నాణ్యమైన విద్యనందించాలి
అరకు ఎమ్మెల్యే రేగం మత్స్యలింగం
పెదబయలు: గిరిజన విద్యార్థులకు నాణ్యమైన విద్యనందించడమే లక్ష్యంగా ఉపాధ్యాయులు పనిచేయాలని అరకు ఎమ్మెల్యే రేగం మత్స్యలింగం అన్నారు. పెదబయలు మండలం సీతగుంట గిరిజన సంక్షేమ ఆశ్రమ బాలికల పాఠశాల–2 ను సోమవారం ఆకస్మికంగా సందర్శించి, పాఠశాలలో రికార్డులను పరిశీలించారు. తరగతి గదుల్లోకి వెళ్లి పాఠ్యాంశాలపై పలు ప్రశ్నలు వేసి విద్యార్థుల సామర్థ్యాలను పరిశీలించారు. అనంతరం విద్యార్థులతో మాట్లాడి సమస్యలు తెలుసుకున్నారు. భవిష్యత్తులో ఉన్నత శిఖరాలను అధిరోహించాలనే లక్ష్యంతో చదవాలని సూచించారు. హాస్టల్‌ను పరిశీలించి నాణ్యమైన ఆహారం అందించాలని వార్డెన్‌కు సూచించారు. ఉపాధ్యాయులు విధుల పట్ల నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ మాజీ మండల అధ్యక్షుడు సందడి కొండబాబు,హెచ్ఎం చిట్టమ్మ, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
విద్యార్థుల పట్ల ప్రత్యేక శ్రద్ధ
ముంచంగిపుట్టు: విద్యార్థుల పట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని, నాణ్యమైన ఆహారం,విద్య అందించాలని, అనారోగ్యంగా ఉన్నవారికి వెంటనే చికిత్స అందించాలని అరకు ఎమ్మెల్యే రేగం మత్స్యలింగం తెలిపారు.మండలంలోని బంగారుమెట్ట ప్రభుత్వ గిరిజన సంక్షేమ ఆశ్రమ బాలికల పాఠశాలను సోమవారం ఎమ్మెల్యే ఆకస్మికంగా తనిఖీ చేశారు.విద్యార్థుల కోసం వండిన ఆహారపదార్థాలను పరిశీలించి, పాఠశాల రికార్డులను తనిఖీ చేశారు.అనంతరం తరగతి గదులకు వెళ్లి విద్యార్థులతో మాట్లాడి వారి సమస్యలు తెలుసుకున్నారు. విద్యార్థుల చేత చదివించారు.అనంతరం హెచ్ఎం రాజేశ్వరి,ఉపాధ్యాయులతో మాట్లాడి పలు సూచనలు చేశారు.
మండల కేంద్రంలో ఉన్న సీహెచ్‌సీని తనిఖీ చేసి, రోగులకు అందుతున్న వైద్య సేవలపై ఆరా తీశారు. సుజనకోటలో ఏళ్ల తరబడి పనిచేయని వాటర్ గ్రిడ్ పథకానికి పరిశీలించారు.సుజనకోట సర్పంచ్‌తో కలిసి మత్స్యగెడ్డ పర్యాటక ప్రదేశాలను సందర్శించారు.పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తానని ఎమ్మెల్యే తెలిపారు.ఈ కార్యక్రమంలో వైఎస్సార్సీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి జగబంధు,వైఎస్సార్సీపీ మండల అధ్యక్షులు పద్మారావు,పెదబయలు మండల మాజీ వైఎస్సార్సీపీ అధ్యక్షులు కొండబాబులు తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment