
ఆరు నెలల్లో అన్నీ వైఫల్యాలే
ఎచ్చెర్ల : చంద్రబాబునాయుడు నేతృత్వంలో రాష్ట్రప్రభుత్వం ఏర్పడి ఈ నెల 9వ తేదీకి ఆరు నెలలవుతోందని, ఈ ఆర్నెల్లలో అన్నీ వైఫల్యాలనే మూటగట్టుకున్నారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర బీసీ సెల్ కన్వీనర్, మాజీ ఎమ్మెల్యే ధర్మాన కృష్ణదాస్ అన్నారు. రణస్థలంలోని వైఎస్సార్ సీపీ కార్యాలయంలో గురువారం విలేకరుల సమావేశంలో ఆయన ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టారు. రైతులకు చెల్లని బాండ్లు ఇచ్చి మరో మోసం చేయాలని చూస్తోందని ఆరోపించారు. ఇచ్చిన హామీలను అమలు చేయాలని కోరుతూ, ప్రభుత్వ వైఫల్యాలకు నిరసనగా రైతుల పక్షాన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా శుక్రవారం కలెక్టరేట్ల వద్ద ధర్నా కార్యక్రమం నిర్వహిస్తున్నట్టు తెలిపారు.
పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి విశాఖపట్నంలో నిర్వహించే ధర్నాలో పాల్గొంటారన్నారు. ప్రజల పక్షాన నిరంతరం తమ పార్టీ పోరాడుతుందన్నారు. తమ పార్టీ చేపడుతున్న ఈ ఆందోళనలో ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొనాలని కోరారు. జిల్లా పార్టీ అధ్యక్షురాలు రెడ్డి శాంతి మాట్లాడుతూ రైతురుణమాఫీలో జాప్యం కారణంగానే పంటలబీమా, రుణాల రీషెడ్యూల్ వంటి అవకాశాలను రైతులు కోల్పోయారన్నారు. డ్వాక్రా సంఘాల పొదుపు నుంచి బ్యాంకర్లు డబ్బులు తీసుకుంటున్నారని, మహిళలకు నోటీసులు ఇస్తూ హింసిస్తున్నారన్నారు. అందుకే ప్రజల పక్షాన తమ పార్టీ పోరాడుతోందన్నారు. పేదల కడుపు కొడితే సహించేది లేదన్నారు. ఇసుక రేట్లు పెంచి పేద, మధ్య తరగతి ప్రజలకు సొంతింటి కలను దూరం చేశారన్నారు.
నియోజకవర్గ సమన్వయకర్త గొర్లె కిరణ్‌కుమార్ మాట్లాడుతూ కలెక్టరేట్ వద్ద పార్టీ నిర్వహిస్తున్న ధర్నాకు మద్దతుగా నియోజకవర్గం నుంచి బైక్ ర్యాలీ నిర్వహించనున్నట్టు చెప్పారు. రణస్థలం, లావేరు, జి.సిగడాం, ఎచ్చెర్ల మండలాల నుంచి బైక్ ర్యాలీలు శ్రీకాకుళంలో సింహద్వారం వద్దకు చేరు కొని, అక్కడి నుంచి రైతులు, డ్వాక్రా సంఘాల మహిళలతో కలెక్టరేట్‌కు చేరుకుంటాయన్నారు. రణస్థలం జెడ్పీటీసీ సభ్యుడు గొర్లె రాజ్‌గోపాల్ నాయుడు, ఎచ్చెర్ల, లావేరు, రణస్థలం, జి.సిగడాం మండలాల పార్టీ కన్వీనర్లు మూడుగుల ముర ళీధర్‌బాబా, దన్నాన రాజ న్నాయుడు, పైడి శ్రీనివాసరావు, అబోతుల జగన్నాథం, ఎచ్చెర్ల మాజీ జెడ్పీవిప్ సనపల నారాయణ రావు తదితరులు పాల్గొన్నారు.
బాబును నిలదీద్దాం రండి
నరసన్నపేట రూరల్ : ఎన్నికల హామీలను అటకెక్కించి రైతులను, చేనేత కార్మికులను, డ్వాక్రా మహిళలను, ప్రజలను టీడీపీ ప్రభుత్వం మోసం చేసిందని వైఎస్సార్ సీపీ బీసీ సెల్ విభాగం రాష్ట్ర అధ్యక్షుడు ధర్మాన కృష్ణదాసు, జిల్లా పార్టీ అధ్యక్షులు రెడ్డి శాంతి అన్నారు. నరసన్నపేటలో గురువారం సాయంత్రం వారు విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ అన్నివర్గాల ప్రజలను మోసగిస్తున్న ప్రభుత్వ వైఖరికి నిరసనగా వైఎస్సార్ సీపీ ఆధ్వర్యంలో శుక్రవారం కలెక్టరేట్ వద్ద జరిగే ధర్నాకు భారీ ఎత్తున తరలిరావాలని ప్రజలకు పిలుపునిచ్చారు. బాబు వాగ్దానాలతో దగాపడ్డ రైతులు, మహిళలు, చిరుద్యోగులు, నిరుద్యోగులు ఈ ధర్నాలో అధికంగా పాల్గొనాలని పిలుపు నిచ్చారు.
పభుత్వం ప్రకటించిన నూతన ఇసుక విధానంతో నాటుబళ్లపై ఇసుకను తీసుకువచ్చే వారి కుటుంబాలు, భవన నిర్మాణ కార్మికుల కుటుంబాల్లో ఆకలి కేకలు వినిపిస్తున్నాయన్నారు. టీడీపీ పాలనకు వ్యతిరేకంగా శుక్రవారం జరుగుతున్న మహాధర్నాలో అందరూ పాల్గోవాలని పిలుపు నిచ్చారు. ప్రతీ గ్రామం నుంచి కనీసం 10 మంది కార్యకర్తలు మహాధర్నాకు తరలి రావాలన్నారు. వైఎస్సార్ సీపీ నాయకులు అంధవరపు సూరిబాబు, చింతు రామారావు, ఆరంగి మురళి, బగ్గు రామకృష్ణ, యాళ్ల కృష్ణంనాయుడు, రాజేశ్వరరావు, రాంబాబు, పాగోటి అప్పారావు తదితరులు పాల్గొన్నారు.