ఏమో పీఎం అవుతారేమో !
హైదరాబాద్: దేశాన్ని పట్టిపీడిస్తున్న అవినీతి, కుంభకోణాలపై యుద్ధం చేసినందు వల్లే ఆమ్‌ఆద్మీ పార్టీ (ఆప్) ఢిల్లీలో స్వల్పకాలంలోనే అధికారంలోకి వచ్చిందని.. పరిస్థితి ఇలాగేవుంటే ఆ పార్టీ అభ్యర్థి ప్రధానమంత్రి అయినా ఆశ్చర్యపోవాల్సిన పన్లేదని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి బీవీ రాఘవులు వెల్లడించారు. అయితే ప్రజల విశ్వాసాన్ని చూరగొన్న పార్టీలే అధికారంలో ఉంటాయని స్పష్టంచేశారు. గురువారం రాత్రి సుందరయ్యవిజ్ఞాన కేంద్రంలో పీపుల్ అగెనెస్ట్ కరప్షన్ ఆధ్వర్యంలో ‘ఆమ్‌ఆద్మీ పార్టీ గెలుపు-ఒక పరిశీలన’ అన్న అంశంపై జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు.
కులాన్ని, మతాన్ని, డబ్బు, మద్యాన్ని పక్కనబెట్టి ఆమ్‌ఆద్మీ పార్టీని గెలిపించారని గుర్తుచేశారు. అయితే రాష్ట్రంలో వామపక్షాలు కూడా కరెంటు,నీటి సమస్యలకు వ్యతిరేకంగా అనేక ఉద్యమాలు చేసినప్పటికీ ప్రజలు ఆప్‌కు దగ్గరకావడం నూతన ప్రచార సాధనాలను వినియోగించడంతోపాటు ఎక్కువగా మీడియాను ఉపయోగించారని చెప్పారు. మాజీఎంపీ సోలిపేట రామచంద్రారెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్, బీజేపీల పాలనలో వ్యత్యాసం లేకపోవడం వల్లే ప్రజలు విసుగుచెంది ప్రత్యామ్నాయంగా ఆప్‌ను గెలిపించారన్నారు. పీపుల్ అగెనెస్ట్ కరప్షన్ కన్వీనర్ డాక్టర్ రాజేందర్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో పురేందరప్రసాద్ పాల్గొన్నారు.