16 నుంచి పరిమితిలేని వైద్యం
♦ ఉద్యోగుల హెల్త్ కార్డుల పథకం పూర్తి స్థాయి అమలు
♦ పథకం ఖర్చులో సగమే భరించనున్న ప్రభుత్వం
♦ మిగతా సగం ఉద్యోగుల ప్రీమియం ద్వారా వసూలు
♦ ప్రీమియం దాదాపు మూడు రెట్లు పెరిగే అవకాశం
♦ పథకం పూర్తి స్థాయిలో అమలుకు రూ.400 కోట్లు అంచనా
సాక్షి, హైదరాబాద్: ఎట్టకేలకు హెల్త్ కార్డుల పథకం అమలు కోసం ఉద్యోగులు ఎదురుచూపు దాదాపు ముగింపు దశకు వచ్చింది. ఈ నెల 16వ తేదీ నుంచి హెల్త్ కార్డులపై ఉద్యోగులకు పరిమితి లేని వైద్యం అందించాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు. విజయవాడలోని సీఎం క్యాంపు కార్యాలయంలో బుధవారం రెండు గంటలకు పైగా సాగిన సమావేశంలో కార్పొరేట్ ఆసుపత్రుల ప్రతినిధులతోపాటు వైద్య,ఆరోగ్యశాఖ, ఎన్టీఆర్ ఆరోగ్య సేవా అధికారులు హాజరయ్యారు. ఉద్యోగ సంఘాల జేఏసీ నేతలు అశోక్‌బాబు, ఐ.వెంకటేశ్వరరావు, కత్తి నరసింహారెడ్డి, చంద్రశేఖరరెడ్డి, కమలాకరరావు, బొప్పరాజు వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు. సమావేశంలోని ముఖ్య అంశాలు..
► ప్యాకేజీ ధరలు ఖరారైన తర్వాత పూర్తి స్థాయిలో వైద్యం అందిస్తామని,ఈ ప్రక్రియ పూర్తి చేయడానికి రెండు నెలల సమయం కావాలని కార్పొరేట్ ఆసుపత్రుల యాజమాన్యాల ప్రతినిధులు అడిగారు.
► ప్యాకేజీ ధరల ఖరారుకు ఎంత సమయం తీసుకున్నా పాత తేదీ నుంచే అమలు చేయడానికి వీలుంటుంది కాబట్టి తక్షణం హెల్త్ కార్డుల పథకాన్ని పూర్తి స్ధాయిలో అమలులోకి తెచ్చి తర్వాత ప్యాకేజీ ధరల విషయంలో నిర్ణయం తీసుకోవచ్చని ఉద్యోగుల సంఘాలు డిమాండ్ చేశాయి.
► దీనికి సీఎం సానుకూలంగా స్పందించి తక్షణం హెల్త్ కార్డుల పథకాన్ని పూర్తిస్థాయిలో అమలు చేయాలని ఆస్పత్రుల ప్రతినిధులను ఆదేశించారు.
► ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో హెల్త్ కార్డుల పథకం అమలుకు రూ.200 కోట్లు అవసరమని అంచనా వేశారు. ఇందులో 40శాతం(రూ.80 కోట్లు) ఉద్యోగుల వాటా కాగా మిగతా రూ.120 కోట్లను ప్రభుత్వమే భరించాలి. అయితే ఉద్యోగులకు పూర్తి స్థాయిలో వైద్య సేవలు అందించడానికి ఏటా రూ.400 కోట్లు అవసరమని తాజాగా అంచనా వేశారు. ఇందులో సగం భరించడానికి ఉద్యోగులు సంసిద్ధత వ్యక్తం చేశారు. ప్రస్తుతం చెల్లిస్తున్న రూ.90, 120 ప్రీమియం దాదాపు మూడు రెట్లు పెరగనుంది.
పీఆర్సీ నుంచే గ్రాట్యుటీ పెంపు వర్తింపు
గ్రాట్యుటీ గరిష్ట పరిమితిని రూ.12 లక్షలకు పెంచుతూ ఇచ్చిన ఉత్తర్వులను ఈ ఏడాది జనవరి నుంచి 2014 జూన్2 నుంచి అమలు చేయాలని జేఏసీ చేసిన విజ్ఞప్తికి సీఎం చంద్రబాబు సానుకూలంగా స్పందించారు. ఈ మేరకు ఉత్తర్వుల్లో సవరణ చేయాలని అధికారులకు సీఎం సూచించారు.