ఒకప్పుడు జయలలిత నెచ్చెలిగా తెరవెనుక ఉన్న వీకే శశికళ.. ఇప్పుడు జయలలిత మరణంతో తెరముందుకొచ్చి ఎత్తుకు పైఎత్తు వేస్తున్న సంగతి తెలిసిందే. రాజకీయాల్లో ఆరితేరిన నేతగా ఆమె రాజకీయ వ్యూహాలు పదునెక్కుతున్నాయి. కానీ, అమ్మ మరణం తర్వాత అన్నాడీఎంకేలో శశికళ అనూహ్యంగా ఎదుగుతుండటంపై మొదట్లోనే వ్యతిరేకత వచ్చింది. శశికళ కుటుంబసభ్యలు అన్నాడీఎంకే తమ పిడికిట్లో తీసుకోవాలని ప్రయత్నిస్తుండటంపై కృష్ణగిరికి జిల్లాకు చెందిన వన్నియార్ నేత కేపీ మునుస్వామి మొట్టమొదట తిరుగుబావుటా ఎగురవేశారు. శశికళ కుటుంబం తీరుపై కేపీ మునుస్వామి బాహాటంగా విమర్శలు చేశారు. అమ్మ మరణం తర్వాత అన్నాడీఎంకేలో శశికళకు ఎదురైన మొట్టమొదటి తిరుగుబాటు ఇదే. కానీ, ఆమె ఆయన విషయాన్ని ఆమె పెద్దగా పట్టించుకోలేదు. మునుస్వామిపై చర్యలు కూడా తీసుకోలేదు.