
గ్రీవెన్స్‌సెల్‌కు వినతుల వెల్లువ
కడప సెవెన్‌రోడ్స్ : కలెక్టర్ కార్యాలయ సభా భవనంలో సోమవారం నిర్వహించిన ప్రజా వినతుల పరిష్కార వేదిక కార్యక్రమానికి జిల్లా నలుమూలల నుంచి అర్జీదారులు పెద్ద సంఖ్యలో వచ్చారు. ఇన్‌ఛార్జి డీఆర్వో వెంకటపతి, ఇతర అధికారులకు తమ సమస్యలు విన్నవించారు.
● లింగాల మండలం తాతిరెడ్డిపల్లె సర్వే నెంబరు 457లో తనకు వారసత్వంగా వచ్చిన 1.41 ఎకరాల భూమిని టీడీపీ నాయకులు సురేంద్రారెడ్డి, సుధాకర్‌రెడ్డి అనే వ్యక్తులు ఆక్రమించి అరటిమొక్కలు నాటారని కోమన్నూతల గ్రామానికి చెందిన శ్రావణి ఫిర్యాదు చేశారు. అధికారుల చుట్టూ తిరుగుతున్నా పట్టించుకోవడం లేదన్నారు. టీడీపీ నేతల నుంచి తన భూమిని ఇప్పించాలని కోరారు.
● వీఎన్ పల్లె మండలం అనిమెలలో 1976–77 ప్రాంతంలో దళితులకు మంజూరు చేసిన పట్టా భూములను ఎం.జగదీశ్వర్‌రెడ్డి, జోగిరెడ్డి, రాజారెడ్డి, ఝాన్సీలక్ష్మి తదితరులు ఆక్రమించారని దళిత హక్కుల పోరాట సమితి జిల్లా కార్యదర్శి మునెయ్య ఫిర్యాదు చేశారు.
● ఇంజనీరింగ్ కాలేజీలో ఔట్‌సోర్సింగ్ కింద పనిచేస్తున్న కొంతమంది జాబ్‌కార్డులు పొంది ఉపాధి హామీ సొమ్మును కాజేస్తున్నారని చాపాడు మండలం పల్లవోలు గ్రామానికి చెందిన ఆంజనేయులు ఫిర్యాదు చేశారు. ఫీల్డ్ అసిస్టెంట్, ఏపీడీఓ సుబ్బారెడ్డి మద్దతుతోనే ఇది జరుగుతోందని ఫిర్యాదు చేశారు.
● బెంగుళూరు–విజయవాడ ఆరు లేన్ల రహదారి నిర్మాణంలో భాగంగా రెండు ఎకరాల తన భూమిని ప్రభుత్వం సేకరించిందని, తన అన్న నరసింహారెడ్డి పేరిట అవార్డు పాస్ చేశారని బ్రహ్మంగారిమఠం మండలం చిన్నాయిపల్లెకు చెందిన పెంచల్‌రెడ్డి ఫిర్యాదుచేశారు. అన్ని డాక్యుమెంట్ ఆధారాలు తమకు ఉన్నప్పటికీ రెవెన్యూ అధికారులు స్పందించడం లేదన్నారు.