మంగళవారం అర్థరాత్రిలోగా విధుల్లో చేరని ఆర్టీసీ కార్మికులను తర్వాత ఎట్టి పరిస్థితుల్లో ఉద్యోగంలో చేర్చుకోవద్దని రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. ఆర్టీసీ సమ్మె, సమ్మె విషయంలో హైకోర్టు విచారణ నేపథ్యంలో అనుసరించాల్సిన వైఖరిపై ముఖ్యమంత్రి కేసీఆర్ సోమవారం ప్రగతి భవన్‌లో సమీక్ష నిర్వహించారు. సీఎం పలు అంశాలమీద చర్చించారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ మాట్లాడుతూ.. గడువులోగా కార్మికులు చేరకుంటే, మిగిలిన ఐదు వేల రూట్లలో ప్రైవేటు వాహనాలకు పర్మిట్లు ఇవ్వాలని, అప్పుడు తెలంగాణలో ఇక ఆర్టీసీ ఉండదని స్పష్టం చేశారు. విధుల్లో చేరడానికి గడువు ఇవ్వడం ద్వారా మంచి అవకాశం ఇచ్చినట్లయిందన్నారు. దాన్ని కార్మికులు ఉపయోగించుకుని ఉద్యోగాలు కాపాడుకోవడమా? వినియోగించుకోకుండా ఉద్యోగాలు కోల్పోయి, కుటుంబాన్ని కూడా ఇబ్బందుల పాలు చేయడమా ? అనేది కార్మికులే తేల్చుకోవాలన్నారు. న్యాయ నిపుణుల సలహాలు తీసుకున్న ప్రభుత్వం కార్మిక చట్టాలను, కేంద్ర రవాణా చట్టాన్ని పరిశీలించిందని పేర్కొన్నారు.