సూపర్సిక్స్ హామీలు అమలుచేయకుండాకూటమి ప్రభుత్వం మోసం
పాడేరు : రాష్ట్ర ప్రజలకు ఎన్నికల సమయంలో అరచేతిలో వైకుంఠం చూపించి సూపర్ సిక్స్ హామీలతో గద్దెనెక్కిన కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు చేయకుండా ప్రజలకు పంగనామాలు పెట్టిందని పాడేరు ఎమ్మెల్యే, వైఎస్సార్సీపీ జిల్లా అద్యక్షుడు మత్య్సరాస విశ్వేశ్వరరాజు స్పష్టం చేశారు. తన కార్యాలయంలో బుధవారం విలేకరులతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అమలు కానీ హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చి హామీలు అమలు చేయకుండా ముఖ్యమంత్రి చంద్రబాబు ఇప్పుడు ఫిలాసఫీ మాట్లాడటం ఏమిటని ప్రశ్నించారు. అధికారంలోకి వచ్చి సుమారు తొమ్మిది నెలలు కావస్తున్నా ఏ ఒక్క సంక్షేమ పథకం అమలు చేయకుండానే సుమారు రూ.1.19లక్షల కోట్లు అప్పులు చేసి నిలువునా దోచుకుంటున్నారని ఆరోపించారు. రాష్ట్ర ప్రజలకు సంపద సృష్టిస్తామని చెప్పి అధికారంలోకి వచ్చాక ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి సహా మంత్రులు, కూటమీ పార్టీల ఎమ్మెల్యే, నాయకులు సంపద సృష్టించుకుంటున్నారని విమర్శించారు. గతంలో కుల, మత, ప్రాంత, పార్టీ, వర్గ బేధాలు లేకుండా ఇచ్చిన హామీలతో పాటు ఇవ్వని హామీలను కూడా నూరుశాతం అమలు చేసి చూపించిన ఘనత మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్సీపీ అధినేత వై.ఎస్.జగన్మోహన్రెడ్డికి దక్కుతుందన్నారు. మరలా ఆ స్వర్ణయుగాన్ని రాష్ట్ర ప్రజలు ముక్తకంఠంతో కోరుకుంటున్నారన్నారు. కూట మీ ప్రభుత్వ పాలనపై రాష్ట్ర ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోందని స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేసేంత వరకు వైఎస్సార్సీపీ ప్రజల పక్షాన పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడుతుందన్నారు. సర్పంచ్ గబ్బాడ చిట్టిబాబు, వైఎస్సార్సీపీ క్రిస్టియన్ మైనార్టీ సెల్ జిల్లా అధ్యక్షుడు తిమోతి, పార్టీ మహిళ విభాగ నియోజకవర్గ అధ్యక్షురాలు ఊర్వశి రాణి, మాజీ సర్పంచ్ శరభ సూర్యనారాయణ, నాయకులు రాజేష్, మహేష్, సుబ్రహ్మణ్యం తదితరులు పాల్గొన్నారు.
పాడేరు ఎమ్మెల్యే, వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు మత్య్సరాస విశ్వేశ్వరరాజు
Comments
Please login to add a commentAdd a comment