
జాతీయ డ్రైవర్ల కమిషన్ ఏర్పాటు చేయాలి
కడప సెవెన్‌రోడ్స్ : డ్రైవర్లు వారి కుటుంబాల రక్షణ, సంక్షేమం కోసం కేంద్ర ప్రభుత్వం వెంటనే జాతీయ డ్రైవర్ల కమిషన్‌ను ఏర్పాటు చేయాలని ఆలిండియా సేఫ్టీ డ్రైవర్స్ అసోసియేషన్ అధ్యక్షులు అన్వర్‌బాష, కడప ఇన్‌చార్జి అయ్యప్ప కోరారు. అసోసియేషన్ పిలుపు మేరకు శనివారం నిర్వహించిన చలో ఢిల్లీ కార్యక్రమంలో వారు మాట్లాడారు. రహదారులపై డ్రైవర్లకు రోజురోజుకు సమస్యలు పెరిగిపోతున్నాయన్నారు. పోలీసులు, ట్రాఫిక్ పోలీసులు, రవాణా అధికారుల వేధింపులు అధికమవుతున్నాయన్నారు. అనుకోని రీతిలో అకాల ప్రమాదాల బారిన పడితే తమ కుటుంబాలను ఆదుకునే వారే లేరని ఆవేదన వ్యక్తం చేశారు. దేశంలో సుమారు 30 కోట్ల మంది డ్రైవర్లుగా పనిచేస్తూ దేశ ఆర్థిక వ్యవస్థ చోదక శక్తులుగా ఉన్నారని పేర్కొన్నారు. విలువైన సేవలు అందిస్తున్న తమ భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని కేంద్ర ప్రభుత్వం ఇప్పటికై నా జాతీయ డ్రైవర్ల కమిషన్‌ను ఏర్పాటు చేసి ఆదుకోవాలన్నారు. రాష్ట్ర స్థాయిలో డ్రైవర్ల సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ నాయకులు ఎస్.మహమ్మద్‌బాష, లింగమూర్తి, చంద్రమోహన్ తదితరులు పాల్గొన్నారు.
వేంపల్లె సబ్ రిజిస్ట్రార్‌పై చర్యలు చేపట్టాలి
– ఇన్‌చార్జి సబ్ రిజిస్ట్రార్‌ను సస్పెండ్ చేసిన ఉన్నతాధికారులు
కడప కోటిరెడ్డిసర్కిల్ : ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్న వేంపల్లె ఇన్‌చార్జి సబ్ రిజిస్ట్రార్ ఈశ్వరయ్యపై సత్వరమే చర్యలు చేపట్టాలని వేంపల్లె టీడీపీ నాయకుడు శేషయ్యతో పాటు కార్యాలయ పరిధిలోని ఆయా గ్రామాల ప్రజలు నాగసుబ్బారెడ్డి, చంద్రశేఖర్‌రెడ్డి, శశిధర్‌రెడ్డి, శేషారెడ్డి, వెంకటేశ్, రాజశేఖర్‌రెడ్డి, నాగేష్‌రెడ్డి, గంగయ్య, వాసుదేవారెడ్డి తదితరులు కోరారు. ఈ మేరకు వారు శనివారం కడపలోని స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్‌శాఖ డీఐజీ వీఎస్‌ఆర్ ప్రసాద్‌కు వినతిపత్రాన్ని సమర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తమ అభ్యర్థన మేరకు వేంపల్లె ఇన్‌చార్జి సబ్ రిజిస్ట్రార్‌పై చర్యలు తీసుకునేందుకు డీఐజీ హామీ ఇవ్వడంపై ఆయనకు ధన్యవాదాలు తెలియజేస్తున్నామన్నారు. సబ్ రిజిస్ట్రార్ అవినీతికి అంతే లేకుండా పోతోందన్నారు. ఇతనిపై గతంలో కూడా ఫిర్యాదు చేయగా, విచారణలు సైతం జరిగాయన్నారు. వేంపల్లె సబ్ రిజిస్ట్రార్‌పై డీఐజీ చర్యలు తీసుకోకపోతే పెద్ద ఎత్తున ఉద్యమించాల్సి వస్తుందని వారు హెచ్చరించారు. ఈ నేపథ్యంలో జిల్లా రిజిస్ట్రార్ పీవీఎన్ బాబును సంప్రదించగా ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు వేంపల్లె ఇన్‌చార్జి సబ్ రిజిస్ట్రార్‌ను సస్పెండ్ చేసినట్లు తెలియజేశారు.

జాతీయ డ్రైవర్ల కమిషన్ ఏర్పాటు చేయాలి
Comments
Please login to add a commentAdd a comment