గోదావరి నదిపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్మించ తలపెట్టిన పట్టిసీమ ఎత్తిపోతల పథకం అంశం గోదావరి నదీ యాజమాన్య బోర్డుకు చేరనుంది. ఈ ప్రాజెక్టుపై ఇప్పటివరకు ఉత్తర ప్రత్యుత్తరాలకే పరి మితమైన ఇరు రాష్ట్రాలు.. ఈ నెల 27న జరగనున్న గోదావరి బోర్డు భేటీలో ముఖాముఖి తేల్చుకునేందుకు సిద్ధమయ్యాయి. పట్టిసీమ అంశాన్ని సమావేశం ఎజెండాలో చేరుస్తూ తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే నిర్ణయం తీసుకుంది. గోదావరి బోర్డు అనుమతి లేకుండానే, కనీస సమాచారం ఇవ్వకుండానే.. ఏపీ ప్రభుత్వం ఆ ప్రాజెక్టుకు పరిపాలనా అనుమతులివ్వడం, పనులు కూడా చేపట్టడంపై తెలంగాణ అభ్యంతరాలను లేవనెత్తనుంది.