సాక్షి, హైదరాబాద్: వ్యవసాయ రుణాల మాఫీ జాబితాలోకి ఎక్కాలంటే ఏపీ రైతులు తప్పనిసరిగా బ్యాంకులకు వెళ్లి ఆధార్ నంబర్‌తో పాటు రేషన్‌కార్డు జిరాక్స్ ప్రతులను సమర్పించాల్సిందే. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. రుణ మాఫీ భారాన్ని తగ్గించుకోవడంలో భాగంగా రైతుల వడపోతకు గాను ప్రభుత్వం ఆధార్, రేషన్‌కార్డుల లింక్ పెట్టిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే రైతులను బ్యాంకులకు పంపించి ఆధార్, రేషన్‌కార్డుల జిరాక్స్ ప్రతులు ఇచ్చేలా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్లను ఆదేశించనుంది. ఇందుకోసం రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఐ.వై.ఆర్. కృష్ణారావు బుధవారం వారితో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించనున్నారు. రుణ మాఫీ మార్గదర్శకాలకు ప్రభుత్వం మంగళవారం సవరణలు చేసింది. రుణాల వివరాలను వెబ్‌సైట్‌లో పొందుపరిచే పని ప్రారంభిస్తే ఈ ప్రక్రియ పూర్తికి మరో పక్షం రోజుల సమయం పడుతుందని బ్యాంకులు పేర్కొన్నాయి.
వివాదాల పరిష్కారానికి కమిటీ
రైతుల రుణాల మాఫీయే ఇంకా జరగకపోయినా.. ఏపీ సర్కార్ మాత్రం రుణ మాఫీ వివాదాల పరిష్కారానికి ప్రత్యేకంగా కమిటీని ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. రుణ మాఫీ వర్తించని రైతులు సదరు కమిటీకి నివేదించుకోవాల్సి ఉంటుంది. ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు కుటుంబరావు అధ్యక్షతన ఈ కమిటీ రానుంది.