
ముఖ్యనేత నివేదిక వల్లే విభజన: లగడపాటి రాజగోపాల్
రాష్ట్రానికి చెందిన ఓ ముఖ్యనేత ఇచ్చిన నివేదిక వల్లే కాంగ్రెస్ హైకమాండ్ విభజనపై తొందరపడిందని కాంగ్రెస్ పార్టీ ఎంపీ లగడపాటి రాజగోపాల్ వెల్లడించారు.
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రానికి చెందిన ఓ ముఖ్యనేత ఇచ్చిన నివేదిక వల్లే కాంగ్రెస్ హైకమాండ్ విభజనపై తొందరపడిందని కాంగ్రెస్ పార్టీ ఎంపీ లగడపాటి రాజగోపాల్ వెల్లడించారు. ఆ ముఖ్య నేత ఇటీవల సోనియాగాంధీని కర్ణాటకలోని మాండ్యలో ప్రత్యేకంగా కలిసి రాష్ట్రంలో జరిగిన ఓ సభ, ఉద్యమం తాలుకు పరిస్థితులను వివరించారని చెప్పారు. ఆ నేత ఎవరో త్వరలో వెల్లడిస్తానన్నారు. ఆ నాయకుడి అభిప్రాయం ఆధారంగానే కాంగ్రెస్ హైకమాండ్ నిర్ణయం తీసుకుందన్నారు.
లగడపాటి శుక్రవారం ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఆ నేత ఇచ్చిన సమాచారం తర్వాతే ఢిల్లీలో పరిణామాలు వేగంగా జరిగాయని చెప్పారు. అంతకుముందు ‘నోట్’ ఆలోచన లేని కాంగ్రెస్ హైకమాండ్.. ఆ నేత సమాచారంతో టేబుల్ నోట్‌గా తెలంగాణ ఏర్పాటును ప్రస్తావించి ఆమోదించారని వివరించారు. ‘నష్టాలు చెప్పినప్పటికీ విభజన నిర్ణయం తీసుకోవడం నీచం, బాధాకరం’ అంటూ హైకమాండ్‌పై నిప్పులుచెరిగారు. విభజనపై త్వరలో సుప్రీంకోర్టులో పిటిషన్ వేస్తానని చెప్పారు.