వీరు నాయకులా.. రాక్షసులా?:షర్మిల | Sharmila's Speech in Cheepurupalli | Sakshi
Sakshi News home page

Published Sun, Jul 14 2013 8:04 PM | Last Updated on Wed, Mar 20 2024 3:59 PM

ప్రజల కష్టాలను పట్టించుకోని ప్రభుత్వంతో పాటు బాధ్యతారహితంగా ప్రవర్తిస్తున్న ప్రధాన ప్రతిపక్షంపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత షర్మిల తీవ్రంగా ధ్వజమెత్తారు. విజయనగరం జిల్లా చీపురుపల్లిలో ఆదివారం సాయంత్రం జరిగిన భారీ బహిరంగ సభలో ఆమె ప్రసంగించారు. 'ధరలన్నీ భగ్గుమంటున్నాయి. గ్యాస్ సిలిండర్ 445 రూపాయలు అయిపోయింది. కరెంటు చార్జీలు ఆకాశాన్ని అంటుతున్నాయి. ఈ కాంగ్రెస్ పాలనలో పక్కాఇళ్ల పథకానికి పాడె కట్టారు. 108, 104 మూలన పడ్డాయి. ఉన్న పెన్షన్లను కూడా రద్దు చేస్తున్న వీళ్లను నాయకులనాలా? రాక్షసులనాలా? కిరణ్ సర్కారు కనీసం మూడు గంటలు కరెంటు కూడా ఇవ్వట్లేదు. అది కూడా ఎప్పుడిస్తారో చెప్పలేం. రైతులు అల్లాడిపోతున్నారు. పరిశ్రమలకు నెలకు 12 రోజులు పవర్ కట్. కార్మికుల పరిస్థితి దయనీయం. పైగా, ఇవ్వని కరెంటుకు మూడింతల బిల్లు వసూలుచేస్తున్నారు. మద్యం ఏరులై పారుతోంది. మద్యం మాఫియా డాన్లను తీసుకొచ్చిందీ కాంగ్రెస్ పార్టీ. రెండు లక్షల రూపాయలు కడితే మద్యం దుకాణాలకు పర్మిట్ రూంలు ఇస్తారట. అంటే మద్యం దుకాణాలను అధికారికంగా బార్లుగా మారుస్తున్నారు. మూడు మద్యం దుకాణాలు, ఆరు బార్లుగా మద్యం వ్యాపారం వర్ధిల్లుతోంది. మద్యం కుటుంబాల్లో ఎలా చిచ్చు పెడుతుందో, ప్రమాదాలకు ఎలా కారణమవుతుందో తెలిసి కూడా ఇలా ప్రోత్సహిస్తున్నారు. ఒకవైపు పాలకపక్షం ఇంత దారుణంగా ఉంటే, మరోవైపు ప్రతిపక్ష నేత చంద్రబాబు కూడా మన రాష్ట్రంలో మద్యం ధరలు పెరిగాయని, తాము అధికారంలోకి వస్తే అందరికీ అందుబాటులోకి మద్యం ధరలు తెస్తామని చెబుతున్నారు. మన ఖర్మకొద్దీ ఇలాంటి ప్రతిపక్ష నాయకుడున్నారు. పాపం ఎన్టీఆర్ గారు తెలుగుదేశం పార్టీ పెడితే ఆ పార్టీలోంచే ఆయన్ను పంపేసిన ఘనుడు చంద్రబాబునాయుడు. పెన్షన్ కావాలని ఎవరైనా వెళ్తే, అప్పటికే పెన్షన్ పొందుతున్న ఎవరైనా చనిపోతేనే కొత్త పెన్షన్ ఇస్తానని చెప్పేవారు. ఎనిమిదేళ్లలో ఎనిమిది సార్లు కరెంటు చార్జీలు పెంచారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వేసే ప్రతి ఓటూ మీ జీవితాల్లో వెలుగు నింపడం ఖాయం. నా కోసం సమయం వెచ్చించి వచ్చినందుకు మీ అందరికీ కృతజ్ఞతలు' అని ఆమె తన ప్రసంగాన్ని ముగించారు.

Related Videos By Category

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement