ప్రజా సమస్యలపై 105 అర్జీల స్వీకరణ
రంపచోడవరం: ఏజెన్సీలోని మారుమూల గ్రామాల్లో సమస్యలకు సంబంధించి అందిన వినతుల్లో కొన్నింటిని తక్షణమే పరిష్కరించామని రంపచోడవరం ఐటీడీఏ పీవో కట్టా సింహాచలం తెలిపారు. స్థానిక ఐటీడీఏ సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కారవేదిక కార్యక్రమంలో ఆయనతోపాటు సబ్ కలెక్టర్ కేఆర్ కల్పశ్రీ 105 అర్జీలు స్వీకరించారు. వై రామవరం మండలం కోట గ్రామం నుంచి వెదుళ్లపల్లి, సిరిమెట్ల నుంచి తాడికోట గ్రామాల మధ్య కన్నేరు వాగుపై సిమెంటు తూరు ఏర్పాటుచేస్తుంటే అటవీశాఖ అధికారులు అడ్డుకుంటున్నారని గిరిజనులు ఫిర్యాదు చేశారు. కాలువపై తూరలు వేసుకునేందుకు అనుమతి ఇప్పించాలని పీసా కమిటీ ఉపాధ్యక్షుడు పల్లాల స్వామిరెడ్డి , కార్యదర్శి పల్లాల సంధ్య కోరారు. కొండపల్లి గ్రామంలో నేషనల్ హైవే రోడ్డుకు సంబంధించిన మట్టిని పంట కాలువల్లో వేస్తున్నారని, దీనివల్ల సాగునీటికి ఇబ్బంది అవుతోందని గిరిజన రైతులు కోరారు. సిరిగిందలపాడు గ్రామం వెనుక భాగంలో ఉన్న ఇళ్లకు విద్యుత్ సౌకర్యం కల్పించాలని గూడెం బుజ్జిబాబు, సిప్పల శ్రీనివాసరావు కోరారు. చింతలపూడి– కోట రోడ్డులో నిలిచిన వంతెన పనులు ప్రారంభించాలని సర్పంచ్ పల్లాల సన్యాసమ్మ, గిరిజనులు కోరారు.ఈ కార్యక్రమంలో ఏపీవో జనరల్ డీఎన్‌వీ రమణ, ఏడీఎంహెచ్‌వో జి శిరీష, ఏజెన్సీ డీఈవో వై.మల్లేశ్వరరావు, ఈఈ శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment