యువతి ర్యాష్ డ్రైవింగ్, ఇంజినీరింగ్ విద్యార్థులు మృతి | 3 engineering students killed as woman ploughs her car into their bikes | Sakshi
Sakshi News home page

యువతి ర్యాష్ డ్రైవింగ్, ఇంజినీరింగ్ విద్యార్థులు మృతి

Published Tue, Aug 5 2014 10:15 AM | Last Updated on Sat, Oct 20 2018 6:19 PM

యువతి ర్యాష్ డ్రైవింగ్, ఇంజినీరింగ్ విద్యార్థులు మృతి - Sakshi

యువతి ర్యాష్ డ్రైవింగ్, ఇంజినీరింగ్ విద్యార్థులు మృతి

నెల్లూరు :  నిర్లక్ష్య డ్రైవింగ్  తో ముగ్గురి ప్రాణాలను బలి తీసుకున్న షారోన్ ప్రియాంక అనే యువతిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ప్రమాద సమయంలో ప్రియాంక మద్యం సేవించి కారు నడిపిందా అనే అనుమానంతో పరీక్షల న నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. కాగా  తన డ్రైవింగ్ ప్రతిభను స్నేహితులకు చూపాలనే అత్యుత్సాహంతో ఆమె ఆదివారం సాయంత్రం జాతీయ రహదారిపై నారాయణ ఇంజనీరింగ్ కళాశాల వద్ద కారును వేగంగా నడిపి మూడు బైక్‌లను ఢీకొన్న సంగతి తెలిసిందే. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. ఆదివారం రాత్రే పోలిరెడ్డి వెంకటేష్(21) మృతిచెందగా సోమవారం తెల్లవారుజామున కార్తీక్‌రెడ్డి(17), విజయకుమార్(22) కన్నుమూశారు. కాగా ప్రమాదవశాత్తు ఈ ఘటన జరిగిందని ప్రియాంక బంధువులు చెప్పటం గమనార్హం.

ఇక నెల్లూరు రూరల్ పోలీసుల కథనం మేరకు..తోటపల్లి గూడూరుకు చెందిన పోలిరెడ్డి వెంకట సుబ్బారెడ్డి కుమారుడు వెంకటేష్ సమీపంలోని జెన్ కో కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. అనంతసాగరం మండలం ఇనగలూరుకు చెందిన పోలిరెడ్డి కార్తీక్‌రెడ్డి పెదనాన్న వెంకట సుబ్బారెడ్డి ఇంట్లోనే ఉంటూ నెల్లూరులోని శ్రీచైతన్యకళాశాలలో ఇంటర్ ద్వితీయ సంవత్సరం చదువుతున్నాడు. వైఎస్సార్ జిల్లా సిద్ధవటం మండలం టెక్కోలుకు చెందిన గంగనపల్లి వెంకటరమణయ్య కుమారుడు విజయకుమార్(22) నారాయణ ఇంజనీరింగ్ కళాశాలలో ఇంజనీరింగ్ ద్వితీయ సంవత్సరం చదువుతున్నాడు.

విజయకుమార్ హరనాథపురంలోనే స్నేహితులతో కలిసి అద్దె గదిలో ఉంటున్నాడు. విజయకుమార్ తన స్నేహితులతో కలిసి కొత్తకోడూరు బీచ్ కు రెండు బైక్‌ల్లో బయలుదేరారు. అదే సమయంలో వరుసకు సోదరులైన వెంకటేష్, కార్తీక్ జాతీయ రహదారిపై బైక్‌పై వస్తున్నారు. విజయకుమార్ స్నేహితులకు వెంకటేష్, కార్తీక్‌కు ఎలాంటి పరిచయం లేదు. నారాయణ ఇంజనీరింగ్ కళాశాల సమీపంలోని క్రాస్‌రోడ్డు వద్ద యాదృచ్ఛికంగా వీరు బైక్‌లపై పక్కపక్కనే వెళుతున్నారు. ఈ సమయంలో నగరానికి చెందిన షారోన్ ప్రియాంక కారును వేగంగా నడుపుతూ డివైడర్‌ను దాటుకొచ్చి వీరి బైక్‌లను ఢీకొంది.

ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన ఈ ముగ్గురూ మృతి చెందగా విజయకుమార్ స్నేహితులు సింహపురి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. వీరికి ప్రాణాపాయం లేదని వైద్యులు తెలిపారు. ప్రియాంకతో పాటు కారులో ఉన్న ఆమె స్నేహితురాళ్లు వినీల, వినీత క్షేమంగా ఉన్నారని ప్రకటించారు. వెంకటేష్, కార్తీక్‌రెడ్డి, విజయకుమార్ మృతదేహాలను పోస్టుమార్టం అనంతరం కుటుంబ సభ్యులకు అప్పగించారు. వీరి మృతితో స్వగ్రామాలతో పాటు చదివే కళాశాలల్లోనూ విషాదఛాయలు అలుముకున్నాయి. నెల్లూరు రూరల్ ఎస్సై గిరిబాబు కేసు దర్యాప్తు చేస్తున్నారు. ఈ ప్రమాదంలో చనిపోయిన ముగ్గురు యువకులు ఆయా కుటుంబాల్లో ఏకైక మగసంతానం కావడంతో రోదనలు మిన్నంటాయి.
(ఇంగ్లీషు కథనం ఇక్కడ చదవండి)

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement