
ఆర్టీపీపీలో చోరీ కేసులో నిందితుడి అరెస్టు
ఎర్రగుంట్ల : డాక్టర్ ఎంవీఆర్ రాయలసీమ థర్మల్ పవర్ ప్రాజెక్టు క్వార్టర్స్‌లో ఫిబ్రవరి నెలలో జరిగిన చోరీ కేసుకు సంబంధించి నిందితుడు గణపత్ దావర్ (25)ను అరెస్టు చేసినట్లు కొండాపురం సీఐ మహమ్మద్ రఫీ తెలిపారు. సోమవారం కలమల్ల పోలీస్ స్టేషన్‌లో ఎస్‌ఐ తిమోతితో కలసి నిందితుడి అరెస్టు వివరాలు వెల్లడించారు. ఈ సందర్భంగా సీఐ మాట్లాడుతు మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని థార్ జిల్లా కుక్షి తాలూకాలోని నర్వాలి గ్రామానికి చెందిన జవర్‌సింగ్ కుమారుడు గణపత్ దావర్ చెడు వ్యసనాలకు బానిసయ్యాడన్నారు. మరో ముగ్గురు స్నేహితులతో కలిసి తమ అవసరాలకు తప్పుడు మార్గంలో డబ్బు సంపాదించాలనే ఉద్దేశంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కర్మాగారాలు, పెద్దపెద్ద అపార్ట్‌మెంట్‌లను ఎంచుకుని దొంగతనాలు చేస్తున్నారన్నారు. ఆర్టీపీపీలోని క్వార్టర్స్‌లో తాళాలు వేసిన ఇళ్లను టార్గెట్ చేసుకున్నారని తెలిపారు. ఇలా ఫిబ్రవరి నెలలో 9.10 తేదీల మధ్య రాత్రి సమయంలో ఆరు ఇళ్లలో దొంగతనాలు చేశారన్నారు. సుమారు రూ.2,40,000లు విలువ గల బంగారు, వెండి ఆభరణాలను చోరీ చేశారన్నారు. బాధితులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి కలమల్ల ఎస్‌ఐ తిమోతి దర్యాప్తు చేపట్టారు. ఈ క్రమంలోనే సోమవారం నిందితులు మళ్లీ దొంగతనాలు చేసేందుకు వచ్చారని అందిన సమాచారం మేరకు ఎర్రగుంట్ల– ముద్దనూరు మార్గంలోని కొత్తపల్లి క్రాస్ రోడ్డు వద్ద నిందితుడు గణపత్ దావర్‌ను అరెస్టు చేశామన్నారు. మరో ముగ్గురిని అరెస్టు చేయాల్సి ఉందన్నారు. ఈ కేసులో ఆధారాలను సేకరించడంలో, నేరస్తుల ఆచూకీ కనిపెట్టడంలో తన నైపుణ్యాన్ని చూపిన ఎస్‌ఐ తిమోతి, ఇతర సిబ్బందిని జిల్లా ఎస్పీ, జమ్మలమడుగు డీఎస్పీ, కొండాపురం సీఐ మహమ్మద్‌రఫీలు అభినందించారు.