ఉష్ణోగ్రతలు పెరుగుతున్నా తగ్గని చలి
● కొనసాగుతున్న శీతల గాలులు ● జి.మాడుగులలో 9.8 డిగ్రీల నమోదు ● పెదబయలు, అరకులో మంచు వాన
చింతపల్లి: మన్యంలో ఉష్ణోగ్రతలు పెరుగుతున్నా మంచు, చలి తీవ్రత తగ్గుముఖం పట్టడం లేదు. సోమవారం జి.మాడుగులలో 9.8 డిగ్రీలు కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదు అయినట్లు చింతపల్లి ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం ఏడీఆర్, వాతావరణ విభాగం నోడల్ అధికారి డాక్టర్ ఆళ్ల అప్పలస్వామి తెలిపారు. పాడేరు డివిజన్ పరిధిలోని గూడెంకొత్తవీధిలో 11.0, ముంచంగిపుట్టులో 11.5, డుంబ్రిగుడలో 12.0, పెదబయలులో 12.5, పాడేరులో 12.8, అనంతగిరిలో 12.6, అరకువ్యాలీలో 12.6, చింతపల్లిలో 13.0, హుకుంపేటలో 13.4, కొయ్యూరులో 15.0 డిగ్రీలు నమోదు అయినట్టు ఆయన పేర్కొన్నారు. సాయంత్రం వేళలో వీస్తున్న శీతల గాలులకు మన్యం వాసులు వణికి పోతున్నారు.
పెదబయలు: మండల కేంద్రం పెదబయలులో సో మవారం ఉదయం దట్టంగా పొగమంచు కమ్మేసింది. తెల్లవారుజాము నుంచి ఉదయం 9.30 గంటల వరకు మంచు వానను తలపించింది. పెదబయలు లో జరిగిన వారపు సంతకు వచ్చేవారు ఇబ్బందులు పడ్డారు. మంచు ముసుగులోనే కొనుగోళ్లు జరిగాయి.
అరకులోయ టౌన్: ప్రముఖ పర్యాటక కేంద్రం అరకులోయలో అర్ధరాత్రి నుంచి కురుస్తున్న మంచు వానను తలపించింది. మంచుతెరలు కమ్మేయడంతో స్థానికులు, పర్యాటకులు, వాహనచోదకులు ఇబ్బందులు పడ్డారు. ఉదయం పది గంటల వరకు సూర్యోదయం కాలేదు.
Comments
Please login to add a commentAdd a comment