
యార్డు.. సమస్యల్లో రికార్డు
● కమీషన్లు తీసుకుంటారు.. వసతులు కల్పించరు
కడప అగ్రికల్చర్: ‘కడప మార్కెట్‌యార్డులో అధికారులు అమ్మకాలపై కమీషన్లు తీసుకుంటారు కానీ వసతులు కల్పించడం లేదు’ అని ది కడప టర్మిరిక్ అసోసియేషన్ నాయకులు ధ్వజమెత్తారు. కడప మార్కెట్‌యార్డులో మంగళవారం వారు విలేకర్ల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆ అసోసియేసన్ అధ్యక్షుడు రామక్రిష్ణారెడ్డి, ఉపాధ్యక్షుడు జవహర్లాల్ చౌదరి, సెక్రటరీ నరసింహులు, జాయింట్ సెక్రటరీ గుర్రకొండ మహేష్ మాట్లాడారు. రూ.లక్షకు వెయ్యి కమీషన్ తీసుకుంటారని, ఏటా కోట్లలో వ్యాపారం జరుగుతుందని తెలిపారు. రైతులు ఉత్పత్తులు అమ్మకపోతే, వాటిని నిల్వ చేసుకునేందుకు సరైన గోడౌన్‌ల సౌకర్యం లేదన్నారు. యార్డులోని షాపులకు సంబంధించి కడప కార్పొరేషన్‌కు ఏడాదికి ఒక్క భవనానికి రూ. 44 వేల పన్ను కడతామని, అలాంటి భవనాలు 35కు పైగా ఉన్నాయన్నారు. అటు కార్పొరేషన్ అధికారులు కానీ, ఇటు మార్కెట్ అధికారులు కానీ పట్టించుకోవడం లేదన్నారు. యార్డు లోపల రోడ్లు కూడా సరిగా లేవన్నారు. అన్ని గుంతలేనన్నారు. చిన్నపాటి వర్షం వచ్చిన నీరంతా వచ్చి చేరుతుందన్నారు. ఇన్ని అసౌకర్యాల మధ్య రైతులు యార్డుకు ఎలా వస్తారన్నారు.
బస్తాకు రూ.9.18 నుంచి రూ.13.50 పెంచారు
యార్డులో కొనుగోలు చేసిన పసుపును నిల్వ ఉంచుకునేందుకు సీడబ్లూసీ గోడౌన్‌లో స్టాక్ ఉంచుకుందామంటే.. గోడౌన్ వారు ఎక్కడా లేని ధరలు పెంచారన్నారు. మొన్నటి వరకు రూ.75 కిలోల బస్తాకు నెల బాడుగ కింద రూ.9.18 తీసుకునే వారని, అలాంటిది ఏప్రిల్ నుంచి ఎలాంటి సమచారం లేకుండా రూ.13.50 పెంచారన్నారు. కడప మార్కెట్ యార్డు నుంచి 2500 బస్తాల నుంచి 4 వేల బస్తాల పసుపు వస్తుందన్నారు. ఇన్ని బస్తాలకు ఎంత మొత్తంలో చెల్లించాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. వ్యాపారులకే కాకుండా రైతుల వద్ద కూడా అంతే వసూలు చేస్తున్నారన్నారు. ఉన్నతాధికారులు స్పందించి ఈ ధరలు తగ్గించాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో అసోసియేషన్ సభ్యులు చంద్రప్రకాశ్ చోప్రా, బాబూలాల్ చోప్రా, మాజీ మార్కెట్‌యార్డు డైరెక్టర్ జవహర్లాల్ చౌదరి, రాజగోపాల్‌రెడ్డి, కాలేమనాయుడు పాల్గొన్నారు.
కడప అగ్రికల్చర్: కడప మార్కెట్‌యార్డు సమస్యల్లో రికార్డు సృష్టిస్తోంది. ఇక్కడ కనీస మౌలిక వసతులు లేకపోవడంతో.. రైతులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. నెలల తరబడి వేలకు వేలు ఖర్చు చేసి.. పంటలను కంటికి రెప్పలా కాపాడుకుని మంచి దిగుబడులు సాధిస్తే.. వాటిని అమ్ముకునేందుకు అష్టకష్టాలు పడాల్సి వస్తోంది. కడప మార్కెట్‌యార్డుకు జిల్లాలోని నలుమూలల నుంచి పసుపు, వేరుశనగక్కాయలను తెచ్చి అమ్ముకుంటారు. అయితే ఇక్కడ షెడ్లు లేకపోవడంతో.. ఆరుబయట, రోడ్డుపైనే ఉత్పత్తులను రాసులు పోసుకుని అమ్ముకోవాల్సిన పరిస్థితి నెలకొంది. ఇలాంటి సందర్భాల్లో వర్షాలు వస్తే.. భారీగా నష్టపోవాల్సి వస్తోంది. ఈ నెల 3వ తేదీ సాయంత్రం వచ్చిన అకాల వర్షంతో పసుపు, వేరుశనక్కాయలు తడిచిపోయాయి. వాటిపైన పట్టలు కప్పినప్పటికీ.. యార్డులో వర్షపు నీరు పోయేందుకు వీలులేక నీరంతా వాటి కిందికి చేరాయి. అవి తడిచిపోకుండా కాపాడుకునేందుకు రైతులు పడరాని పాట్లు పడ్డారు. మళ్లీ బస్తాకు రూ.40 చెల్లించి హమాలీలతో ఆరుబయట ఎండ పెట్టుకోవాల్సి వచ్చింది. తడిచిన సరుకు కావడంతో వ్యాపారులు ఎవరూ కొనుగోలుకు ముందుకు రాలేదని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో తక్కువ రేటుకు అమ్ముకుని నష్టపోవాల్సి వచ్చిందని వారు వాపోయారు.
