సమైక్యాంధ్రకు మద్దతుగా సీమాంధ్రలో నిరసనల వెల్లువెత్తాయి. రాష్ట్ర విభజనను వ్యతిరేకిస్తూ కేంద్ర మంత్రులు, ఎంపీల నివాసాలను సమైక్యవాదులు సోమవారం ముట్టడించారు. కేంద్రమంత్రులు కావూరి సాంబశివరావు, పురంధేశ్వరి, పనబాక లక్ష్మి, కృపారాణి, పల్లంరాజు, కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి ఇళ్లను ముట్టడించిన జేఏసీ నేతలు ముట్టడించేందుకు ప్రయత్నించారు. ఎంపీలు లగడపాటి రాజగోపాల్, రాయపాటి సాంబశివరావు, సాయిప్రతాప్, అనంతవెంకట్రామిరెడ్డి, చింతా హర్షకుమార్, సబ్బంహరి, ఎన్ శివప్రసాద్, నిమ్మల కిష్టప్ప, సీఎం రమేష్ నివాసాల ఎదుట ఆందోళనలకు దిగారు. సమైక్యాంధ్రకు మద్దతుగా తక్షణమే రాజీనామా చేయాలంటూ నినాదాలు చేశారు. తెలంగాణ విషయంలో కేంద్ర వైఖరికి నిరసనగా మంత్రి పదవికి, ఎంపి పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ ఏలూరులో కేంద్ర మంత్రి కావూరి సాంబశివరావు నివాసాన్ని ఎపి ఎన్జీఓ ఆధ్వర్యంలో సమైక్యవాదులు ముట్టడించారు. తెలంగాణకు అనుకూలంగా నిర్ణయం తీసుకుంటే రాష్ట్రంలోకి సోనియాను అడుగుపెట్టనీయమని వారు హెచ్చరించారు. ఈ ఆందోళనలో భారీ సంఖ్యలో ఎన్జీఓ నేతలు, సమైక్యవాదులు పాల్గొన్నారు. సమైక్యవాదాన్ని ముందుండి నడిపించిన కావూరి రాష్ట్రాన్ని ముక్కలు చేయడానికి కాంగ్రెస్ ప్రయత్నిస్తుంటే పట్టించుకోకుండా పదవుల కోసం ఊరుకున్నారని ఎపి ఎన్జీఓ జిల్లా అధ్యక్షుడు సాగర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. సమైక్యాంధ్రకు మద్దతుగా విజయవాడ ఎంపీ లగడపాటి రాజగోపాల్ రాజీనామా చేయాలని సమైక్యాంధ్ర జేఏసీ డిమాండ్ చేసింది. కాంగ్రెస్ అధిష్టానంపై ఒత్తిడి చేయాలంటూ విజయవాడలో ఆయన నివాసం ముందు జేఏసీ టెంట్లు వేసి ఆందోళన చేపట్టింది. సమైక్యాంధ్రకు మద్దతుగా కేంద్రం ప్రకటన చేసేంత వరకు ఆందోళన కొనసాగుతుందని జేఏసీ తెలిపింది. సమైక్యవాదులు మళ్లీ ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తున్నారు. పార్టీల సీమాంధ్ర నేతలు వెంటనే కేంద్రంపై ఒత్తిడి పెంచాలని, రాజీనామాలు సిద్ధంకావాలని డిమాండ్ చేస్తున్నారు. తూర్పుగోదావరి జిల్లాకాకినాడలోని కేంద్ర మంత్రి పళ్లంరాజు ఇంటిని ముట్టడించారు. దీనికి ముందు నగరంలో జరిగిన భారీ ర్యాలీలలో విద్యార్ధులు, సమైక్యాంధ్ర వాదులు పాల్గొన్నారు. కేంద్రమంత్రి పురంధేశ్వరి ఇంటిని సమైక్యాంధ్ర విద్యార్థి జేఏసీ ముట్టడించింది. సమైక్యాంధ్రకు మద్దతుగా కేంద్ర మంత్రి పదవికి తక్షణమే రాజీనామా చేయాలని డిమాండ్ చేసింది. ఈ కారణంగా అక్కడ ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. ఇంటివద్ద పోలీసులు భారీగా మోహరించారు. మరోవైపు సమైక్యాంధ్రకు మద్దతుగా సీమాంధ్ర అంతటా ఆందోళనలు మిన్నంటాయి. శ్రీకాకుళం జిల్లా రాజాంలో విధులు బహిష్కరించిన లాయర్లు నిరసన తెలిపారు. నెల్లూరు ట్రంకురోడ్డుపై ఏపీ ఎన్జీవోలు బైఠాయించడంతో ట్రాఫిక్ స్తంభించింది. వీఆర్ కళాశాల సెంటర్‌లో విక్రమ సింహపురి యూనివర్సిటీ విద్యార్థులు ప్రదర్శన నిర్వహించారు. చిత్తూరు కోర్టు ఎదుట న్యాయవాదుల ఆందోళన చేపట్టారు. కేంద్రమంత్రుల దిష్టిబొమ్మలు దహనం చేశారు. అంబేద్కర్ యూనివర్సిటీలో సమైక్యాంధ్రకు మద్దతుగా కేంద్రప్రభుత్వ దిష్టిబొమ్మ దగ్ధం చేశారు. విశాఖపట్నంలో బార్ అసోసియేషన్ 48గంటల పాటు విధులను బహిష్కరించింది.
Published Mon, Jul 29 2013 2:48 PM | Last Updated on Fri, Mar 22 2024 11:26 AM
Advertisement
Advertisement
Advertisement