సగం డబ్బులను చెల్లించాలన్నారు. మిగతా మొత్తం పదిరోజుల లోపు చెల్లించాల్సి ఉంటుందని చెప్పారు. వేలంపాట దక్కించుకున్న వారు ఒక్కో టెంకాయను యాబై రూపాయిలకు మాత్రమే విక్రయించాలన్నారు. వేలంపాటను దక్కించుకున్న వారు ఈఏడాది ఫిబ్రవరి 3వ తేదీ నుంచి వచ్చే ఏడాది జనవరి 31వ తేదీ వరకు మాత్రమే హత్యరాలలోని త్రేతేశ్వర స్వామి ఆలయ పరిసర ప్రాంతంలో టెంకాయలను విక్రయించుకోవచ్చని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment