
మాటకు కట్టుబడతావా... బాబూ..!
ప్రజాప్రతినిధుల సంఖ్యను బట్టి దామాషా పద్ధతిలో ఎమ్మెల్సీ స్థానాల్ని కేటాయిస్తే రాజకీయ బేరసారాలు ఆగిపోతాయంటూ చేసిన వ్యాఖ్యలకు...
* బలమున్న చోటే ఎమ్మెల్సీ స్థానాల్లో పోటీకి సిద్ధమా?: జ్యోతుల
* అటెండర్‌తో జగన్‌కు ఆహ్వానమా
సాక్షి, హైదరాబాద్: ప్రజాప్రతినిధుల సంఖ్యను బట్టి దామాషా పద్ధతిలో ఎమ్మెల్సీ స్థానాల్ని కేటాయిస్తే రాజకీయ బేరసారాలు ఆగిపోతాయంటూ చేసిన వ్యాఖ్యలకు సీఎం చంద్రబాబు కట్టుబడాలని వైఎస్సార్ కాంగ్రెస్ శాసనసభాపక్షం ఉప నేత జ్యోతుల నెహ్రూ డిమాండ్ చేశారు.
పార్టీ కేంద్ర కార్యాలయంలో శనివారం విలేకరులతో మాట్లాడారు. ఆయా పార్టీలకు శాసనసభలో ఉన్న ఎమ్మెల్యేల సంఖ్యను బట్టి ఎమ్మెల్సీ పదవులను కేటాయించాలని చంద్రబాబు అన్నారని, ఇందుకు అనుగుణంగానే స్థానిక సంస్థల నుంచి శాసనమండలికి జరగనున్న ఎన్నికల్లో బలమున్న చోటే పోటీ చేద్దామన్నారు. స్థానిక సంస్థల్లో టీడీపీకి బలం లేని జిల్లాల్లో కూడా అభ్యర్థులను ప్రకటించారంటే ప్రజాప్రతినిధుల కొనుగోలుకు బాబు...ఎందరు రేవంత్‌రెడ్డిలను పురమాయిస్తారోనని అనుమానం వ్యక్తం చేశారు.
ప్రస్తుత స్థానిక సంస్థల శాసనమండలి ఎన్నికల్లో కృష్ణా, విశాఖ జిల్లాల్లో రెండు పదవులున్నా విడివిడిగా నోటిఫికేషన్ జారీ చేయడాన్ని తప్పు పడుతూ దీనిపై న్యాయస్థానాలను ఆశ్రయించామన్నారు. చంద్రబాబు తనకు కేంద్రంలో ఉన్న పలుకుబడితో ఒక గ్రూపుగా ఎమ్మెల్సీ పదవులకు ఎన్నికల నోటిఫికేషన్ జారీ చేయడానికి బదులుగా విడివిడిగా చేయించారని విమర్శించారు.
కుటుంబ వ్యవహారంలా భూమిపూజ
నవ్యాంధ్ర రాజధాని భూమిపూజ కార్యక్రమం చంద్రబాబు కుటుంబ కార్యక్రమం మాదిరిగా సాగిందంటూ నెహ్రూ ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనిని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. వైఎస్సార్‌సీపీ ఉపనేతనైన తనకు ఆహ్వానమే రాలేదన్నారు. ప్రతిపక్ష నేత జగన్‌మోహన్‌రెడ్డికి శుక్రవారం సాయంత్రం ఓ అటెండర్ వచ్చి ఆహ్వానం కార్డును అందజేయడం శోచనీయమన్నారు.
కనీసం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శితో గాని, లేదా సంబంధిత ప్రిన్సిపల్ కార్యదర్శితోనైనా ఫోన్ చేయించి ఉండాల్సిందన్నారు. రెండు రోజుల ముందే కార్డు పంపితే జగన్ వస్తాడేమోననుకున్నారని, ఆయన్ను రాకుండా చేయడానికే చివరి నిమిషంలో పంపినట్లుందన్నారు. ప్రభుత్వ వైఖరిపై తాను వ్యక్తిగతంగా శాసనసభాహక్కుల నోటీసు ఇస్తామన్నారు.