మంచినీరు.. మరుగుదొడ్లు కరువే..
మంచినీటితోపాటు మరుగుదొడ్లు కరువయ్యాయి. సీజన్‌లో రైతులు రోజుకు పదుల సంఖ్యలో వస్తారు. వీరితోపాటు వ్యాపారులు, హమాలీలు, మహిళా కూలీలు ఇలా చాలా మంది ఉంటారు. కానీ ఇక్కడ ఒక్క మరుగుదొడ్డి కూడా లేదు. ఆరుబయట చెట్ల పొదలు, గోడ పంచకు వెళ్లాల్సిన పరిస్థితి నెలకొందని వారు వాపోయారు. గతంలో అక్కడ అరకొరగా ఉన్న మరుగుదొడ్లను రోడ్డు వెడల్పులో తొలగించారు. తర్వాత నిర్మించలేదు. ఒక్క మంచినీటి కూల్ క్యాన్‌ను ఏర్పాటు చేసి తాగునీటిని అందిస్తున్నారు. ఈ నీరు అందరికీ సరిపోకపోవడంతో ఇబ్బంది పడాల్సి వస్తోంది. రైతులు విశ్రాంతి తీసుకునేందుకు గతంలో విశ్రాంతి భవనం ఏర్పాటు చేశారు. అది శిథిలావస్థకు చేరుకోవడంతో ఎవరూ వినియోగించుకోవడం లేదు. చెట్ల కింద, భవనాల పంచన విశ్రాంతి తీసుకుంటున్నారు. అధికారులు స్పందించి మౌలిక వసతులు కల్పించాలని వారు వేడుకుంటున్నారు.
ప్రతిపాదనలు పంపాము
జంబో షెడ్డుకు సంబంధించి సివిల్ వర్కు పూర్తయింది. మిగతా ఆగిన పనులకు సంబంధించి నిధుల కోసం ప్రతిపాదనలు పంపాము. నిధులు రాగానే మిగిలిన పనులను పూర్తి చేసి వినియోగంలోకి తీసుకుని వస్తాము. మిగతా సమస్యల గురించి ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తాం.
– సుబ్బారెడ్డి, ఈఈ, మార్కెటింగ్ శాఖ
సరైన వసతుల లేవు
కడప మార్కెట్‌యార్డులో సరైన మౌలిక వసతులు లేవు. దీంతో ఆరుబయట రోడ్డు పైన వేరుశనగక్కాయలను అమ్ముకోవాల్సి వస్తుంది. సరైన గిట్టుబాటు ధర రాకుంటే.. వాటిని మళ్లీ సంచులకు ఎత్తాలి. అప్పుడు ధాన్యంతోపాటు మట్టి, దుమ్ము వస్తుంది. అధికారులు స్పందించి వసతులు కల్పించాలి.
– చిన్న సుబ్బారెడ్డి, కొత్తగిర్రిపల్లె, పెండ్లిమర్రి మండలం
40 బస్తాలు తడిచిపోయాయి
ఈ నెల 3వ తేదీన 40 బస్తాల పసుపును మార్కట్‌యార్డుకు తెచ్చాను. అదే రోజు సాయంత్రం ఉన్నట్లుండి వర్షం కురిసింది. దీంతో పసుపంత తడిచి ముద్దయింది. మళ్లీ హమాలీలకు బస్తాకు రూ.40 ఇచ్చి ఆరుబెట్టుకున్నాను. అయినా కొనుగోలుకు వ్యాపారులు ఆసక్తి చూపకపోవడంతో తక్కువ ధరకు అమ్ముకున్నాను.
– ఓబుల్‌రెడ్డి, రైతు, తిప్పిరెడ్డిపల్లె, సికెదిన్నె మండలం
మార్కెట్ యార్డులో వసతులు కరువు
పట్టించుకోని అధికారులు
రైతులకు తప్పని తిప్పలు
ఏళ్ల తరబడి..
కడప మార్కెట్‌యార్డుకు గతంలో రూ.84 లక్షలతో జంబో షెడ్డు మంజూరు చేశారు. దీనిని కాంట్రాక్టర్ కొంత వరకు నిర్మాణ పనులు చేపట్టి వదిలేశారు. దీంతో నిర్మాణం అసంపూర్తిగా ఉంది. దీంతో రైతులకు అవస్థలు తప్ప డం లేదు. కడపు నిండా భోజనం చేసేందుకు కూడా సరైన హోటల్ లేక పస్తులుండాల్సిన పరిస్థితి నెలకొందని వారు వాపోతున్నారు.

యార్డు.. సమస్యల్లో రికార్డు

యార్డు.. సమస్యల్లో రికార్డు

యార్డు.. సమస్యల్లో రికార్డు

యార్డు.. సమస్యల్లో రికార్డు

యార్డు.. సమస్యల్లో రికార్డు