ఇప్పటివరకు నడిచిన దూరం 3,539 కిలోమీటర్లు
26–12–2018, బుధవారం
రంగడి ఘాటి క్రాస్, శ్రీకాకుళం జిల్లా
మీ శ్వేతపత్రంలో ఇసుమంతైనా నిజముందా?
అభివృద్ధి ఆనవాళ్లు మచ్చుకైనా కనిపించని మెళియాపుట్టి మండలంలో ఈ రోజు నా పాదయాత్ర సాగింది. అడుగడుగునా అమాయక గిరిజనులు ఎన్నో బాధలు చెప్పారు. చాపర గ్రామ రైతన్నలు.. అధికార పార్టీ నేతలే కల్తీకి కొమ్ముగాస్తున్నారని చెబుతుంటే ఆశ్చర్యమేసింది. పొలాలకేసే ఎరువులు, మనుషులు తినే ఆహార పదార్థాలు అన్నీ కల్తీ చేస్తున్నారని తెలిపారు. ఓ పక్క.. వేసిన పంటలను తుపానులు ఊడ్చిపెట్టుకుపోతుంటే, మరోపక్క.. కల్తీ ఎరువులు తమ జీవితాలతో ఆడుకుంటున్నాయని బావురుమన్నారు. కల్తీ సరుకులతో ఆరోగ్యాలు గుల్లవుతున్నా ఏ అధికారీ పట్టించుకోవడం లేదని నిస్సహాయత వ్యక్తం చేశారు. సరిహద్దు రాష్ట్రం ఒడిశాను ఆసరా చేసుకుని సాగుతున్న ఈ కల్తీ వ్యాపారం మూలాల్లో తెలుగుదేశం వాళ్లే ఉన్నారని.. అందుకే అన్నీ తెలిసినా ఏ అధికారీ ముందుకెళ్లడం లేదని కన్నీటి పర్యంతమయ్యారు. నిజంగా దారుణం. పాలక నేతలే కల్తీకి కొమ్ము గాస్తూ.. ప్రజారోగ్యంతో చెలగాటమాడుతూ ఆరోగ్యాంధ్రప్రదేశ్, ఆనందాంధ్రప్రదేశ్ అంటూ కోతలు కోయడం హాస్యాస్పదం కాదా?
చాపర జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల పదో తరగతి విద్యార్థినుల ఆందోళన విన్నాక.. ఈ ప్రభుత్వం పిల్లల భవిష్యత్తును ఎంతగా దెబ్బతీస్తుందో తెలుస్తోంది. మరో రెండు నెలల్లో పబ్లిక్ పరీక్షలున్నాయి. ఇప్పటి దాకా సాంఘిక శాస్త్రం పాఠ్యపుస్తకమే అందలేదట. 8వ తరగతి పిల్లలకు సైన్స్ పుస్తకం ఇవ్వలేదట. మేమేం చదువుకోవాలి? ఎలా పరీక్షలు రాయాలన్నా.. అంటూ అమాయకంగా వాళ్లడిగిన ప్రశ్నకు ఈ ప్రభుత్వం ఏం సమాధానం చెబుతుంది? పరీక్ష తప్పినా, మార్కులు తగ్గినా.. దానికి ప్రభుత్వమే కారణం కాదా.. అని నిలదీస్తున్న ఆ చిన్నారుల ఆవేశంలో న్యాయముంది.
అమాయక గిరిజన ఆవాసాల్లోంచి పాదయాత్ర చేస్తున్నప్పుడు నా గుండె బరువెక్కింది. అభివృద్ధికి నోచుకోని గ్రామాలు.. సంక్షేమం అసలే తెలియని గిరిజనం. వీధికో సమస్య.. ఇంటికో కష్టం.. వృద్ధుల పరిస్థితి మరీ దారుణం. చాపరకు చెందిన 70 ఏళ్ల జానకమ్మ భర్తను కోల్పోయింది. వృద్ధాప్య, వితంతు పింఛన్‌లో ఏ ఒక్కటైనా అందినా బాగుండేదని ఆవేదన వ్యక్తం చేసింది. ఏదీ ఇవ్వడం లేదని బాధపడింది.
పాతమారుడుకోటకు చెందిన యండమ్మ వితంతు పింఛన్ కోసం ఆఫీసుల చుట్టూ ఎన్నోసార్లు తిరిగింది. కనిపించిన ప్రతి అధికారికీ మొక్కింది. అయినా ఫలితం లేదు. యలమంచిలి అమ్ములమ్మ చెప్పింది వింటుంటే ఆశ్చర్యమేసింది. అర్హులైన 80 మంది అమాయక ప్రజలపై అధికార పార్టీ నేతలే కక్షగట్టి.. పింఛన్లు ఊడబీకి రోడ్డునపడేశారు. వాళ్లంతా కోర్టుకెళితే.. న్యాయస్థానం మొట్టికాయలేసి పింఛన్లు ఇవ్వాలని గడ్డి పెట్టిందట. కానీ బరితెగించిన ఈ నేతలు మూడు నెలలు పింఛన్ ఇచ్చి.. మళ్లీ మొదటికొచ్చారట. ఇప్పుడు మళ్లీ కోర్టుకెళితేగానీ ఆ పింఛన్లు వచ్చే పరిస్థితి లేదు. నిజంగా ఎంత అన్యాయం? పేదవాడి సంక్షేమం.. కోర్టు మెట్లెక్కాల్సిన దయనీయ స్థితి ఎక్కడైనా ఉందా?
ముఖ్యమంత్రిగారికి నాదో ప్రశ్న.. రాజకీయాలకు అతీతంగా అర్హులందరికీ సంక్షేమ ఫలాలు అందించానని.. ఎవరిపైనా వివక్ష చూపనేలేదని శ్వేతపత్రం విడుదల చేశారు. ప్రస్తుతం నేను పాదయాత్ర చేస్తున్న శ్రీకాకుళం జిల్లాలోని ఒక్క పొందూరు మండలంలో.. మీరు అధికారంలోకి రాగానే వివక్షతో దాదాపు 900 మంది పింఛన్లు తీసేసింది వాస్తవం కాదా? వారు కోర్టుకెళితే.. న్యాయమూర్తులు దిగ్భ్రాంతి చెంది మీ ప్రభుత్వానికి అక్షింతలేసి.. పింఛన్లు పునరుద్ధరించాలని ఆదేశించిన విషయం మర్చిపోయారా? మరి మీ శ్వేతపత్రంలో ఇసుమంతైనా నిజముందా?
- వైఎస్ జగన్
Comments
Please login to add a commentAdd a comment