ఓటుకు కోట్లు కేసు విషయంలో కేంద్ర ప్రభుత్వం ఎలాంటి జోక్యం చేసుకోబోదని కేంద్ర హోం మంత్రి రాజ్‌నాథ్ సింగ్ స్పష్టం చేశారు. తెలంగాణలో విచారణ సాగుతున్న ఓటుకు కోట్లు కేసు, తదనంతర పరిణామాల నేపథ్యంలో రెండు రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్ నరసింహన్‌ను ఢిల్లీకి పిలిచిన కేంద్రం ఈ విషయంపై స్పష్టతనిచ్చినట్టు అత్యున్నతస్థాయి వర్గాలు తెలిపాయి. ‘‘ఓటుకు కోట్లు కేసులో కేంద్రం ఎటువంటి డెరైక్షన్ ఇవ్వబోదు. ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టంలో పొందుపరచిన సెక్షన్-8 అంశం, ఓటుకు కోట్లు కేసు వ్యవహారం వేర్వేరు అంశాలు. రెండింటినీ కలిపి చూడటం సరికాదు’’ అని స్పష్టతనిచ్చారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థికి ఓటు వేయాలంటూ తెలంగాణ నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్‌సన్‌కు రూ. 5 కోట్లు ఆశ చూపిన ఉదంతంలో టీటీడీపీ ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డి రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడటం, అందులో చంద్రబాబు నేరుగా ఫోన్‌లో మాట్లాడిన సంభాషణలు బాహ్యప్రపంచానికి వెల్లడైన నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం విభజన చట్టంలోని సెక్షన్-8ను తెరమీదకు తెచ్చిన విషయం తెలిసిందే. ఆ మేరకు కేంద్రానికి ఫిర్యాదు కూడా చేసింది. అయితే ఈ పరిణామాలు రోజుకో మలుపు తిరుగుతున్న క్రమంలో కేంద్ర హోంమంత్రి గవర్నర్‌ను గత శుక్రవారం ఢిల్లీకి పిలిపించుకుని వివరాలను అడిగి తెలుసుకున్నారు. హోంమంత్రితో పాటు పలు దఫాలుగా హోం శాఖ కార్యదర్శి గోయల్‌తో కూడా గవర్నర్ సమావేశమయ్యారు. విభజన చట్టంలోని సెక్షన్-8 పరిమితిని దాటి ఉల్లంఘించిన సంఘటనలు ఏమైనా తలెత్తాయా అన్న వివరాలను తెలుసుకున్నారు. హైదరాబాద్‌లో శాంతి భద్రతకు సంబంధించి ఇప్పటివరకు ఎలాంటి విఘాతం కలగలేదనీ, రెండు ప్రభుత్వాల నుంచిగానీ, సివిల్ సొసైటీస్ నుంచిగానీ ఎలాంటి ఫిర్యాదులు కూడా రాలేదని నరసింహన్ వివరించినట్టు తెలిసింది. ఇంటెలిజెన్స్ నుంచి కూడా ఎలాంటి నివేదికలు అందలేదన్నారు. విభజన చట్టంలోని సెక్షన్-8కి సంబంధించి ఉత్పన్నమైన సంఘటనలేవైనా ఉన్నాయా? అని ఆరా తీస్తూనే రాష్ట్రంలో సంచలనంగా మారిన ఓటుకు కోట్లు కేసుపైనా చర్చించినట్టు హోం శాఖకు చెందిన ఉన్నతస్థాయి వర్గాలు తెలిపాయి. ఆ వర్గాలు అందించిన సమాచారం మేరకు... ఓటుకు కోట్లు కేసును విభజన చట్టంలోని సెక్షన్-8 కి ముడిపెట్టి మాట్లాడటం సరికాదని, ఆ రెంటికీ పొంతన లేదని ఈ సందర్భంగా రాజ్‌నాథ్ వ్యాఖ్యానించారు. ఈ కేసు వ్యవహారాన్ని మొత్తంగా దర్యాప్తు సంస్థలు, న్యాయస్థానాలు చూసుకుంటాయని చెప్పారు. దీనికి సంబంధించి మీ స్థాయిలోనే నిర్ణయాలు జరగాలని స్పష్టతనిచ్చారు. ఈ కేసు వ్యవహారంలో తెలంగాణ ప్రభుత్వం ఎంతవరకు ముందుకు సాగుతుందనే దానిపైన కూడా చర్చ జరిగింది. హైదరాబాద్‌లో శాంతిభద్రతలకు సంబంధించిన సెక్షన్-8 అంశం ఇప్పుడెందుకు తెరమీదకు వచ్చిందని గవర్నర్‌ను ఆరా తీశారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగిన పక్షంలో విభజన చట్టంలో సెక్షన్-8 ద్వారా తెలంగాణ మంత్రివర్గంతో సంప్రదించి గవర్నర్ తగిన నిర్ణయం తీసుకోవాల్సి ఉందని, ఆ పరిస్థితి ఇప్పటివరకు రాలేదని నరసింహన్ పేర్కొన్నట్లు అత్యున్నతస్థాయి వర్గాలు పేర్కొన్నాయి.
Published Sun, Jun 28 2015 6:18 AM | Last Updated on Fri, Mar 22 2024 11:04 AM
Advertisement
Advertisement
Advertisement