ఆధార్ లేకుంటే సబ్సిడీ గోవిందా!
Published Sat, Aug 17 2013 12:17 AM | Last Updated on Wed, Mar 28 2018 10:56 AM
సాక్షి, రంగారెడ్డి జిల్లా: వంట గ్యాస్ వినియోగదారులకు రాయితీ గుబులు పట్టుకుంది. సెప్టెంబర్ ఒకటో తేదీ నుంచి నగదు బదిలీ కార్యక్రమం అమల్లోకి రానున్న నేపథ్యంలో ఆధార్ కార్డు అందని వారు, బ్యాంకు లింకేజీ కాని వారు ఆందోళన చెందుతున్నారు. గడువు ముంచుకొస్తుండడంతొ సబ్సిడీ అందకుండా పోతుందేమోనన్న భయంతో వినియోగదారులు గడువు విషయమై తెలుసుకునేందుకు గ్యాస్ ఏజెన్సీల చుట్టూ తిరుగుతున్నారు.
ఆధార్- బ్యాంక్ లింకేజీ పథకంలో భాగంగా ప్రభుత్వం నుంచి వచ్చే రాయితీని నేరుగా లబ్ధిదారుల బ్యాంకు ఖాతాలో జమచేస్తారు. ముందుగా వంటగ్యాస్ సిలిండర్‌కు సంబంధించిన రాయితీ నిధులను లబ్ధిదారుని బ్యాంకు ఖాతాలో నేరుగా జమ చేసేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇందుకుగాను లబ్ధిదారులకు ఆధార్ కార్డుల జారీ, వాటితో బ్యాంకు ఖాతా వివరాలను అనుసంధానం చేయాల్సి ఉంటుంది. అయితే జిల్లాలో ఈ ప్రక్రియ నత్తనడకన సాగుతోంది. ఇప్పటివరకు కేవలం 14.5శాతం మంది లబ్ధిదారుల వివరాలు మాత్రమే పూర్తిస్థాయిలో సేకరించడంతో మిగతా లబ్ధిదారులందరికీ రాయితీ పంపిణీ ప్రక్రియ సంకటంలో పడింది.
చేతులెత్తేసిన యంత్రాంగం
ఇప్పటికే గ్యాస్‌కు సంబంధించి నగదు బదిలీ పథకాన్ని పలుమార్లు వాయిదా వేస్తూ వచ్చారు. అయితే వచ్చే నెల నుంచి కచ్చితంగా ఈ పథకాన్ని అమలు చేయనున్నట్లు ప్రభుత్వం ఇప్పటికే స్పష్టం చేసింది. ఈ మేరకు చర్యలు తీసుకోవాలని జిల్లా యంత్రాంగాన్ని ఆదేశించింది. అయితే జిల్లాలో ఆధార్ కార్డుల జారీ, సీడింగ్ ప్రక్రియ నత్తనడకన సాగుతోంది. మరో పక్షం రోజుల్లో పథకం అమల్లోకి రానుండగా ఇప్పటికీ కేవలం 14.5 శాతం మంది లబ్ధిదారుల వివరాలను మాత్రమే పూర్తిస్థాయిలో సేకరించారంటే జిల్లా యంత్రాంగం పనితీరు ఏ విధంగా ఉందో స్పష్టమవుతోంది. జిల్లాలో ఆధార్ నమోదు ప్రక్రియ మొదలై దాదాపు రెండేళ్లు కావస్తున్నది. అయితే ఇప్పటివరకు జిల్లాలో 105 శాతం నమోదు ప్రక్రియ చేసినట్లు పౌరసరఫరాల శాఖ గణాంకాలు చెబుతుండగా.. ఇంకా 250 ఆధార్ కేంద్రాలను కొనసాగిస్తోంది. ఈ లెక్కన జిల్లాలో పూర్తిస్థాయిలో ఆధార్ నమోదు కాలేదని తెలుస్తోంది. మరోవైపు ఆధార్ నమోదు చేసుకున్న వారిలో ఇప్పటివరకు 62.3శాతం మందికి మాత్రమే కార్డులు వచ్చాయి. కార్డులందని వారు యూఐడీఏఐ వెబ్‌సైట్ నుంచిడౌన్‌లోడ్ చేసుకోవాలని అధికారులు చెబుతున్నప్పటికీ.. ‘అండర్ ప్రాసెస్’ అంటూ సమాధానం రావడంతో పౌరసరఫరాల శాఖ అధికారులను సం ప్రదిస్తున్నారు. కార్డుల ప్రక్రియ తమ పరిధిలో లేదంటూ అధికారులు చేతులెత్తేస్తున్నారు.
ఖాతాల ‘వెతలు’
ఆధార్ కార్డులు పొందిన లబ్ధిదారులకు బ్యాంకు ఖాతా తెరవడం సమస్యగా మారింది. ఈ విషయంలో బ్యాంకర్లు నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో లబ్ధిదారులు రోజుల తరబడి ఖాతాల కోసం పలుమార్లు తిరగాల్సివస్తోంది. నగదు బదిలీలో భాగంగా ప్రతి లబ్ధిదారుడు బ్యాంకు ఖాతా తెరవాల్సి ఉంటుంది. జిల్లాలో 13,59,834 గ్యాస్ కనెక్షన్లున్నాయి. వీరిలో ఇప్పటివరకు కేవలం 2,97,053 మంది మాత్రమే బ్యాంకు ఖాతాలు తెరవగా 1,97,204 మంది మాత్రమే ఆధార్ కార్డు సంఖ్యను బ్యాంకు ఖాతాకు అనుసంధానం చేసి వివరాలను గ్యాస్ డీలర్లకు అందించారు. ఖాతాలు తెరిచే ప్రక్రియ జిల్లాలో వెనకబడి ఉంది. మరో పదిహేను రోజుల్లో గడువు ముగుస్తున్నప్పటికీ ఈ ప్రక్రియ పూర్తయ్యే అవకాశం లేదు. ఖాతాలు తెరిచేందుకు ప్రత్యేకంగా బ్యాంకుల్లో కౌంటర్లు ఏర్పాటు చేయాల్సి ఉండగా బ్యాంకర్లు మాత్రం మొక్కుబడి చర్యలు చేపట్టడంతో లబ్ధిదారులు ఇబ్బంది పడుతున్నారు. ఖాతా తెరిచేందుకు దాదాపు వారం రోజులకు పైగా ఇబ్రహీంపట్నం ఎస్‌బీహెచ్ చుట్టూ తిరుగుతున్నానంటూ ఓ లబ్ధిదారుడు ‘సాక్షి’తో ఆవేదన వ్యక్తం చేశారు.
జిల్లాలో మొత్తం గ్యాస్ కనెక్షన్ల సంఖ్య : 13,59,834
ఈఐడీ సంఖ్యతో గ్యాస్ వివరాల అనుసంధానం : 1,53,521
యూఏడీ సంఖ్యతో గాస్ వివరాల అనుసంధానం : 8,48,370
బ్యాంకు ఖాతాలున్న గ్యాస్ లబ్ధిదారులు : 2,97,053
గ్యాస్, ఆధార్, బ్యాంకు ఖాతా వివరాలతో అనుసంధానం :1,97,204
Advertisement
Advertisement