బెల్ట్ జోరు..!
● జిల్లాలో అనధికారికంగా సుమారు 200 బెల్టు షాపులు ● హోంమంత్రి నియోజకవర్గంలోనే 40కు పైగా నిర్వహణ ● బెల్టు షాపులకు తరలిస్తున్న 40 కేసులను పట్టుకున్న స్థానికులు ● బాటిల్‌పై రూ.20 అదనంగా అమ్మకాలు ● గ్రామాల్లో వేలం పాట ద్వారా రూ.3 నుంచి రూ.4 లక్షల వరకు చెల్లించి ఏర్పాటు ● వీటిలో 30 శాతం సిండికేట్లకు, 20 శాతం ఎకై ్సజ్ అధికారులకు కమీషన్లు ● మిగతా 50 శాతం గ్రామాలకు ఇస్తున్న వైనం
ఊరూరా...
సాక్షి, అనకాపల్లి: కూటమి ప్రభుత్వం కొత్త మద్యం పాలసీతో జిల్లాలో మద్యం ఏరులైపారుతోంది. గత అయిదేళ్లుగా మూతపడిన బెల్టు షాపులు మళ్లీ పల్లెల్లో విచ్చలవిడిగా తెరుచుకున్నాయి. స్థానిక కూటమి ప్రజాప్రతినిధుల అండతో సిండికేట్ వ్యాపారుల కనుసన్నల్లో బెల్టు షాపులు ఎక్కడికక్కడ పుట్టగొడుగుల్లా వెలుస్తున్నాయి. లాటరీ ద్వారా మద్యం షాపులు దక్కించుకున్న సిండికేట్లు, ఎకై ్సజ్ అధికారులు సంయుక్తంగా గుట్టుచప్పుడు కాకుండా అనధికారికంగా బెల్టుషాపులకు ఆజ్యం పోస్తున్నారు. హోంమంత్రి వంగలపూడి అనిత సొంత నియోజకవర్గంలో రూ.3 లక్షల నుంచి రూ.11 లక్షల వరకూ వేలం పాట ద్వారా బెల్టు షాపులు బహిరంగంగా ఏర్పాటు చేస్తున్నారు. మంత్రి అనుచరులే ఇందులో కీలక పాత్ర పోషిస్తున్నారు.
ఇందులో సగం వాటా స్థానిక కూటమి ప్రజాప్రతినిధులకు, మిగిలిన వాటిలో మద్యం దుకాణదారులకు 30 శాతం, ఎకై ్సజ్ శాఖ అధికారులకు 20 శాతం కమీషన్ ఇస్తున్నట్టు సమాచారం. జిల్లాలో పాయకరావుపేట, కోటవురట్ల, ఎస్.రాయవరం, నర్సీపట్నం, చోడవరం, యలమంచిలి, సబ్బవరం వంటి ప్రాంతాల్లో పుట్టగొడుగుల్లా అనధికారికంగా బెల్టు షాపులు ఏర్పాటు చేశారు. వీటిలో కొన్ని వేలం పాట ద్వారా డబ్బులు చెల్లించి అమ్మకాలు చేస్తుంటే..మరికొన్ని మద్యం సిండికేట్లే తమ అనుచరులు, బంధువుల ద్వారా అమ్మకాలు చేస్తున్నారు. ఒక్కో మద్యం బాటిల్‌పై రూ.20 నుంచి రూ.30 వరకూ అదనంగా అమ్ముతున్నారు.
ఏరులై పారుతున్న మద్యం..
రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు ఇటీవల పరవాడ పర్యటనలో బెల్టు షాపులు పెట్టినవారి బెల్టు తీస్తానని బహిరంగంగా చెప్పినా..బెల్టు షాపులు వెలుస్తున్నాయంటే కూటమి ప్రభుత్వం వాగ్దానాలు అంతంత మాత్రమే అని జనం చర్చించుకుంటున్నారు. 2014 నుంచి 2019 మధ్య జిల్లాలో మద్యం విక్రయాలు ఇష్టానుసారంగా జరిగేవి. ఒక్కో వైన్‌షాప్ ఆధీనంలో 4 నుంచి 8 వరకు బెల్టుషాపులు నిర్వహించేవారు.
అనధికార వేలం.. లాభసాటి బేరం
●జిల్లాలో 136 మద్యం దుకాణాలు ఉన్నాయి. వీటిలో గతంలో కంటే అధిక ధరలకు మద్యాన్ని విక్రయిస్తున్నారు. బెల్టు షాపుల్లో ఒక్కో బాటిల్‌పై రూ.20 నుంచి రూ.30 అదనంగా అమ్ముతున్నారు.
●చోడవరం ఎకై ్సజ్ పోలీస్‌స్టేషన్ పరిధిలో మొత్తం 40 బెల్టు షాపులు ఉన్నట్టు సమాచారం. వీటిలో వేలం పాట ద్వారా ఏర్పాటు చేసినవి 10 నుంచి 15 ఉంటే..మిగిలినవి మద్యం దుకాణదారులు ఏర్పాటు చేసినట్టు సమాచారం.
●నర్సీపట్నం ఎకై ్సజ్ పోలీస్‌స్టేషన్ పరిధిలో 30 వరకూ బెల్టు షాపులు వెలిసినట్టు సమాచారం. వీటిలో వేలం పాట ద్వారా 10 వరకూ ఉంటాయి.
●పాయకరావుపేట ఎకై ్సజ్ పోలీస్‌స్టేషన్ పరిధిలో 30 నుంచి 35 వరకూ బెల్టు షాపులు వెలిచినట్లు సమాచారం. వీటిలో వేలం పాట ద్వారా 10 వరకూ ఉంటాయి.
●యలమంచిలి ఎకై ్సజ్ పోలీస్‌స్టేషన్ పరిధిలో 20 వరకూ బెల్టు షాపులు ఉన్నట్టు సమాచారం.
●అనకాపల్లి ఎకై ్సజ్ పోలీస్‌స్టేషన్ పరిధిలో బెల్టు షాపులు లేవు. వేలం పాట ద్వారా అనధికారికంగా 20 వరకూ గ్రామాల్లో అధిక ధరలకు అమ్ముతున్నారు.
‘ఎస్.రాయవరం మండలంలో గుడివాడ గ్రామంలో ఉన్న మద్యం షాపు నుంచి బంగారమ్మపాలెం బెల్టు షాప్‌నకు భారీగా మద్యం ఆటోలో తరలిస్తుండగా స్థానికులు అడ్డుకుని పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఎస్.రాయవరం ఎస్‌ఐ విభీషణరావు కేసు నమోదు చేశారు. స్థానిక టీడీపీ నాయకులు, హోంమంత్రి పీఏగా పనిచేసి సస్పెన్షన్ గురైన వ్యక్తి వాటాదారులుగా ఉన్న మద్యం షాపు నుంచి బెల్టు షాపులకు మద్యం తరలిస్తుండగా స్థానికులు అడ్డుకుని పోలీసులకు అప్పగించారు. ఇందులో రూ.3 లక్షల విలువైన 47 కేసుల మద్యం పైగా ఉన్నట్టు సమాచారం. అయితే 30 కేసులకు పైగా ఉంటే వెంటనే లైసెన్స్ రద్దు చేయాలనేది ఎకై ్సజ్ పాలసీ విధానం. ఎస్.రాయవరం మండలం బంగారమ్మపాలెంలో గల గ్రామ జాతర ఉండడంతో అధిక మొత్తంలో బెల్టు షాపులకు మద్యం తరలించినట్టు సమాచారం.’
బెల్టు షాపుల ఏర్పాటు చేస్తే వారిపై కఠిన చర్యలే..
జిల్లా వ్యాప్తంగా బెల్ట్ షాపులు ఏర్పాటు చేయడానికి ప్రభుత్వం అనుమతి ఇవ్వలేదు. కాదని ఎవరైనా ఏర్పాటు చేస్తున్నట్లు మా దృష్టికి వస్తే వారిపై కఠిన చర్యలు ఉంటాయి. ఇప్పటివరకూ మా దృష్టికి బెల్టుషాపులు ఏర్పాటు చేసినట్టు రాలేదు. అంతేకాకుండా ప్రభుత్వం నిర్ధేశించిన ధరలకే మద్యం దుకాణదారులు అమ్మాలి. కాదని అధిక ధరలకు విక్రయిస్తే వారిపై కఠిన చర్యలుంటాయి.
– సుధీర్, జిల్లా ఎకై ్సజ్ అండ్ ప్రొహిబిషన్ అధికారి
Comments
Please login to add a commentAdd a comment