రాష్ట్రవ్యాప్తంగా జరుగుతున్న స్థానిక సంస్థల ఎన్నికలను పలు ప్రాంతాల్లో ఓటర్లు బహిష్కరించారు.
హైదరాబాద్ : రాష్ట్రవ్యాప్తంగా జరుగుతున్న స్థానిక సంస్థల ఎన్నికలను పలు ప్రాంతాల్లో ఓటర్లు బహిష్కరించారు. సమస్యల పరిష్కారమయ్యేవరకు ఓటు వేసేది లేదని గ్రామస్తులు పట్టుదలతో ఉన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా పెనుమంట్ర మండలం భట్లమగుటూరు గ్రామస్తులు ఎన్నికలను బహిష్కరించారు. గ్రామంలో కనీస అవసరాలు తీర్చాలని డిమాండ్ చేస్తూ వారు పోలింగ్కు దూరంగా ఉన్నారు. మరోవైపు విశాఖపట్నం జిల్లా డుంబ్రిగూడ మండలం పుట్టిలో గ్రామస్తులు ఎన్నికలను బహిష్కరించారు. గ్రామంలో అభివద్ధి చేయలేదంటూ నిరసన తెలుపుతూ వీరు ఎన్నికలను బహిష్కరించారు.
ఇక మహబూబ్నగర్ జిల్లా జడ్చర్ల మండలం కిష్టంపల్లి గ్రామస్తులు ఎన్నికలను బహిష్కరించి తమ నిరసన తెలిపారు. ప్రత్యేక గ్రామ పంచాయతీ హోదా కల్పించాలంటూ స్థానిక ప్రజలు ఎన్నికలకు దూరంగా ఉన్నారు. అలాగే ప్రకాశం జిల్లా కురిచేడు మండలంలో ఎన్ఎస్పీ కాలనీ వాసులు పోలింగ్ను బహిష్కరించారు. తమ ఓట్లు మరో పోలింగ్ బూత్కు మార్చారంటూ నిరసన తెలిపారు.