రాష్ట్ర విభజనతో తలెత్తే సాగునీరు, విద్యుత్తు, హైదరాబాద్, ఉద్యోగ, ఉపాధి అవకాశాలు వంటి సమస్యలపై రాష్ట్ర ప్రజల్లో ఉన్న ఆందోళనలకు కేంద్ర ప్రభుత్వం స్పష్టమైన సమాధానం ఇవ్వాలని.. వాటిపై అసెంబ్లీలోనూ కూలంకషంగా చర్చలు చేశాకనే విభజనపై ముందుకు వెళ్లాలని ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి పేర్కొన్నారు. విభజనతో ఇరు ప్రాంతాల మధ్య ఈ అంశాలు పెను సమస్యలు సృష్టిస్తాయన్నారు. ‘‘ఓ చిన్న సమస్యను పరిష్కరించటానికి మరో అతిపెద్ద సమస్యను సృష్టిస్తారా? సమస్యలను పరిష్కరించటానికి బదులు మరిన్ని పెంచేలా చేస్తారా?’’ అంటూ పరోక్షంగా కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ నిర్ణయాన్ని తప్పుపట్టారు. రాష్ట్రాన్ని విభజించి ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేయనున్నట్లు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ ప్రకటించిన తొమ్మిది రోజుల తర్వాత.. ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియ ప్రారంభమయిందని కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన వారం రోజుల తర్వాత ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి మౌనం వీడారు. ముఖ్యంగా సీమాంధ్ర ప్రాంతంలో వారం పది రోజుల నుంచి సమైక్య ఉద్యమం అగ్నిగుండంగా రగులుకొంటుండటంతో ఆయన ఎట్టకేలకు బయటకు వచ్చి మీడియాతో మాట్లాడారు. విభజనతో సాగునీరు, విద్యుత్తు, రాజధాని అంశాలపై అనేక సమస్యలు వస్తాయని.. వాటన్నిటికీ సమాధానం చెప్పాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వానిదేనని పేర్కొన్నారు. రాష్ట్ర విభజనతో తలెత్తే సాగునీటి సమస్యలపై రెండు రోజుల కిందట వైఎస్సార్ కాంగ్రెస్ నాయకుడు ఎం.వి.మైసూరారెడ్డి లేవనెత్తిన అంశాలనే సీఎం కిరణ్ ఈ సందర్భంగా ప్రస్తావించటం గమనార్హం. తెలంగాణ ఏర్పాటుకు మద్దతు ఇచ్చిన కొన్ని పార్టీలు ఇప్పుడు దొంగనాటకాలు ఆడుతున్నాయని విమర్శించిన సీఎం.. తెలంగాణ ఏర్పాటుపై పార్టీ అధిష్టానం నిర్ణయాన్ని తాను వ్యతిరేకించను, సమర్థించను అని పేర్కొనటం విశేషం. ముఖ్యమంత్రిగా వాస్తవాలు చెప్పటం తన బాధ్యత కనుక తాను ఈ విషయాలు ప్రస్తావిస్తున్నానని సీఎం వ్యాఖ్యానించారు. అయితే.. అధిష్టానాన్ని తాను ధిక్కరించటం లేదని కాబట్టి రాజీనామా చేయాల్సిన అవసరం లేదని ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ మాత్రమే విభజన నిర్ణయం తీసుకుందని.. కేంద్రం తదుపరి చర్యలు తీసుకునే ముందు ఈ సమస్యలన్నిటినీ పరిష్కరించాలని పేర్కొన్నారు. అయితే.. సీమాంధ్ర ప్రాంత నేతలు, ఉద్యోగులు, విద్యార్థులు తమ అభిప్రాయాలను కాంగ్రెస్ పార్టీ ఏర్పాటు చేసిన ఆంటోని కమిటీకి విన్నవించుకోవాలని ఆయన సూచించారు. సీఎం ప్రస్తావించిన అంశాలు ఆయన మాటల్లోనే... సమ్మె వద్దు... ఆంటోని కమిటీకి చెప్పండి ‘‘రాష్ట్ర భవిష్యత్తు అంశంపై గత తొమ్మిది రోజులుగా జరుగుతున్న ఆందోళనలు, ఉద్యమాలు సీమాంధ్ర ప్రాంతంలో ప్రజా జీవితానికి తీవ్ర ఆటంకం కలిగిస్తున్నాయి. ఉద్యమం సందర్భంగా నెహ్రూ, ఇందిర, రాజీవ్‌ల విగ్రహాలను ధ్వంసం చేయటం విచారకరం. ఇలాంటి చర్యలను ప్రభుత్వం ఉపేక్షించదు. నిరసన తెలిపే హక్కు ప్రజలకు ఉంది. కానీ హింసకు పాల్పడితే క ఠినంగా వ్యవహరిస్తాం. ప్రస్తుతం రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు కురిసి రైతులు సాగుకు సన్నద్ధమైన తరుణంలో ఎన్జీఓలు, ఇతర శాఖల ఉద్యోగులు సమ్మెకు దిగటం సరికాదు.. ఆ నిర్ణయాన్ని వెనక్కు తీసుకోవాలి. రక్షణమంత్రి ఎ.కె.ఆంటోనీ నేతృత్వంలో కాంగ్రెస్ కమిటీని వేసినందున.. రాష్ట్ర విభజన అంశంలో ఉన్న అపోహలు, సమస్యలను అక్కడ విన్నవించుకోవ చ్చు. ఈ కమిటీ కాంగ్రెస్ పార్టీపరంగా వేసిందే అయినప్పటికీ ఇందులో ఇద్దరు కేంద్రమంత్రులు కూడా ఉన్నారు. ఉద్యోగులే కాకుండా విద్యార్థులు, యువకులు సమస్యలున్న ప్రతి ఒక్కరూ ఈ కమిటీకి సమస్యలు చెప్పుకొనే ఏర్పాట్లు చేస్తాం.’’ కేవలం కాంగ్రెస్ పార్టీ నిర్ణయమే... ‘‘తెలుగుజాతి అంతా కలసి ఉండాలని ఎంతో మంది త్యాగాల ఫలితంగా ఈ రాష్ట్రం ఆవిర్భవించింది. తెలంగాణపై నిర్ణయం ఏ విధంగా తీసుకున్నారో ప్రజలంతా అర్థం చేసుకోవాలి. మొదట ఈ నిర్ణయానికి కారకులుగా డాక్టర్ వై.ఎస్.రాజశేఖరరెడ్డి పేరు చెప్పాలి. 2001-02లో 41 మంది ఎమ్మెల్యేలతో ప్రత్యేక తెలంగాణ కావాలని కాంగ్రెస్ హైకమాండ్‌కు వినతిపత్రం ఇప్పించారు. అప్పటికింకా టీఆర్‌ఎస్ కూడా ఆవిర్భవించలేదు. టీడీపీ 2008లో తెలంగాణకు మద్దతుగా తీర్మానం చేసింది. కాంగ్రెస్‌లో ఎప్పట్నుంచో రెండు ప్రాంతాల్లో రెండు అభిప్రాయాలున్నాయి. సీమాంధ్రలోని వారంతా సమైక్య రాష్ట్రాన్ని కోరుకుంటున్నారు. తెలంగాణ ప్రాంత వారు ప్రత్యేక రాష్ట్రాన్ని ఆకాంక్షిస్తున్నారు. అందరి అభిప్రాయాలు విన్నాక ఇప్పుడు కేవలం కాంగ్రెస్ పార్టీ మాత్రమే నిర్ణయం తీసుకుంది. ఈ పరిస్థితుల్లోనే ఆయా ప్రాంతాల్లో తలెత్తిన భావోదే ్వగాలకు అనుగుణంగా మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు రాజీనామాలు చేస్తున్నారు. ప్రజల ఆకాంక్షను తెలియచెప్పటం వారి విధి.’’ . . సాగునీటి సమస్యలకు సమాధానమేదీ? ‘‘శ్రీశైలం ప్రాజెక్టు తెలంగాణ, సీమాంధ్ర ప్రాంతాల మధ్యలో ఉంది. ఒకపక్క నల్గొండ.. మరోపక్క రాయలసీమకు చెందిన నాలుగు జిల్లాలు, కోస్తాలోని నెల్లూరు, ప్రకాశం జిల్లాలు ఉన్నాయి. ఈప్రాజెక్టు కింద సమైక్యంగా ఉన్న ప్రస్తుత తరుణంలో చేపడుతున్న కార్యక్రమాల వల్ల 30 లక్షల ఎకరాలు సాగులోకి రానుంది. రేపు రాష్ట్ర విభజన జరిగి ఈ ప్రాంతాలు వేర్వేరు రాష్ట్రాల కిందకు చేరితే ఈ కార్యక్రమాలు ఎలా అమలు చేస్తారు? నాగార్జునసాగర్‌లో కుడి, ఎడమ కాలువల కింద 23 లక్షల ఎకరాలు సాగవుతోంది. ఈ ప్రాజెక్టు కూడా రెండు ప్రాంతాల మధ్యలోనే ఉంది. ఒక కాలువ కింద 14 లక్షలు ఆంధ్రలో, మరో కాలువ కింద ఏడు లక్షలు తెలంగాణలో, ఆ తరువాత మళ్లీ సీమాంధ్రలోని మరో రెండు లక్షల ఎకరాలకు సాగునీరు వెళ్తోంది. ఇపుడు రాష్ట్రాన్ని విభజిస్తే దీన్ని ఏవిధంగా నిర్వహిస్తారు? కోట్లాది మంది రైతులకు నష్టం లేకుండా ఎలా చేస్తారు? పోలవరానికి జాతీయ హోదా అంటున్నారు. దీనికింద 27 లక్షల ఎకరాలు సాగులోకి వస్తుంది. మరో 23 లక్షల ఎకరాలు స్థిరీకరణ అవుతుంది. కృష్ణా డెల్టాకు గోదావరి నీటిని మళ్లించటం ద్వారా కృష్ణాలో 80 టీఎంసీలు ఆదా అవుతుంది. ఇందులో 41 టీఎంసీలు మనకు దక్కితే తద్వారా తెలంగాణకు, కరవు జిల్లాలైన రాయలసీమకు అందించటానికి వీలుంటుంది. రాష్ట్ర విభజన జరిగితే ఈ పంపకాలు ఎలా చేయగలుగుతారు? రాష్ట్రాల మధ్య ఇంటర్ కనెక్టివిటీ ఉన్న ఈ నీటిని ఎలా విభజిస్తారు? గోదావరి నుంచి 165 టీఎంసీల గోదావరి నీటిని నాగార్జునసాగర్‌కు పంపించే దుమ్ముగూడెం ప్రాజెక్టుకు ఇప్పటికే టెండర్లు కూడా పిలిచాం. ఆంధ్రప్రదేశ్ రెండు ప్రాంతాలైతే ఇది ఎలా అమలు చేస్తారు? ఇటీవలి ఖరీఫ్‌లో రెండు దఫాలుగా 49 టీఎంసీలకు గాను 45 టీఎంసీలే ఇచ్చాం. ఖమ్మం, వరంగల్ జిల్లాల్లో పడిన వర్షాల వల్ల ఆంధ్రాలోని 13 లక్షల ఎకరాలకు నీరందించాం. మనం కలసి ఉన్నాం కనుక ఆ నీటితో ఇరుప్రాంతాల రైతులు పంటలు సాగుచేసుకోగలుగుతున్నారు. అదే ఖమ్మం, వరంగల్‌లు వేరే రాష్ట్రంగా ఉంటే ఆ నీళ్లు ఎలా వస్తాయి?
Published Fri, Aug 9 2013 7:21 AM | Last Updated on Wed, Mar 20 2024 5:20 PM
Advertisement
Advertisement
పోల్
Advertisement