సాక్షి, విజయవాడ : జిల్లాలో సారా జోరు పెరిగింది. ముఖ్యంగా ప్రాదేశిక పోరు నేపథ్యంలో పల్లెలో రాజకీయపార్టీల నేతలు సారా విక్రయాలపై దృష్టిసారించారు. అతి చవకగా దొరికే మద్యం కావటంతో వివిధ రాజకీయపార్టీల నేతలు సారా కొనుగోలు చేసి మరీ మందుబాబులకు పంపిణీ చేస్తున్నారు.
దీంతో జిల్లాలో మళ్లీ సారా విక్రయాలకు భారీగా తెరలేచింది. ప్రసుత్తం జిల్లాలో నెలకు సగటున 30 లక్షల విలువైన సారా విక్రయాలు జరుగుతుండగా జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల పుణ్యమా అని విక్రయాలు రెట్టింపయ్యాయి. సారా కట్టడికి ఎక్సైజ్ అధికారులు తరచు దాడులు చేసి కేసులు నమోదు చేస్తున్నప్పటికి పరిస్థితిలో మార్పు లేదు. మరోవైపు అధికారులు కూడా మద్యం షాపులపై దాడులు చేసేందుకు చూపుతున్న శ్రద్ధ సారా కట్టడిపై చూపటం లేదు. ఈ ఎన్నికల సీజన్‌లో జిల్లాలో సారా విక్రయాలు కోటి రూపాయలు దాటతాయనేది అంచనా.
చర్యలు నామమాత్రం...
జిల్లాలోని మైలవరం, జగ్గయ్యపేట, నూజివీడు, తిరువూరు ప్రాంతాల్లో సారా తయారీ కేంద్రాలతో పాటు విక్రయ ఠ మొదటి పేజీ తరువాయి
కేంద్రాలు ఉన్నాయి. వీటితో పాటు జిల్లా సరిహద్దులోని నల్గొండ, ఖమ్మం జిల్లాల సరిహద్దు తండాల్లో నాటుసారా బట్టీలు పదుల సంఖ్యలో నెలకొన్నాయి.
అక్కడ తయారైన నాటు సారాను జిల్లాలోని వ్యాపారులు దిగుమతి చేసుకొని ప్యాకింగ్ చేసి మరీ విక్రయాలు సాగిస్తున్నారు. నిత్యం వేల లీటర్ల సారా విక్రయాలు జరుగుతున్నా ఎక్సైజ్ అధికారులు కట్టడి చేయటంలో విఫలమయ్యారు. ప్రస్తుతం ఎన్నికల సీజన్ కావటంతో ఎక్కువ కేసులు నమోదుచేశారు.
అందుబాటులో లేని మద్యం...
ఈ నెల 6, 11 తేదీల్లో జిల్లాలో రెండు విడతలుగా జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు జరగనున్నాయి. సాధారణంగా గతంతో పోల్చుకుంటే ఎన్నికల ఖర్చులు భారీగా పెరిగాయి. ఎన్నికల్లో కీలకపాత్ర పోషించే మద్యం ధరలకు రెక్కలు రావటంతో పాటు వరుస ఎన్నికలు రావటంతో జిల్లాలో మద్యం నిల్వల కొరత ఏర్పడింది.
రానున్న సార్వత్రిక ఎన్నికల్ని దృష్టిలో ఉంచుకొని మద్యాన్ని వ్యాపారులు రహస్యప్రాంతాల్లో ఇప్పటికే నిల్వలు చేశారు. దీంతో ప్రస్తుత ఎన్నికలు పల్లెలు కేంద్రాలుగా జరగనున్న నేపథ్యంలో మద్యం స్థానంలో సారా విక్రయాలకు తెరలేచింది. దీంతో సారా ధరలకు రెక్కలొచ్చాయి.
లాభసాటి బేరం...
గతంలో అర లీటరు సుమారు రూ.50కి విక్రయించగా ప్రస్తుతం 100 ఎంఎల్ ప్యాకెట్‌ను రూ.20కి విక్రయిస్తున్నారు. దీంతో వ్యాపారం లాభసాటిగా ఉందని అనేక మంది బెల్ట్‌షాపుల నిర్వాహకులు సారా విక్రయాలపై దృష్టిసారించారు. ఖమ్మం జిల్లాలోని మధిర ప్రాంతం నుంచి నిత్యం రైలులో నగరానికి, మైలవరం, కొండపల్లి ప్రాంతానికి సారా నిల్వలు దిగుమతి అవుతున్నట్లు సమాచారం. నగరంలోని పాల ఫ్యాక్టరీ సెంటర్‌లో సారా విక్రయాలు బహిరంగంగానే జరుగుతున్నాయి.
ముఖ్యంగా పశ్చిమ కృష్ణా పరిధిలోని రెడ్డిగూడెం, జికొండూరు, ఎ.కొండూరు, మైలవరం, తిరువూరు, చాట్రాయి, వీరులపాడు, జగ్గయ్యపేట తదితర ప్రాంతాల్లో ప్రస్తుతం విక్రయాలు జోరుగా సాగుతున్నాయి. జిల్లాలో అనధికారికంగా ఉన్న 150కి పైగా బెల్ట్‌షాపుల్లో సారా విక్రయాలు జరుగుతున్నాయి. సారా తయారీకి ఉపయోగించే నల్లబెల్లం విక్రయాలు నూజివీడులో అధికంగా జరుగుతుంటాయి. నూజివీడులో ప్రత్యేకంగా కొన్ని హోల్‌సేల్ నల్లబెల్లం షాపులు కూడా ఉన్నాయి.
2.4 లక్షల లీటర్ల బెల్లపు ఊట ధ్వంసం...
జిల్లాలో నాటుసారా తయారీకి వినియోగించే బెల్లపు ఊట నిల్వల్ని ఎక్సైజ్ అధికారులు గత నెలరోజుల వ్యవధిలో భారీగా ధ్వంసం చేశారు. ముఖ్యంగా విజయవాడ ఎక్సైజ్ డివిజన్ పరిధిలో అధికంగా సారా విక్రయాలు జరిగే నూజివీడు, తిరువూరు, జగ్గయ్యపేటలో ఎక్కువ నిల్వలు ధ్వంసం చేసి నిర్వాహకులపై కేసులు పెట్టారు.
విజయవాడ డివిజన్‌లో ఇప్పటివరకు 2.17 లక్షల లీటర్ల బెల్లం ఊటను ధ్వంసం చేయగా, 4,100 నాటుసారాను సీజ్ చేసి ధ్వంసం చేశారు. మచిలీపట్నం డివిజన్ పరిధిలో 23 వేల లీటర్ల బెల్లం ఊటను ధ్వంసం చేసి 990 లీటర్ల సారాను సీజ్ చేసి ధ్వంసం చేశారు.
పల్లెల్లో సారా జోరు
Published Fri, Apr 4 2014 3:03 AM | Last Updated on Mon, Sep 17 2018 5:10 PM
Advertisement
Advertisement