హైదరాబాద్ను తానే నిర్మించానని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అంటున్నారని... అసెంబ్లీ, గోల్కొండ కోట, ఫలక్నుమా ప్యాలెస్ అన్నీ ఆయనే నిర్మించి ఉంటారేమోనని, అందుకే హైదరాబాద్ అంత గొప్పదై ఉంటుందని అనుకుంటున్నామని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్ రెడ్డి ఎద్దేవా చేశారు. ఏపీ అసెంబ్లీలో రాజధాని ప్రకటనపై చర్చ సందర్భంగా ఆయన అధికారపక్షాన్ని, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును దుమ్ము దులిపేశారు. ఆయన ఏమన్నారంటే... ''చర్చ తర్వాత ప్రకటన వస్తే బాగుంటుందని ఎంత మొరపెట్టుకున్నా.. వినకుండా ముందే ప్రకటన చేసేశారు. నాయకులకు పాజిటివ్ యాటిట్యూడ్ ఉండాలి. అది ఉండబట్టే ఏకపక్ష నిర్ణయం తీసుకున్నా, ప్రతిపక్ష నాయకుడు దాన్ని స్వాగతించారు. అందుకే మిగులు బడ్జెట్ వచ్చిందని భావిస్తున్నాం. కాగితం మీద చూస్తే అన్నీ బాగానే ఉంటాయి. కానీ గతంలో ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు హంద్రీ నీవా, దేవాదుల, తోటపల్లి.. ఇలా అన్ని ప్రాజెక్టులకు ప్రతిసారీ ఎన్నికలకు ముందు శంకుస్థాపనలు చేసేస్తారు తప్ప నిధుల కేటాయింపు, పూర్తి మాత్రం ఉండవు. నరమానవుడు కూడా లేనిచోట్ల ప్రాజెక్టులకు శంకుస్థాపన చేయడానికి తాపీ మేస్త్రిని, ఫొటోగ్రాఫర్ను కూడా హెలికాప్టర్లలో తీసుకెళ్లారట. ఇవన్నీ చదివారు గానీ, అవి పూర్తవుతాయా లేవా అన్నది చూడాలి. చేస్తే చాలా సంతోషిస్తాం. కానీ గత చరిత్ర చూసినప్పుడు బాధ వేస్తోంది. ఆయన శంకుస్థాపన చేసిన ఏ ప్రాజెక్టూ పూర్తి చేయలేదు. ప్రాజెక్టులు పూర్తయ్యాయంటే వాటికి దివంగత నాయకుడు వైఎస్ రాజశేఖరరెడ్డి పూర్తి చేయించారు. హైదరాబాద్ను తానే నిర్మించానని చెబుతున్నా.. ఔటర్ రింగ్ రోడ్డు పూర్తి చేయించింది వైఎస్సే. హెచ్1బి వీసాలు వస్తున్నాయంటే.. అందుకు కారణం తానేనని చెబుతారు. నేనూ ఏడు సంవత్సరాలు ఉద్యోగం చేశాను. అవెలా వస్తాయో మాకూ తెలుసు. ఆయన గత చరిత్ర చూస్తే భవిష్యత్తులో ఇవన్నీ జరుగుతాయన్న నమ్మకం ఎవరికీ కలగట్లేదు. గతంలో రాష్ట్రం తమిళనాడు నుంచి విడివడినప్పుడు 1956లో చర్చ ఎలా జరిగిందో, ఓటింగ్ ఎలా జరిగిందో ఆనాటి పేపర్లు చూస్తే తెలుస్తుంది. రాజధాని విషయంలో మేం ఎలాంటి డిమాండ్లూ చేయలేదు. శివరామకృష్ణన్ కమిటీ దొనకొండ, వినుకొండ, మార్టూరు విషయంలో వివరాలు అడిగినప్పుడు వాటికి సమాధానాలు కూడా పంపలేదు. ఏకపక్ష నిర్ణయాలు తగవు. సభ జరుగుతున్నప్పుడు సభ అభిప్రాయం కూడా తీసుకోవాలి. ప్రతిపక్ష నాయకుడు రెండు నిమిషాల కోసం బయటకు వెళ్తేనే కామెంట్లు చేస్తారు గానీ.. రాష్ట్ర విభజన గురించి చర్చించేటప్పుడు ఆయన సభలో లేని విషయం గుర్తులేదా? ''
Published Thu, Sep 4 2014 3:16 PM | Last Updated on Fri, Mar 22 2024 11:29 AM
Advertisement
Advertisement
Advertisement